వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర రోజు రోజుకూ ఆసక్తి రేపుతోంది. వైవీ సుబ్బారెడ్డి మాత్రమే కాకుండా ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా వైఎస్ షర్మిలతో భేటీ కావడం వెనక రహస్యమేమిటనే ఆసక్తి కలుగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కాలు పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, తన సోదరి వైఎస్ షర్మిల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపరేషన్ చేపట్టారా అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన నాయకులు వైఎస్ షర్మిల పాదయాత్రను పరిశీలిస్తూ ఆమెతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు ఆమెకు సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు.
ఇంతకు ముందు వైఎస్ జగన్ బాబాయ్, TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు. తాజాగా, మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి షర్మిలతో భేటీ అయ్యారు. వైఎస్ షర్మిల లేమూరులో నిర్వహించిన మాట - ముచ్చట కార్యక్రమంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఆయన షర్మిలతో వేదికను పంచుకోలేదు. జనం మధ్య కూర్చుని Alla Ramakrishna Reddy కార్యక్రమాన్ని వీక్షించారు. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత షర్మిలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. సోమవారం రాత్రి ఆర్మియాగూడాలోని క్యాంప్ వద్ద షర్మిలతో గంట పాటు సమావేశమయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే YS Jagan వెనక నుంచి షర్మిల రాజకీయాలకు తోడ్పాటు అందిస్తున్నట్లు కనిపిస్తోందని భావిస్తున్నారు.
undefined
Also Read: Praja Prasthanam: వైవీ సుబ్బారెడ్డి భేటీ, షర్మిల వెనక వైఎస్ జగన్
కాగా, షర్మిల ప్రజాప్రస్థానం యాత్రను వైఎస్ జగన్ తల్లి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. షర్మిల ఐదో రోజు పాదయాత్రలో మహేశ్వరంలో కీలకమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. టీటీడీ చైర్మన్, వైఎస్ జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి షర్మిలతో సమావేశమయ్యారు. వారివురి మధ్య దాదాపు గంటపాటు మంతనాలు జరిగాయి. దానికితోడు YV Subba Reddy షర్మిల పాదయాత్రకు సంఘీభావం కూడా తెలిపారు. వైఎస్ జగన్ రాయబారిగానే వైవీ సుబ్బారెడ్డి షర్మిలను కలిశారని చెబుతున్నారు.
వైవీ సుబ్బారెడ్డిని వైఎస్సార్ టీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, నాడుక రాజగోపాల్, సయ్యద్ ముజ్తాబా అహ్మద్, మతీన్ ముజాద్దాది ఆహ్వానించారు. షర్మిల పాదయాత్ర జరిగిన తీరును వైవీ సుబ్బారెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇతర నాయకులను బయటకు పంపించి వైఎస్ షర్మిల, వైవీ సుబ్బారెడ్డి ముఖాముఖి సమావేశమయ్యారు. పాదయాత్ర లభిస్తున్న స్పందనపై వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా వైఎస్ విజయమ్మను కూడా వైవీ సుబ్బారెడ్డి కలుస్తారని చెబుతున్నారు.
Also Read: కేసీఆర్ కి సవాల్.. కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర..!
నిజానికి, జగన్ తో తనకు విభేదాలున్నాయని వైఎస్ షర్మిల చెప్పలేదు. కేవలం అభిప్రాయభేదాలు మాత్రమే ఉన్నాయని గతంలో అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దనేది వైఎస్ జగన్ అభిమతమని, ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం వైఎస్ జగన్ తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. షర్మిల మాత్రమే కాకుండా సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా అదే విషయం చెప్పారు. అయితే, జగన్ తో విభేదించి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారని ఆయన చెప్పారు.