పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు: ఏపి బిజెపిలో ముసలం

By Pratap Reddy Kasula  |  First Published Mar 15, 2023, 3:58 PM IST

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపి బిజెపిలో ముసలం పెట్టినట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. పవన్ కల్యాణ్ తో జాతీయ నాయకులు మాట్లాడాలని ఆయన అన్నారు.


అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ముసలం పుట్టింది. బిజెపి జాతీయ నాయకులను సమర్థిస్తూ ఎపి బిజెపి నాయకత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వేడి వేడి చర్చ సాగుతోంది. ఒక రకంగా ఎపి బిజెపి ఆత్మరక్షణలో పడింది. జనసేన ఆవిర్భావ సభలో ఆయన ఎపి బిజెపి నాయకత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంలోనే కాకుండా రాజధాని అమరావతి విషయంలో కూడా బిజెపి నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల నిరసన గళం విప్పారు.

బిజెపి తనతో కలిసి పోరాటాలు చేసి ఉంటే, తాను రాష్ట్రంలో వైసిపి వ్యతిరేక ఓటు చీలకూడని అని ఉండేవాడిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ (వైసిపి)ని ఓడించాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకే ఎపిలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనను ఆయన తెస్తున్నారు. బిజెపి కలిసి రావాలనేది ఆయన ఉద్దేశం. అందుకే బిజెపిపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపి బిజెపి నాయకులు చంద్రబాబును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చంద్రబాబుకు, వైఎస్ జగన్ కు సమదూరం పాటిస్తామని, ఆ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలని చెబుతున్నారు. 

Latest Videos

undefined

ఈ స్థితిలోనే పవన్ కల్యాణ్ టిడిపితో పొత్తుకు కలిసి రావాలని అడుగుతున్నారు. తాజాగా రాష్ట్ర బిజెపిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బిజెపి రాష్ట్ర నాయకత్వం తనతో కలిసి పోరాటాలు చేయడానికి ముందుకు రావడం లేదని విమర్శిస్తున్నారు. అందుకు అమరావతి అంశాన్ని ఉదహరించారు.అమరావతే రాజధాని అంటూ  లాంగ్ మార్చ్ చేద్దామనుకున్నామని, బిజెపి జాతీయ నాయకులు కూడా అందుకు అంగీకరించారని, ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటిదేమీ లేదన్నారని ఆయన చెప్పారు. బిజెపి అండగా ఉంటానని చెబుతున్నా కలసి రాకపోతే నేనేం చేయనని అడిగారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. పవన్ కల్యాణ్ తో పొత్తు కొనసాగడానికి పార్టీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మూడు పార్టీలు కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అమరావతియే ఏపి రాజధాని అనేది తమ వైఖరి అని చెప్పారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన ఆ మాట చెప్పినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి, ఇదే విషయాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు మొదటి నుంచీ చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేయడం లేదు. దీన్నే పవన్ కల్యాణ్ తప్పు పడుతున్నారు.

కాగా, సోము వీర్రాజు తీరు బిజెపిలోని కొంత మంది నేతలకు మింగుడు పడడం లేదనే ప్రచారం ఉంది. సోము వీర్రాజుతో సరిపడకపోవడంతోనే కన్నా లక్ష్మినారాయణ పార్టీని వీడారనేది అందరికీ తెలిసిందే.
 

click me!