ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయానికి కాంగ్రెస్‌ కుమ్ములాటలే కారణమా?.. కాషాయ పార్టీకి అనుకూలించిన పరిణామాలు ఇవే..

By Sumanth Kanukula  |  First Published Mar 10, 2022, 2:10 PM IST

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య హోరా హోరి పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ విజయం దిశగా సాగుతుంది.
 


ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య హోరా హోరి పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే.. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరి జరిగిందని.. ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయని పలువురు భావించారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్‌ గమనిస్తే బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 23 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఒక రకంగా చూస్తే ఇరు పార్టీ మధ్య భారీ తేడా కనిపిస్తోంది. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ విఫలం అయిందనే వార్తలు వస్తున్నాయి. 

అయితే ఒకసారి ఎన్నికలకు ముందు పరిస్థితులను పరిశీలిస్తే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కరోనాను ఎదుర్కొవడంలో సరైన విధంగా స్పందించకపోవడా.. ముగ్గురు సీఎంలు మారడం వంటివి బీజేపీకి సమస్యగా మారాయి. అక్కడ ఎన్నికల మార్పిడి జరిగిన ప్రతిసారి అధికార మార్పిడి జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సారి కాంగ్రెస్ అధికారం చేపట్టవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేశారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. 

Latest Videos

undefined

కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తుందని భావించింది. ఎన్నికలో సులవుగానే విజయం సాధించవచ్చని అనుకుంది. స్థానిక అంవాలను ప్రస్తావిస్తూ ప్రచారం సాగించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ విమర్శలు చేసింది. అయితే ఆ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా ప్రభావం చూపాయి. అగ్ర నాయకుల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చాయి. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్..  సీనియర్‌ నాయకుడు, మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లింది. అయితే సొంత పార్టీవారే సహకరించడం లేదంటూ ఆయన పలుమార్లు చెప్పారు.. దీన్ని బట్టి అక్కడ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

మరోవైపు ఉత్తరాఖండ్‌ ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దేవేందర్‌ యాదవ్‌తో హరీశ్ రావత్‌కు విభేదాలు ఉన్నాయి. ఇక, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఉత్తరాఖండ్‌ ఏఐసీసీ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు  కిషోర్ ఉపాధ్యాయ్.. బీజేపీ కండువా కప్పుకున్నారు. ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకన్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం కీలక నాయకులను పిలిచి మాట్లాడింది. అయినప్పటికీ నాయకుల తీరులో పెద్ద మార్పు కనిపించలేదు. నాయకుల మధ్య ఉన్న విభేదాలే కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకున్నాయని దిగువ శ్రేణి నాయకులు చెబుతున్న పరిస్థితి. 

రాజకీయంగా తమకు లాభించే అంశాలను కాంగ్రెస్ సమర్ధవంతంగా వినిపించుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై చేసిన విమర్శలను బలంగా తిప్పికొట్టడంతో కూడా ఆ పార్టీ సఫలీకృతం కాలేదని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న టాక్. ఇక, బీజేపీపై నెలకొన్న వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యాలను కూడా కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయింది. 

పనిచేసిన మోదీ ఇమేజ్, హిందూత్వం..
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్ పనిచేసిందనే చెప్పుకొవాలి. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 2014తో పోల్చితే.. 2019 నాటికి ఓట్ షేర్‌‌ను భారీగా పెంచుకుంది. ఇది అక్కడ ప్రధాని మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతుంది.

కేదార్‌నాథ్‌ అభివృద్ధిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్‌ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆయన పదేపదే ప్రశ్నించారు. మోదీకి సైనికులు కుటుంబాల్లో ఉన్న ఫాలోయింగ్ కూడా బాగానే పనిచేసింది. ఉత్తరాఖండ్‌‌పై తన అభిమానాన్ని చాటుకునేలా.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తరాఖండ్‌ టోపీ కూడా.. అక్కడి ప్రజల్లో సానుకూలతను కలిగించకలిగిందనే చెప్పాలి. మరోవైపు బీజేపీ నాయకుల హిందూత్వ అజెండా కూడా ఆ పార్టీ విజయంలో కీలక భూమిక పోషించిందనే చెప్పాలి. అయితే ఏది ఏమైనా కాంగ్రెస్‌లోని కుమ్ములాటలే బీజేపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించిందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

click me!