కాంగ్రెస్ పార్టీ అసలుకే ఎసరు.. మరో సింధియాగా రేవంత్ రెడ్డి..?

By Sree S  |  First Published Mar 13, 2020, 1:31 PM IST

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గట్టి దెబ్బలు తగులుతున్నాయి. వరుసగా నాయకులు దశాబ్దాల కాలంగా అంటిపెట్టుకొని ఉన్నవారు కూడా పార్టీని వీడుతున్నారు. ప్రాస్తుతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ఘోర వైఫల్యాలను చవి చూసింది. ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీలో నూతన జవసత్వాలు నింపాలంటే నాయకత్వ మార్పే తక్షణం కనబడుతున్న ఒక సొల్యూషన్.


కేసీఆర్ తనయుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేసిన కేసులో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ నిరాకరించింది. వాస్తవానికి మిగిలిన అందరితోపాటు రేవంత్ కి కూడా బెయిల్ వస్తుందని అందరూ భావించినప్పటికీ... రేవంత్ కి మాత్రం బెయిల్ రాలేదు. 

రేవంత్ వ్యవహారంపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత 71 సంవత్సరాల వి. హనుమంత రావు రేవంత్ రెడ్డి వ్యవహారంపై తీవ్రంగా మంది పడడమే కాకుండా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. 

Latest Videos

undefined

111జీవో కు సంబంధించి గతంలోనే చాలా మంది ఇండ్లు కట్టుకున్నారని, కట్టుకోనిదెవ్వరని రేవంత్ వైఖరిని తప్పుబడుతూ ఆయనను ఎదురు ప్రశ్నించారు. తన మీద వచ్చిన ఆరోపణలను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి మరో వివాదాస్పద అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాదంతం చేయడమేంటనీ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. 

రేవంత్ రెడ్డి ని హీరో అనడం మానాలని, రేవంత్ హీరో అయితే.... తాము జీరోలమా అని ఆయన ఫైర్ అయ్యారు. ఇకపోతే గోపన్ పల్లి భూముల వ్యవహారంలో తన మీద వచ్చిన ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని రేవంత్ పై ఆరోపణలు గుప్పించారు. 

అసలు గోపన్ పల్లి భూముల వ్యవహారం ఏమిటి...? 

హైద్రాబాద్ గోపనపల్లి సర్వే నెంబర్ 127లో గల 10.21 ఎకరాల భూమికి సంబంధించి తప్పుడు పత్రాలతో విక్రయాలు జరిగాయని  ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై కొందరు కోర్టును కూడ ఆశ్రయించారు. ఈ విషయమై ప్రభుత్వం విచారించింది. 

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో 10.21 ఎకరాల భూమి ఉంది. 1977 వరకు ఈ భూమి వడ్డె హనుమ, అతని వారసుడు వడ్డె మల్లయ్య పేరు మీద ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. కానీ, 1978 నుంచి ఈ భూమి మల్లయ్య పేరు మీద పహాణీలో నమోదవుతూ వస్తున్నది. మల్లయ్య పేరు ఉంది కానీ, ఆయన ఇంటి పేరు లేదు. 

1993-94 నుంచి ఈ భూమికి పట్టాదారుగా దబ్బ మల్లయ్య అని రెవెన్యూ రికార్డుల్లో ఎంటర్ అవుతూ వస్తున్నది. దబ్బ మల్లయ్య పేరును ఎంటర్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, 2001-02 నుంచి పహాణీల్లో మల్లయ్య పేరును తొలగించారు. 

Also read: గోపన్‌పల్లి భూములపై ప్రభుత్వం చర్యలు : మండలిలో మంత్రి ప్రశాంత్

2005లో అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/తహసిల్దార్ ఇ.మల్లయ్యకు వారసుడిగా చెప్పుకునే ఇ.లక్ష్మయ్య పేరు మీద 2 ఎకరాల 21 గుంటల భూమిని రాశారు.. ఆ భూమి లక్ష్మయ్య కాస్తులో ఉన్నట్లు తేల్చేశారు. అదే తహసిల్దార్ మళ్ళీ ఈ వివరాలను సవరిస్తూ లక్ష్మయ్య కేవలం 31 ½ గుంటల్లో ఉన్నట్టు రికార్డులు నమోదయ్యాయి.

 ఎలాంటి ఆధారం లేకుండానే లక్ష్మయ్య పేరు మీద మొదట 2 ఎకరాల 21 ఎకరాలను రాయడం, మళ్లీ సవరించి 31 ½ గుంటలకు మార్చడం రెండూ కూడా తహసిల్దార్ తన అధికార పరిధిని అతిక్రమించారని  రెవిన్యూ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ఇలా అక్రమంగా లక్ష్మయ్య పేరు మీద రికార్డుల్లో ఎంటర్ అయిన 31 ½ గుంటల భూమిని అనుముల రేవంత్ రెడ్డి కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ రాసుకొన్నారు.. ఇ. లక్ష్మయ్యకు ఎలాంటి పట్టదారు హక్కులు లేనప్పటికీ అతని నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు చేసుకున్న సేల్ డీడ్ ఆధారంగా రేవంత్ రెడ్డి కి అనుకూలంగా తహసిల్దార్ వ్యవహరించారని రెవిన్యూ ఉన్నతాదికారులు  తేల్చేశారు.

