టిడిపి అధినేత చంద్రబాబు ముందు పొత్తు కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు చంద్రబాబుకు మింగుడు పడకపోవచ్చు.
పొత్తుకు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెడుతున్న ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి మింగుడు పడే విధంగా లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి చంద్రబాబుకు తన పొత్తు అనివార్యమనే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. పొత్తు పెట్టుకోవాలంటే తమకు ఎక్కువ స్థానాలు ఇవ్వాల్సిందేనని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తు తమకు గౌరవప్రదంగా ఉండాలని పవన్ కల్యాణ్ అంటున్నట్లు చెబుతున్నారు.
తాము రాష్ట్రం కోసం ఇది వరకు త్యాగాలు చేశామని, ఇప్పుడు ఇతరులు త్యాగాలకు సిద్ధపడాలని పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని, వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ఆయన అన్నారు. నిజానికి, చంద్రబాబు పవన్ కల్యాణ్ తో పొత్తుకు చాలా కాలం నుంచి ఆసక్తి చూపుతున్నారు. టిడిపితో పొత్తుకు బిజెపి కూడా కలసి రావాలని పవన్ కల్యాణ్ ఆశిస్తున్నారు. అయితే, బిజెపి అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో ఆయన బిజెపిపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అవసరమైతే బిజెపితో తెగదెంపులు చేసుకుని టిడిపితో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ సిద్ధపడవచ్చునని ప్రచారం జరుగుతోంది.
undefined
టిడిపితో జనసేన పొత్తుకు కూడా అడ్డంకులున్నాయని చెబుతున్నారు. జనసేనకు 20 శాసనసభా స్థానాలు ఇవ్వడానికి టిడిపి సిద్ధపడినట్లు ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. పవన్ కల్యాణ్ టిడిపితో పొత్తుకు అంతకు మించి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ చంద్రబాబు కీలకమైన ప్రతిపాదన చేసినట్లు కూడా చెబుతున్నారు. తమకు సగం శాసనసభా స్థానాలు ఇవ్వాలని, అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని పవన్ కల్యాణ్ అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండున్నరేళ్లు చంద్రబాబు, మరో రెండున్నరేళ్లు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలనేది ప్రతిపాదన సారాంశం. ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు. అది నిర్ధారణ కూడా కాలేదు.
అయితే, ఆ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరిస్తారా అనేది అనుమానం. చంద్రబాబు తప్పకుండా తనకు ప్రధానమైన వాటా కావాలని అనుకుంటారు. తిరిగి తాను ముఖ్యమంత్రిని కావాలని కూడా ఆశిస్తుంటారు. అందువల్ల మొత్తం 175 స్థానాల్లో సగం సీట్లు జనసేనకు ఇవ్వడానికి అంగీకరించకపోవచ్చు. కనీసం యాబై సీట్లకైనా పవన్ కల్యాణ్ అంగీకరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. జనసేనకు పెద్ద యెత్తున సీట్లు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ (టిడిపి)లో అసంత్రుప్తి చెలరేగే అవకాశాలు ఉంటాయి. అసంత్రుప్త నేతల వల్ల అసలుకే ఎసరు రావచ్చు. అందు వల్ల పవన్ కల్యాణ్ పెట్టే ప్రతిపాదనలు చంద్రబాబుకు నచ్చకపోవచ్చునని భావించడానికి వీలుంది.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకునేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. వరుస సమావేశాలతో ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచేందుకు కూడా పవన్ కల్యాణ్ తన సభల ద్వారా ప్రయత్నిస్తున్నారు. వరుసగా కాపు సామాజిక వర్గం గురించి ఆయన మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు ప్రధానపాత్ర పోషించాలని కూడా ఆయన చెబుతున్నారు. తద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పరోక్షంగా చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం మద్దుత లేకుండా అటు వైసిపి గానీ ఇటు టిడిపి గానీ విజయం సాధించలేవని ఆయన నమ్మకంగా చెప్పవచ్చు. మొత్తం మీద, పవన్ కల్యాణ్ బంతిని చంద్రబాబు కోర్టులోకి పంపినట్లు తెలుస్తోంది.