Uttar Pradesh Election Result 2022: యూపీలో బీజేపీ విజయం.. ఏపీలో వైసీపీ ఢీలా, చంద్రబాబు ఖుషి..!

By Mahesh K  |  First Published Mar 10, 2022, 2:47 PM IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపుగా గెలుపు ఖరారు చేసుకుంది. మెజార్టీకి మించిన స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నది. యూపీలో బీజేపీ భారీ మెజార్టీ ఏపీలో ఎఫెక్ట్ వేయనుంది. అందుకే కౌంటింగ్ ట్రెండ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపికి కొంత కలవరం కలిగిస్తుండగా.. ఈ కారణంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం కనిపిస్తున్నాయి.


న్యూఢిల్లీ: యూపీ ఎన్నికలతో ఏపీకి సంబంధం ఏమిటి? అక్కడ బీజేపీ ఓడినా.. గెలిచినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే కష్టం ఏమిటీ? ఇది సాధారణంగా కనిపించే అభిప్రాయం. కానీ, త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో పైన పేర్కొన్న ప్రశ్నలకు ప్రాసంగికత ఉంటుంది. ఔను.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ మెజార్టీ స్థానాలు సాధిస్తే.. అది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది..! 

జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ప్రస్తుత బలంతో బీజేపీ తమ అభ్యర్థిని రాష్ట్రపతిగా ఎన్నుకోవడంలో అవాంతరాలేమీ లేవు. కానీ, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోతే మాత్రం తమ అభ్యర్థిని రాష్ట్రపతి భవన్‌కు పంపడం చాలా కష్టంగా మారనుంది. మొత్తం ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం ఉత్తరప్రదేశ్‌కే ఎందుకు ఆ ప్రాధాన్యత? ఆ ఉత్తరప్రదేశ్‌తో ఈ ఆంధ్రప్రదేశ్‌కు లింక్ ఏంటి? అనే ప్రశ్నలు రావడం సహజం.

Latest Videos

undefined

రాష్ట్రపతి ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో దేశంలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొంటారు. అయితే, వీరి ఓటు విలువ ఒకేలా ఉండదు. ఎంపీల ఓటు విలువ 708గా ఉన్నది. కానీ, అసెంబ్లీ సభ్యుల ఓటు విలువ మాత్రం ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటుంది. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ గరిష్టంగా ఉంటుంది. యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంటుంది. అదే చిన్న రాష్ట్రం సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ కేవలం ఏడు మాత్రమే. కాబట్టి, బీజేపీ తమ అభ్యర్థినే రాష్ట్రపతి చేయాలంటే మాత్రం యూపీలో ఎమ్మెల్యేలను ఎంత ఎక్కువగా గెలుచుకుంటే వారికి ఆ పని అంత సులువు అవుతుంది.

యూపీలో బీజేపీ అభ్యర్థులు ఎంత ఎక్కువ మంది గెలిస్తే.. బీజేపీకి దాని మిత్రపక్షాలు, కూటమి పార్టీలపై ఆధారపడటాన్ని అంత తగ్గిస్తుంది. అదే బీజేపీ తక్కువ సీట్లకే పరిమితం అయితే.. అది అనివార్యంగా దాని మిత్రపక్షాలతో బేరసారాలు, బుజ్జగింపులకు దిగాల్సి వస్తుంది. 

రెండో సారి కేంద్రంలో కొలువుదీరిన తర్వాత బీజేపీ దాని మిత్రపక్షాలు శివసేన, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలను దూరం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి తటస్థంగా కనిపించే తెలంగాణలోని టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపి, ఒడిశాలోని బీజేడీలను దగ్గరకు తీసుకునే అవసరం ఏర్పడుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. టీఆర్ఎస్ ఇప్పటికే బీజేపీతో ఉప్పు నిప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. దీంతో ఏపీలోని అధికారిక వైఎస్సార్సీపీ మాత్రం బీజేపీ వెన్నంటే ఉంటున్నది. 

ఒక వేళ యూపీలో బీజేపీ స్వల్ప సంఖ్యలో సీట్లను గెలుచుకుంటే.. వైఎస్సార్సీపీపై బీజేపీ ఆధారపడటం కొంత పెరిగేది. అలా బీజేపీ ఆధారపడటం వైఎస్సార్సీపికి ఎంతో అవసరం కూడా. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపి అధినేతకు అవసరం. వ్యక్తిగతం ఎదుర్కొంటున్న నేరపూరిత కేసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల ఇన్వెస్టిగేషన్ వల్ల కలిగే ఇబ్బందులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా మందగించడం వంటి అంశాల కారణంగా వైఎస్సార్సీ.. తమపై బీజేపీ ఆధారపడటాన్ని కోరుకోవచ్చు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయదుందుభి మోగిస్తున్నది. దీంతో వైఎస్సార్సీపీ శిబిరంలో కొంత కలవరం ఏర్పడుతుండగా.. టీడీపీ శ్రేణుల్లో ఆనందం కనిపిస్తున్నది.

click me!