 రేవంత్ రెడ్డి పేరును ఈ భూమికి హక్కు దారుడిగా పేర్కొంటూ 2005లో అప్పటి తహసిల్దార్ రికార్డుల్లో ఎంటర్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇ.లక్ష్మయ్య ఒక ఎకరం 29 గుంటల భూమిని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి అమ్మాడు. అధికారులు ఆ కొనుగోలు ప్రకారం కొండల్ రెడ్డి పేరిట 2015లో మ్యుటేషన్ చేశారు. 

మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ తన పేరు మీద ఉన్న డాక్యుమెంట్ల ద్వారా డి.మల్లయ్య అనే వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల భూమిని కళావతి అనే వ్యక్తికి అమ్మాడు. ఈ భూమిని కూడా అధికారులు కళావతి పేరు మీద మార్పిడి (మ్యుటేషన్) చేశారు. ఆ తర్వాత ఆ భూమిని కళావతి అనే వ్యక్తి ఎ. కొండల్ రెడ్డి పేరు మీదికి బదిలీ చేశారు.  

ఇంకోవైపు 1989లో ఎ. వెంకటరెడ్డి అనే వ్యక్తి దబ్బ మల్లయ్య నుంచి ఒక ఎకరం పదున్నర గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే 1989లో దబ్బ మల్లయ్య పేరు మీద భూమి ఉన్నట్లు రికార్డుల్లో లేదని రెవిన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. 

వెంకటరావు ఈ భూమిలోని 13 గుంటల భూమిని తర్వాత ఎ. కొండల్ రెడ్డి పేరు మీదికి బదలాయించారు. గోపనపల్లిలోని సర్వే నెంబరు 127లో గల భూమికి హక్కు దారులెవరు అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు తేల్చారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా గతంలో పని చేసిన శ్రీనివాస్ రెడ్డి ని  సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

గోపనపల్లిలోని సర్వే నెంబరు 127లో గల భూమికి సంబంధించి తమకు హక్కు ఉందని, అనుముల  రేవంత్ రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కొల్లా అరుణ 2017 లో హైకోర్టులో రిట్ పిటిషన్ (17542/17637) వేశారు. 

అనుముల కొండల్ రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ (780/2015) దాఖలు చేశారు. 

తప్పుడు డాక్యుమెంట్ల్ ఆధారంగా, తప్పుడు మ్యుటేషన్లు చేసినందుకు తప్పుడుగా రికార్డుల్లో నమోదు చేసేనందుకు గతంలో శేరిలింగంపల్లి తహసిల్దార్ గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు. 

ఈ నివేదిక ఆధారంగా ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.అత్యంత విలువైన గోపన పల్లి భూ లావాదేవిలతో పాటు ఆయన పనిచేసిన సమయంలో జరుగిన అన్ని భూ లావాదేవిలపై సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. 

 రేవంత్ రెడ్డి అతడి సోదరుడితో కలిసి తప్పుడు డాక్యుమెంట్లతో అత్యంత ఖరీదైన భూమిని తన పేరున మ్యుటేషన్ చేయించుకొన్నట్టుగా  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు. 

కాంగ్రెస్ సీనియర్ల ఆరోపణలు ఏమిటి...?

ఇలా ఈ గోపనపల్లి భూముల వ్యవహారం వెలుగులోకి వస్తుంది అనగానే 111 జీవో పేరిట అనవసర రాద్ధాంతం చేసాడు రేవంత్ రెడ్డి అని వారు ఆరోపిస్తున్నారు. ఇలా ఏకపక్షంగా ఏదైనా ఒక విషయంపై ఒక్కడే ఎలా పోరాడుతాడని, పార్టీలో చర్చించి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని సీనియర్లు అంటున్నారు. 

ఈ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ వైఖరిని తప్పుబట్టడమే కాకుండా అధికార తెరాస కు అనుకూలంగా కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో భూమి 111 జీవో పరిధిలోనిది అనేది రేవంత్ వాదన. 

దాన్ని కూడా తోసిపారేస్తూ అక్కడ ఎప్పటినుండో అందరూ కట్టుకున్నారు, ఎవ్వరు కట్టుకోలేదు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అధికార పక్షానికి చెందిన ఏదైనా ఒక చిన్న తప్పు దొరికినా విరుచుకుపడాల్సిన ప్రతిపక్షం ఇలా మిన్నకుండా ఉండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయింది. 

రేవంత్ వర్గీయులు ఏమంటున్నారు...?

