కేసీఆర్ కోసం తెలంగాణలో రంగంలోకి ప్రశాంత్ కిశోర్?

By telugu teamFirst Published Dec 2, 2021, 7:57 AM IST
Highlights

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ ప్యాక్ సేవలను తీసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రశాంత్ కిశోర్ మమతా బెనర్జీకే కాకుడా కేసీఆర్ కు కూడా తన సేవలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహాయం తీసుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ బృందం ఐ ప్యాక్ తో కేసీఆర్ కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన అధికార నివాసం ప్రగతి భవన్ లో కేసీఆర్ I Pack బృందంతో బుధవారంనాడు సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. ఆ బృందంతో జరిగిన సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 

రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు, వారి స్పందనను తెలుసుకునేందుకు KCR ఐ ప్యాక్ బృందం సహాయం కోరినట్లు తెలుస్తోంది. తన ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించాల్సిన సర్వేల గురించి కేసీఆర్ వారితో చర్చించినట్లు చెబుతున్నారు. 

Also Read: Farmers: కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. ‘ఎన్‌డీఏ అంటే నో డేటా అవెలేబుల్ గవర్నమెంట్’

ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై, పార్టీ యంత్రాంగం పనితీరుపై కేసీఆర్ ఐ ప్యాక్ బృందంతో సర్వే చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐ ప్యాక్ ను సర్వేలకు మాత్రమే నియోగించుకోవాలని, అవసరమైతే దాని నుంచి మరిన్ని సేవలు పొందడానికి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు Prashant Kishorతో కూడా అవసరమైతే చర్చలు జరపాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంపై సమరం సాగిస్తోంది. TRS ఎంపీలు పార్లమెంటులో కూడా ఆందోళనకు దిగుతున్నారు. హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై, బిజెపిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఆయన ఆ వైఖరి తీసుకున్నట్లు భావించవచ్చు.

Also Read: నిరసనలో మరణించిన రైతుల వివరాల్లేవు.. పరిహారమూ ఉండదు: పార్లమెంటులో కేంద్రం

ఓ వైపు తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలకడగా బిజెపి వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. అదే వైఖరిని కేసీఆర్ అనుసరించడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు పునాదులు పడవచ్చునని, ఇందులో ప్రశాంత్ కిశోర్ పాత్ర కీలకంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. 

ప్రజల్లో తన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు కేసీఆర్ గుర్తించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాను తీసుకోవాల్సిసన చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ప్రశాంత్ కిశోర్ బృందం నుంచి సర్వేలను కోరినట్లు తెలుస్తోంది. 

click me!