రేవంత్ రెడ్డి ఫెయిల్: బిజెపి అప్రమత్తం, ఈటల రాజేందర్ సీక్రెట్ ఆపరేషన్

By Pratap Reddy KasulaFirst Published Dec 3, 2021, 12:24 PM IST
Highlights

'టీఆర్ఎస్ క్రమంగా పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో బిజెపి ఈటల రాజేందర్ ద్వారా సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత కూడా కాంగ్రెసు పరిస్థితి మారలేదు.

తెలంగాణలో కాంగ్రెసు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత పార్టీ పరిస్థితి మారుతుందని, దూకుడు పెరుగుతుందని అందరూ ఊహించారు. పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత Revanth Reddyకూడా తన కార్యక్రమాల ద్వారా దూకుడు పెరుగుతుందనే సంకేతాలను ఇచ్చారు. కానీ, క్రమంగా ఆయన కూడా నీరసపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. హుజారాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో దారుణమైన పలితాన్ని చూసిన తర్వాత అది మరింతగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి Telangana Congress సీనియర్లు ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేస్తూనే ఉన్నారు. వాటిని అధిగమించడం రేవంత్ రెడ్డికి అతి కష్టంగా మారింది.

కాంగ్రెసు సీనియర్లు వి. హనుమంతరావు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి పలువురు సీనియర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నే విమర్శలు కూడా పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. ఉమ్మడి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగే వాతావరణం కూడా కాంగ్రెసులో లేదు. అందుకు పార్టీ నేతలు పలువురు సహకరించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెసు అధిష్టానం విఫలమవుతోంది. అధిష్టానాన్ని కూడా ధిక్కరించడానికి కొంత మంది సీనియర్ నాయకులు వెనకాడడం లేదు. 

అంతర్గత తగాదాలను పరిష్కరించుకోవడంలోనే విఫలమవుతున్న స్థితిలో రేవంత్ రెడ్డికి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం దొరకడం లేదు. రేవంత్ రెడ్డికి అధిష్టానం పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వడం లేదు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా స్వతంత్రంగా వ్యవహరించారు. అధిష్టానాన్ని ఒప్పించడంలో ఎప్పటికప్పుడు ఆయన తనదైన శైలిని ప్రదర్శిస్తూ వచ్చారు. తద్వారా పూర్తి స్వేచ్ఛను పొంది పార్టీని ముందుకు నడిపించారు. అలాంటి స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి ఇవ్వడంలో కాంగ్రెసు అధిష్టానం విఫలమైందనే చెప్పాలి. దీంతో తెలంగాణలో కాంగ్రెసు గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. అదే సమయంలో BJP గ్రాఫ్ పెరుగుతోంది. 

See Video: కేసీఆర్ మీద ఫైట్: బిజెపి బీసీ వ్యూహం, ఈటల రాజేందర్ తురుపుముక్క

హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత బిజెపి మరింత అప్రమత్తమై జోరును పెంచింది. ఆ జోరును కొసనాగిస్తూ వ్యూహాత్మకంగా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. Huzurabad లో విజయం సాధించిన ఈటల రాజేందర్ ను అంతటితో బిజెపి నాయకత్వం వదిలేయలేదు. ఆయనకు పార్టీని బలోపేతం చేసే ప్రణాళికను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన తెలంగాణలో బిజెపిని పెంచడానికి సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో బిజెపి గ్రాఫ్ కాంగ్రెసు గ్రాఫ్ కన్నా రెండింతలు ఎక్కువ ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఈ స్థితిలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి క్రమంగా ఎదుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Eatela Rajender రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ టీఆర్ఎస్ అసంతృప్తి నేతలను, గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పనిచేసి కేసీఆర్ చేత విస్మరణకు గురైన నాయకులను బిజెపిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే విఠల్ బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా బీసీ నాయకులను బిజెపిలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ వర్గాలను కూడగట్టడం ద్వారా టీఆర్ఎస్ కు సవాల్ విసిరే వ్యూహంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే, రేవంత్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా రాష్ట్ర రాజకీయాలను నిర్ణయించవచ్చు. అదే సమయంలో వైఎస్ షర్మిల నాయకత్వంలోని వైఎస్ తెలంగాణ పార్టీ నామమాత్రంగానే తన ఉనికిని చాటుకునే పరిస్థితి ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక తర్వాత బిఎస్పీ బలం కాస్తా పెరిగినట్లు సమాచారం. ఇది వైఎస్సార్ తెలంగాణ పార్టీ కన్నా తెలంగాణలో బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీలు తెలంగాణలో రాజకీయ పార్టీల భవిష్యత్తును, అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. 

click me!