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించే సమయంలోనే ఇలాంటివాటిని కావాలని ప్రభుత్వం తీసుకువస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వం ఈ విషయంగా ఇంతలా స్పందించడానికి కాంగ్రెస్ వర్గాలే కారణమని వారు ఆరోపిస్తున్నారు. 

ప్రభుత్వంతో చేతులు కలిపి కొందరు కాంగ్రెస్ నాయకులు ఇలా గోపనపల్లి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఇరికించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ భూములకు సంబందుంచిన వ్యవహారం ఎప్పటిదో ఒక 15 సంవత్సరాల కిందటిది అని, అప్పుడు అక్రమం కానిది ఇప్పుడెందుకు అక్రమం అయిందని వారు ప్రశ్నిస్తున్నారు.

Also read: రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి పరోక్ష షాక్ లు: రామేశ్వర రావుకు మద్దతు 

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ భూములపై ఏవిధమైన తప్పులు కనబడనప్పుడు... ఇప్పుడు కావాలని ప్రభుత్వంతో కుమ్మక్కయి కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇలా రేవంత్ ని అప్రతిష్టపాలు చేసి ఆయనకు పీసీసీ పదవి దక్కకుండా చేస్తున్నారని వారు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. 

ప్రస్తుత స్థితి... వాస్తవాలు.... 

కేసు విషయాన్నీ అటుంచితే... రేవంత్ కి పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని గతంలోనే ప్రచారం సాగింది. రేవంత్ తన కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు కూడా. 

ఆ తరువాత వేరే పార్టీ నుంచి వచ్చిన పారాచూట్ నేతలకు పీసీసీ పదవిని ఎలా కట్టబెడతారని సీనియర్లు ఢిల్లీలో మకాం వేసి మారి అప్పట్లో అడ్డుపడ్డ విషయం తెలిసిందే. రేవంత్ వేరే పార్టీ నుండి వచ్చినవాడన్న ఒక విషయంతో పాటు రేవంత్ ని అడ్డుకోవడానికి అప్పట్లో కులం కార్డును కూడా వాడారు. 

ఎప్పుడు రెడ్లకే ఇస్తారా... వేరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కనబడడం లేదా అని విహెచ్ లాంటి నేతలు అప్పట్లో బాహాటంగానే అన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండడం సహజం. అందునా కాంగ్రెస్ లాంటి పార్టీలో అది అత్యంత సహజం. 

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు పీసీసీ పగ్గాలు దక్కకుండా చూడడానికి మహబూబ్ నగర్ నల్గొండ రెడ్ల మధ్య ఉన్నా వర్గపోరు కూడా ఒక కారణం. ఇన్ని కారణాల నేపథ్యంలో రేవంత్ కి పీసీసీ పగ్గాలు దక్కడంలేదు. 

రేసులో ఎవరెవరు...?

కాంగ్రెస్ లో పీసీసీ రేసులో అందరూ ముందుంటారు. కాంగ్రెస్ కి ఉన్న బలం బలహీనత అదే! పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం సానుకూలాంశం అయితే... గ్రూపు తగాదాలు కాంగ్రెస్ ని అత్యధికంగా ఇబ్బందిపెట్టే మరో అంశం. 

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గట్టి దెబ్బలు తగులుతున్నాయి. వరుసగా నాయకులు దశాబ్దాల కాలంగా అంటిపెట్టుకొని ఉన్నవారు కూడా పార్టీని వీడుతున్నారు. ప్రాస్తుతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ఘోర వైఫల్యాలను చవి చూసింది. 

ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీలో నూతన జవసత్వాలు నింపాలంటే నాయకత్వ మార్పే తక్షణం కనబడుతున్న ఒక సొల్యూషన్. ఉన్న అందరూ నేతలు కూడా తమ ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సోషల్ మీడియా ప్రభావం వల్లనో, లేదా తెరాస నేతలు అధికంగా టార్గెట్ చేయడం వల్లనో రేవంత్ రెడ్డి వైపు అందరి చూపు ఉంది. 

దానికి తోడు ఆయనకు యూత్ లో ఒక క్రేజ్ ఉంది. కెసిఆర్ లాగ వాగ్ధాటి అతని సొంతం. కేసీఆర్ పిట్టకథలకు అవే పిట్టకథలతో కౌంటర్ వేయగలడు. కేసీఆర్ తో ధీ అంటే ధీ తినగలిగే నేత. 

కాంగ్రెస్ ని అందరూ యువ నేతలు వీడుతున్నారు. పార్టీలోని సీనియర్లకు జూనియర్లకు మధ్య విభేదాలు కేవలం ఒక్క తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కనబడుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడడం ఇందుకోక మంచి ఉదాహరణ. ఇంకా ఇప్పటికి కూడా ఒక బలమైన నాయకుడిని ఎన్నుకోకుండా కాంగ్రెస్ ఆలస్యం చేస్తే పార్టీ ఉనికికే ప్రమాదం. 

click me!