ముందు నుయ్యి వెనుక గొయ్యి... ఇది పవన్ పరిస్థితి

By telugu teamFirst Published Feb 17, 2020, 6:11 PM IST
Highlights

మూడు రాజధానుల విషయంలో బీజేపీ వైఖరేమిటో ఎవరికీ అర్థమవడం లేదు. పార్టీ ఏమో వ్యతిరేకిస్తామని చెబుతుంటే... 3 రాజధానులకు అనుకూలంగా  కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా జివిఎల్ నరసింహారావు వంటివారు ఇదే అర్థం ధ్వనించేలా మాట్లాడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ నడుపుతానంటూ ముందుకొచ్చి పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికలకు ముందే పార్టీ స్థాపించినప్పటికీ.... ఆ ఎన్నికల్లో బరిలోకి దిగలేదు. సంస్థాగత నిర్మాణం లేని కారణంగా పోగి చేయట్లేదని పవన్ ప్రకటించాడు. 

ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపి వారి గెలుపులో కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికలప్పుడు తప్పు చేస్తే తాను ఎవరినైనా ప్రశ్నిస్తానని అన్నాడు. ఎన్నికలు ముగిసాయి. ఆ తరువాత కొద్దీ రోజులు పవన్ స్క్రీన్ మీదనే కనబడలేదు. 

ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ కనబడడం లేదేంటని ప్రతిపక్షాలు ఎద్దేవా కూడా చేసాయి. ఇంతలోనే తన చివరి సినిమా అంటూ అజ్ఞాతవాసిని పూర్తి చేసి వస్తానని చెప్పాడు. అలా సినిమా పూర్తి కూడా చేసాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయచిత్రపటంపై కనబడడం మొదలుపెట్టాడు. 

కొన్ని ప్రజా ఉద్యమాలను కూడా నడిపించాడు పవన్ కళ్యాణ్. ఉద్దానం సమస్యపై పవన్ సలిపిన పోరాటం నిజంగా మెచ్చుకోతగింది కూడా. అలా అడపాదడపా ఉద్యమాలను సాగిస్తూ ఎన్నికల వేళకు వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడ్డాడు పవన్ కళ్యాణ్. (బహుశా కెసిఆర్ తనకు కాకుండా వైసీపీకి మద్దతిచ్చాడనే భావనేమో !)

ఇక ఆతరువాత ఎన్నికల్లో పవన్ సొంతగానే పోటీ చేసాడు. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓటమి చెందాడు. ఒకే ఒక్క అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు అతను కూడా పవన్ కు వరుస షాకులు ఇస్తూనే ఉన్నాడు, అది వేరే విషయం. 

ఇక ఆ ఎన్నికల ఓటమి నుంచి త్వరగానే బయటకొచ్చిన పవన్ ప్రజాక్షేత్రంలోనే తాను ఉండబోతున్నట్టు ప్రకటించాడు. ప్రకటించినట్టుగానే ప్రజాసమస్యలపై పోరాడడం మొదలుపెట్టాడు. ఇసుక సమస్యపై పోరాటం చేస్తూ పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ భావన నిర్మాణ కార్మికుల సమస్యను ఎత్తి చూపెట్టింది. 

ఆ తరువాత తన కుటుంబ పోషణకు అంటూ ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయ్యాడు పవన్ కళ్యాణ్. దాన్ని ఎవ్వరమూ తప్పుబట్టలేము. ఆయన పర్సనల్ విషయం. ఇలా ఈ చర్చంతా జరుగుతుండగానే అనూహ్యంగా ఒక రెండు నెలలకు ముందు బీజేపీ వైపుగా అడుగులు వేయడం ఆరంభించాడు. 

కొద్దీ రోజులకు ఆయన స్వయంగా బీజేపీతో పొత్తుపెట్టుకోబోతున్నట్టు ప్రకటించాడు. కేంద్రమంత్రులతో, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయినా ఫోటోలు, రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి అతను నిర్వహించిన ప్రెస్ మీట్లు... అబ్బో చాలానే జరిగాయి

మూడు రాజధానుల ఏర్పాటుకు తాను వ్యతిరేకమని చెప్పిన పవన్ దానిపైన పెద్ద ఉద్యమానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే బీజేపీ అతని ముందరికాళ్లకు బంధం వేసినట్టుగా అతను తలపెట్టిన లాంగ్ మార్చ్ ను ఆపేసాడు. 

మూడు రాజధానుల విషయంలో బీజేపీ వైఖరేమిటో ఎవరికీ అర్థమవడం లేదు. పార్టీ ఏమో వ్యతిరేకిస్తామని చెబుతుంటే... 3 రాజధానులకు అనుకూలంగా  కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా జివిఎల్ నరసింహారావు వంటివారు ఇదే అర్థం ధ్వనించేలా మాట్లాడుతున్నారు. 

బీజేపీ పార్టీగా మూడు రాజధానులు వ్యతిరేక తీర్మానం చేస్తుంది, కానీ కేంద్రం మాత్రం ఆ విషయంలో తలదూర్చదు అని అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్న వేళ అసలు సమస్య అంతా పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నాడు. 

తాజాగా పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు మద్దతు తెలపడానికన్నట్టు ఒక రెండు రాజధాని గ్రామాల్లో పర్యటించాడు. అక్కడి రైతులు పవన్ కళ్యాణ్ ను బీజేపీ వైఖరేంటని సూటిగా ప్రశ్నించారు. 

రాజధాని మార్పును ఆపమని కేంద్రాన్ని అదగొచ్చుకదా, కేంద్రం ఏం ఆలోచిస్తుందని ప్రశ్నలు గుప్పించారు. వీటికితోడు వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని వస్తున్న వార్తలపై కూడా వారు ప్రశ్నించారు. 

ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పవన్ బాగానే ఇబ్బందిపడ్డారు. ఆయన మోడీ అమిత్ షాలను వెనకేసుకు రాలేక చచ్చిపోయారు. వాస్తవానికి తనను వెనుకేసుకురావడానికి బీజేపీ పనికొస్తుందని భావించిన పవన్ ఇప్పుడు తానే బీజేపీని వెనకేసుకు రావాల్సిరావడం నిజంగా పెద్ద షాక్ గానే చెప్పవచ్చు. 

ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు ఓపిక పడితే మంచిది. కేంద్రంలోని పెద్దలు ఏదో ఒక విషయం తేల్చేవరకు వేచి చూసి ఆ తరువాత పవన్ ఒక నిర్ణయానికి వస్తే మంచిది. అంతే తప్ప ఇలా ఇప్పుడు అననుకూల సమయంలో బయటకు వెళ్లకుండానే ఆగితే మంచిది. 

click me!