ఘటిక విజయ్ కుమార్ కు ఉద్వాసన: కేసీఆర్ చేతిలో అక్రమార్కుల చిట్టా

By telugu teamFirst Published Mar 3, 2021, 4:47 PM IST
Highlights

తన కార్యాలయంలోని అక్రమార్కులపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అందుకు విజయ్ కుమార్ ఉద్వాసనతో శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్.:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్వోగానూ,  ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ (జీఎం) గానూ ఘటిక విజయ్ కుమార్ కు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అక్రమార్జున చేసే అధికారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ టీమ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అటువంటి అధికారులపై చర్యలు తీసుకునే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఘటిక విజయ్ కుమార్ ఉద్వాసన ఇందులో మొదటి అడుగుగా చెబుతున్నారు.

తాను సీఎం పీఆర్వోగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు విజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ట్రాన్స్ కో జీఎం పదవి విషయంలో ఆయన చెప్పినట్లు లేదు. అయితే, ప్రభుత్వం ఆయనకు ఉద్వాసన చెప్పినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వందల కోట్ల అక్రమార్జన, భూదందాలు, అధికారి దుర్వినియోగం వంటి వారిపై కేసీఆర్ టీమ్ దృష్టి పెట్టి, జాబితాను తయారు చేసినట్లు తెలుస్తోంది. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల వ్యవహారాల్లో తలదూరుస్తూ, ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి పేరును వాడడం, ముఖ్యమంత్రి చెప్పారంటూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశాలివ్వడం, ఇష్టారాజ్యంగా పైరవీలు చేయడం, విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టడం ఆరోపణలు సీఎంవోలో పనిచేస్తున్న కొందరు అధికారులపై, ఉద్యోగులపై వచ్చినట్లు, అటువంటి వారిపై కేసీఆర్ గరంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిని ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. 

Also Read: కేసీఆర్ నమ్మిన బంటు: సీఎం పీఆర్వో విజయ్ కుమార్ రాజీనామా

సీఎంవో కార్యాలయానికి క్లీన్ ఇమేజ్ తేవాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై కేసీఆర్ తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అక్రమార్జన చేస్తున్నవారి వివరాలను, జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎంవో ప్రక్షాళనకు విజయకుమార్ కు ఉద్వాసన పలకడం ద్వారా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మరికొంత మంది విషయంలో ఇదే జరుగుతుందని అంటున్నారు. 

సీఎంవోలోని మరో ఉద్యోగిపై కూడా త్వరలో వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అతనిపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.  విజయ్ కుమార్ అక్రమాల చిట్టా సీఎం వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణల చిట్టా సోషల్ మీడియాలో వైరల్ అపుతున్నాయి కూడా. అయితే విజయ్ కుమార్ మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు.ఓ మంత్రిని ఆయన తప్పు పడుతున్నట్లు చెబుతున్నారు. 

అక్రమార్జనతో కోట్లు  గడించినవారిపై ఏసీబీ చర్యలకు ప్రభుత్వం ఆదేశిస్తుందా, లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తునకు ప్రభుత్వం పూనుకుంటుందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. 

click me!