వలంటీర్లు: వైఎస్ జగన్ కు చంద్రబాబు కౌంటర్ ప్లాన్

By Pratap Reddy KasulaFirst Published Jan 9, 2022, 9:46 AM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి టీడీపీ అదినేత చంద్రబాబు సిద్ధపడ్డారు. ఆ విషయాన్ని చంద్రబాబు తన కుప్పం పర్యటనలో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థను కౌంటర్ చేసేందుకు తెలుుగదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ వేసినట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతిదాన్నీ వారి ద్వారా ప్రజల ఇళ్లకే చేరవేస్తున్నారు. దానివల్ల వాలంటీర్లు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబంతో సంబంధాలను పటిష్టం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా ప్రజల ఇళ్లకే చేరుతున్నాయి. దానివల్ల వైఎస్ జగన్ కు రాజకీయ ప్రయోజనం కూడా చేకూరుతుంది.

వలంటీర్లు ప్రతి కుటుంబంతో సంబంధాలను పటిష్టపరుచుకుంటారు. తద్వారా ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెసుకు విజయం చేకూర్చేందుకు కృషి చేస్తారు. వచ్చే ఎన్నికల్లో విజయానికి వైఎస్ జగన్ వేసిన అత్యంత పటిష్టమైన, కీలకమైన పథకం వలంటీర్ల వ్యవస్థ. దీన్ని దెబ్బ కొడితే గానీ ఇతర పార్టీలకు రాజకీయంగా వైసీపీని ఢీకొట్టే అవకాశం ఉండదు. ఇది గమనించే చంద్రబాబు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన కుప్పం నియోజకవర్గం పర్యటనలో వెల్లడించారు కూడా. 

చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు. చివరి రోజు శనివారంనాడు ఆయన నియోజకవర్గంలోని సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే తన వ్యూహాన్ని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు రాజకీయపరమైన పనులను, పార్టీ పనులను వలంటీర్లకు అప్పగించిందని ఆయన చెప్పారు. ఆ రకంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అధికార దుర్వ్యినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ వలంటీర్ల వ్యవస్థకు తాను ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అదే సమయంలో చంద్రబాబు చెప్పారు. 

తాను ఇప్పుడే సేవామిత్రలను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రతి వంద మందికి ఒ యువప్రతిిధిని పార్టీ తరఫున ఏర్పాటు చేస్తానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే వలంటీర్లుగా మారుస్తానని చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి అటువంటి వ్యవస్థనే టీడీపీకి అవసరమని చంద్రబాబు గుర్తించారని చెప్పాలి. అందులో భాగంగానే సేవామిత్రలను ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధపడినట్లు చెప్పవచ్చు. 

ఇదిలావుంటే, కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి వైఎస్ జగన్ పక్కా ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోంది. దాన్ని అమలు చేసే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దాంతోనే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలోనూ టీడీపీ ఘోరమైన ఫలితాలు సాధించింది. చంద్రబాబు తన మూడు రోజుల పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానికి అంతే ఘాటుగా బదులిచ్చారు. కుప్పంలో వైసీపీని గెలిపించి జగన్ కు కానుకగా ఇస్తానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం నిలదొక్కుకోలేని పరిస్థితిని కల్పించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ స్థితిలో చంద్రబాబు దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నారు. 

click me!