pegasus spyware: చంద్రబాబును చిక్కుల్లో పెట్టిన మమతా బెనర్జీ

By Pratap Reddy KasulaFirst Published Mar 18, 2022, 8:50 AM IST
Highlights

పెగాసస్ స్పైవేర్ వివాదం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చుట్టుముట్టింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణతో చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. 

విజయవాడ: పెగాసస్ స్పైవేర్ వివాదం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చుట్టుముట్టింది. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దీంతో వివాదం ఏపీ తాకింది.  

రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికి చంద్రబాబు ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ నుంచి  పెగాసస్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. రూ.25 కోట్లకు ఇజ్రాయిలీ స్పైవర్ ను విక్రయించడానికి కంపెనీ రాష్ట్ర పోలీసులను సంప్రదించిందని, ఇది నాలుగైదేళ్ల క్రితం జరిగిందని, తనకు ఆ విషయం తెలిసి వద్దని చెప్పానని ఆమె చెప్పారు. స్పై వేర్ ను దేశ భద్రతకు వాడడానికి బదులు రాజకీయ ఉద్దేశ్యాలతో న్యాయమూర్తులపై, అధికారులపై కేంద్ర ప్రభుత్వం వాడిందని ఆమె ఆరోపించారు.

పెగాసస్ ను విక్రయించడానికి ఎన్ఎస్ఓ కంపెనీ ప్రతి ఒక్కరినీ స్పందించిందని, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో దీన్ని పొందిందని ఆమె చెప్పారు. అయితే, మమతా బెనర్జీ ఆరోపణలను చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తోసిపుచ్చారు. తాము ఎప్పుడు కూడా స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. తాము దాన్ని కొని ఉంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవారు కాదని ఆయన అన్నారు. 

మమతా బెనర్జీ ఏ సందర్భంలో చెప్పారో, అలా చెప్పారో లేదో కూడా తనకు తెలియదని, అయితే ఆమెకు తప్పుడు సమాచారం అందిందనేది మాత్రం స్పష్టమని ఆయన అన్నారు. చంద్రబాబు అటువంటి అక్రమ విధానాలను ఏనాడూ ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. అయితే, స్పైవేర్ ను విక్రయించడానికి పెగాసస్ సంస్థ తమను సంప్రదించిందని, కానీ తాము కొనుగోలు చేయలేదని నారా లోకేష్ చెప్పారు. ఒక వేళ ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే రికార్డు చేసి ఉండేదని అన్నారు. 

అటువంటి స్పైవేర్ ఉండి ఉంటే జగన్ ప్రభుత్వం తమను బతకనిచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. ఏదో రకంగా తమకు చిక్కులు కల్పించాలని జగన్ ప్రభుత్వం చిక్కులు కల్పించడానికి ప్రయత్నిస్తోందని, అయితే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని, దానికి కారణం తాము ఏ తప్పూ చేయకపోవడమేనని అన్నారు. 

click me!