ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి ఆయన ఓ ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు.
ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్న పార్టీ ఎమ్మెల్యేల కోసం, మంత్రుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రణాళిక తయారుచేశారు. అక్టోబర్ 25వ తేదీన టీఆర్ఎస్ ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఆయన ఆ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, తద్వారా వారి పనితీరును పెంచాలని ఆయన ఆలోచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు విడతలు TRS అధికారంలోకి వచ్చింది. అయితే, రెండుసార్లు, అంతకన్నా ఎక్కువ సార్లు విజయం సాధించిన కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నట్లు కేసీఆర్ గుర్తించినట్లు సమాచారం. సర్వేల ద్వారా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నవారి జాబితాను కూడా ఆయన రూపొందించినట్లు తెలుస్తోంది. వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా 2023 శాసనసభ ఎన్నికల్లో వారు తిరిగి విజయం సాధించేలా చూడాలనేది కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు.
undefined
Also Read: సీఎం కేసీఆర్‌పై 30శాతం ఓటర్ల ఆగ్రహం.. కేటీఆర్‌కు బాధ్యతలు ఇవ్వడం బెటర్: సర్వే
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు TRS Plenary నేపథ్యంలో హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు, మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఆయన ఎమ్మెల్యేలకు, మంత్రులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబతూనే ఉన్నారు. అక్టోబర్ 25వ తేదీన టీఆర్ఎస్ ప్లీనరీ ముగిసిన తర్వాత నవంబర్ 15వ తేదీన తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ వరంగల్ లో జరగనుంది.
ప్రతి రోజు సోమవారం నుంచి KTR 20 శాసనసభ నియోజకవర్గాలేసి చొప్పున ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రజా సేవలను, అభివృద్ధి కార్యక్రమాలను అందించడంలో చురుగ్గా వ్యవహరించాలని ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ప్రజలు సమర్పించే వినతిపత్రాలను నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని ఆయన సూచిస్తున్నారు.
ఐదారు విడతలు ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నవారిని కేటీఆర్ ఉదహరిస్తూ వారు ప్రజలకు ఎలా చేరువగా ఉంటున్నారో, వారికి చేరువగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారో వివరిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన వివరిస్తున్నారు.
ప్రస్తుతం శాసనసభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 103 మంది ఉన్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 88 మంది విజయం సాధించారు. ఆ తర్వాత 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో శాసనసభలో టీఆర్ఎస్ బలం 103కు పెరిగింది. వారిలో 68 మంది రెండుసార్లు, అంతకన్నా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాల విషయంలో సీఎం KCR పనితీరు బేషుగ్గా ఉన్నప్పటికీ కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ అంచనాకు వచ్చారు. దాన్ని అధిగమించేందుకు వారికి శిక్షణ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు.