ప్రచ్ఛన్న యుద్ధం: కేసీఆర్ తీరుపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి

By Pratap Reddy Kasula  |  First Published Mar 8, 2022, 12:30 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసైకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. గవర్నర్ తమిళిసైని కేసీఆర్ ఆసలు పట్టించుకోవడం లేదు. దీనిపై తమిళిసై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతోంది.


తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీరుపై గవర్నర్ తమిళిసై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. తన ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడంపై ఆమె కినుక వహించినట్లు తెలుస్తోంది. బిజెపిపై ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించిన కేసీఆర్ గవర్నర్ ను అసలు పట్టించుకోవడం లేదు. సోమవారం ఇటు హైదరాబాదులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, తమిళిసై యాదాద్రి పర్యటనకు వెళ్లారు. యాదాద్రిని సందర్శించి పూజలు నిర్వహించారు. 

తన యాదాద్రి పర్యటనపై ఆమె ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కూడా ఆమె ఆవేదన వ్యక్తమైంది. ట్వీట్ ను ప్రధాని కార్యాలయానికి (పీఎంవోకు) ట్యాగ్ చేశారు. సోమవారంనాడే ఆమె ఆ ట్వీట్ చేశారు. తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్న సందర్భంలో తాను యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నానని, తెలంగాణ ప్రజలకు సంక్షేమం కోసం ప్రార్థన చేశానని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా క్షేమంగా ఉండాలనేది, అందరికీ మేలు జరగాలనేది తన ఆకాంక్ష అని ఆమె అన్నారు. 

Latest Videos

undefined

అలా ట్వీట్ చేయడంతో పాటు కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు కూడా చేశారు. నేటికీ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని అంటూ అత్యున్నత పదవ ిలో ఉన్న మహిళలకు కూడా తగిన గౌరవం దక్కడం లేదని ఆవేదని వ్యక్తం చేశారు. గవర్నర్ పదవిలో ఉన్న తనను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించడాన్ని ఆ మాటలకు అన్వయిస్తున్నారు. రాజభవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. 

హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయిన మరుక్షణం నుంచి కేసీఆర్ బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నారు. జాతీయ స్థాయిలో బిజెపియేతర, కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను,  ఇతర పార్టీల నాయకులను ఆయన కలిశారు. బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ వస్తున్నారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ గవర్నర్ తమిళిసైని కనీసం గుర్తించడానికి కూడా ఇష్టపడడం లేదు. 

రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. ఇతరేతర కారణాల వల్ల తాను హాజరు కాని పక్షంలో తన ప్రతినిధులుగా ప్రభుత్వం తరఫున ఎవరినైనా పంపించాల్సి ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని కూడా కేసీఆర్ పాటించలేదు. దీంతో రాజ్ భవన్ కు, ముఖ్యమంత్రికి మధ్య అగాధం పెరిగింది. 

మరో వైపు శాసనసభ బజ్జెట్ సమావేశాల నుంచి బిజెపి సభ్యులను స్పీకర్ బహిష్కరించారు. బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా వెల్ లోకి దూసుకుని వచ్చినందుకున వారిని సస్పెండ్ చేసినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. ఒక్క రోజుకో, రెండు రోజులకో కాకుండా బడ్జెట్ సమావేశాలంతటికీ బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. తమ సస్పెన్షన్ మీద బిజెపి సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. దీనిపై తమిళిసై ఏం చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. అదే సమయంలో తమిళిసైకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య పెరిగిన అగాధం ఎటు దారి తీస్తుందనేది కూడా చూడాల్సిందే.

click me!