ఇంగ్లండుపై పింక్ బాల్ టెస్ట్: ఇందియా గెలిచింది, ఫ్యాన్స్ ఓడారు

By telugu teamFirst Published Feb 26, 2021, 2:25 PM IST
Highlights

ఇంగ్లండు, ఇండియా మధ్య ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ఖతమైంది. పిచ్ సమస్య లేదని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంటున్నారు. ఇండియా గెలిచింది కానీ ఫ్యాన్స్ ఓటమి పాలయ్యారు.

ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ఖతమైంది. ఇంగ్లాండు, ఇండియా మధ్య మొతేరా స్టేడియంలో జరిగిన డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండుపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ స్థితిలోనే మొతేరా స్టేడియం పిచ్ మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

అయితే, పిచ్ సమస్య ఏమీ లేదని, పిచ్ బాగానే ఉందని, బ్యాటింగ్ బాగా లేదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. పిచ్ లో దెయ్యాలేమీ లేవని రోహిత్ శర్మ అన్నాడు. బ్యాటింగ్ మాత్రమే బాగా లేదని ఆయన అన్నాడు. అయితే, ఇరు జట్లు కూడా రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ స్కోర్లే సాధించాయి. స్పిన్ మాయాజాలానికి బ్యాటింగ్ కకావికలమైంది. 

అయితే, టెస్టు మ్యాచులో ఇలా రెండు రోజుల్లోనే ముగిసిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటి వరకు మొత్తం 2412 టెస్టు మ్యాచులు జరగగా, 22 మ్యాచులు మాత్రమే రెండు రోజుల్లో ముగిశాయి. ఈ 22 మ్యాచుల్లో 13 మ్యాచుల్లో ఇంగ్లండు జట్టు భాగస్వామిగా ఉంది. వీటిలో ఇంగ్లండు 2 సార్లు గెలిచి, 4 సార్లు ఓటమి పాలైంది. మొతేరా స్టెడియంలో మాత్రం ఇంగ్లండు ఆటగాళ్లు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురైనట్లు కనిపించారు. 

నిజానికి, ఇండియా పింక్ బాల్ టెస్టు మ్యాచులో భారత్ ఇద్దరు పేసర్లతో మాత్రమే, ముగ్గురు స్నిన్నర్లతో మైదానంలోకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పింక్ బాల్ కు సాధారణంగా బౌన్స్ ఎక్కువగా వస్తుంది. పేసర్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఇద్దరు పేసర్లతో మాత్రమే భారత్ మైదానంలోకి దిగడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. 

కాగా, పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండు అందుకు విరుద్ధంగా ఒక్క స్నిన్నర్ తో మాత్రమే బరిలోకి దిగింది. అంటే, పిచ్ మీద ఇంగ్లండుకు సరైన అవగాహన లేదని అనిపిస్తోంది. అయితే, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం వల్ల ఫలితం అనుకూలంగా వచ్చింది. పిచ్ అనూహ్యంగా స్పిన్నర్లకు అనుకూలించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్, ముఖ్యంగా అక్షర్ పటేల్ ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టారు. 

ఇంగ్లాండు పూర్తిగా లీచ్ మీద ఆధారపడాల్సి వచ్చింది. అయితే, పరిస్థితిని గమనించిన ఇంగ్లండు కెప్టెన్ జో రూట్ తానే స్వయంగా బౌలింగుకు దిగాడు. నిజానికి రూట్ పార్ట్ టైమ్ బౌలర్. అయినప్పటికీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేసే రూట్ బౌలింగ్ కు దిగాల్సి వచ్చింది. రూట్ బౌలింగ్ దిగడం పల్ల ఫలితం కూడా కనిపించింది. అతనికి అనూహ్యంగా వికెట్లు లభించాయి. రెండో ఇన్నింగ్సులో అతనికి ఐదు వికెట్లు లభించాయంటే స్పిన్ ఎంతగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే, ఇక్కడ చర్చించుకోవాల్సింది టెస్టు మ్యాచ్ గురించి. టెస్టు మ్యాచ్ లు భవిష్యత్తులో కూడా ఇలా ముగిస్తే ఏమవుతుంది. దాని ఔన్నత్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఇంగ్లండు, ఇండియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచులో గమనిస్తే బ్యాటింగ్ లో మ్యూజిక్ లోపించింది. ఒక్కటి రెండు సార్లు తప్ప పెద్దగా క్లాసిక్ షాట్స్ ఈ మ్యాచులో లేవు. క్రికెట్ కు పరిమిత ఓవర్ల మ్యాచుల కన్నా టెస్టు మ్యాచ్ గీటురాయి అవుతుంది. 

అనిల్ కుంబ్లే నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రస్తుతం ఇంగ్లండు జట్టు ఎదుర్కున్న పరిస్థితినే ఎదుర్కుంది. తీవ్రమైన వివాదాలు కూడా చెలరేగాయి. అదే మంత్రం ఇండియాలో ప్రయోగించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

పిచ్ సమస్య కాదని, ఎటువంటి పిచ్ లోనైనా సత్తా చాటాలని, , పిచ్ లను నిందించకూడదని రోహిత్ శర్మ ఇదివరకు ఓసారి అన్నాడు. అయితే, పిచ్ సరిగా లేకుండా టెస్టు మ్యాచులో పూర్తి స్థాయిలో జరగకపోవడం మంచి పరిణామం కాదు. మొత్తంగా,  మొతేరా టెస్టు మ్యాుచులో ఇండియా గెలిచింది, కానీ క్రికెట్ అభిమానులు ఓడిపోయారు.

మంచి బ్యాటింగ్, మంచి బౌలింగ్, అందమైన షాట్లు, ఉత్కంఠ కలిగించే మలుపులు ఐదు రోజుల పాటు ఆస్వాదించే మహత్తరమైన అవకాశాన్ని క్రికెట్ అభిమానులు కోల్పోయారు. 

click me!