సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఈ ఉద్యోగాల జాతరను ప్రకటించడం వెనుక ముందస్తు ఎన్నికలకు వెళ్లే మాస్టర్ ప్లాన్ ఉందని అర్థమవుతోంది. యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేసిన కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఆధారంగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
యూపీలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండో సారి బీజేపీ అధికారం చేపట్టనుంది. యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రెండో సారి కూడా ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలోనే ఉండనుంది. కాంగ్రెస్ కనీసం రెండు అంకెల స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది. బీఎస్పీ పరిస్థితి కాంగ్రెస్ కంటే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో తీవ్రంగా బలహీనపడింది.
ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే యూపీ ఎన్నికలపై దేశం మొత్తం దృష్టి సారించింది. అయితే యూపీలో బీజేపీ దూకుడును సీఎం కేసీఆర్ ముందుగానే అంచనా వేసినట్టు తెలుస్తోంది. దీనికి ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ చర్యలు, ఆయన వ్యాఖ్యలు బలాన్నీ చేకూరుస్తున్నాయి. అదీ కాక ఎవరూ ఊహించని విధంగా ఒక్క సారిగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం వెనక మర్మం కూడా అందరి దృష్టి తనవైపు తిప్పుకోవడానికే అని అర్థం అవుతోంది. అయితే దీని వెనక ముందస్తు ఎన్నికల వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
undefined
కొన్ని నెలల నుంచి సీఎం కేసీఆర్ బీజేపీకి, కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. వారితో చర్చించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కూడా కలిశారు. ఆయన ఇటీవలే తెలంగాణలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఓటర్ల నాడిని అంచనా వేయడం ప్రశాంత్ కిశోర్ దిట్ట. ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే ఓట్లు పడుతాయో ? ఎలాంటి జిమ్ముక్కులు ప్లే చేస్తే ఓట్లర్లు తమవైపు మొగ్గు చూపుతారో అంచనా వేయడంలో నేర్పరి. అయితే ఆయన ద్వారా యూపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగానే పసి గట్టిన సీఎం కేసీఆర్..దానికి అనుగుణంగా తెలంగాణలో అడుగులు వేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రస్తుతం వేస్తున్న అడుగులు చూస్తుంటే తెలంగాణలో క్రితం సారిలాగే ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలు ఉంటాయని స్పష్టమవుతోంది. అందుకే ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలు పెడుతున్న అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 91 వేల ఖాళీలు గుర్తించనట్టు తెలిపారు. ఇందులో 11 వేల ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ కింద వెళ్తాయని, మిగిలిన 81 వేల ఉద్యోగాలను తక్షణం నోటిఫై చేస్తున్నామని తెలిపారు. దీంతో ఒక్కసారిగా నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల జాతరను ప్రకటించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పీకే ఆలోచనల ప్రకారమే సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రకటన అని చెబుతున్నారు. అదే నిజం అయితే గనుక ముందస్తు ఎన్నికలు పక్కాగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీకి 2018 డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2023 సంవత్సరాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు గమనిస్తే అంతకంటే ముందే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తరువాత సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.