ఈడి కేసులో కవిత ప్రతినిధి: ఎవరీ సోమా భరత్?

By Pratap Reddy Kasula  |  First Published Mar 17, 2023, 11:07 AM IST

కవిత ఈడి విచారణకు గైర్హాజరవుతూ ఈడికి సమాచారం పంపించిన నేపథ్యంలో సోమా భరత్ అకస్మాత్తుగా తెర మీదికి వచ్చారు. కవిత ప్రతినిధిగా వ్యవహరించిన సోమా భరత్ ఎవరనే ఆసక్తి చెలరేగింది. ఆయన నేపథ్యంలో ఏమిటో చూద్దాం.


తెలంగాణ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కూతురు కల్వకుంట్ల కవిత ఈడి కేసులో అకస్మాత్తుగా సోమా భరత్ తెర మీదికి వచ్చారు. ఆమె ప్రతినిధిగా ఈడి కార్యాలయానికి వెళ్లి పత్రాలు సమర్పించారు. కవిత ఈడి విచారణకు గైర్హాజరవుతూ తన ప్రతినిధిగా సోమా భరత్ కుమార్ ను పంపించారు. ఆయన ఈడికి పత్రాలు సమర్పించడంతో పాటు ఈడీ తీరుపై మీడియా ప్రతినిధుల ఎదుట తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ లో భరత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

కెసీఆర్ కుటుంబానికి భరత్ అత్యంత విశ్వాసపాత్రుడిగా మారారు. భరత్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్థమానుకోట గ్రామానికి చెందినవారు. భరత్ సికింద్రాబాదులోని సర్దార్ పటేల్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ కాలంలో వామపక్ష భావజాలంతో పనిచేసిన ప్రగతిశీల విద్యార్థి సంఘం (పిడిఎస్ యు)లో ప్రధానమైన భూమిక పోషించారు. హైదరాబాదులో పిడిఎస్ యును విస్తరింపజేయడంలోనే కాకుండా వివిధ సమస్యలపై జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆ కాలంలోనే ప్రస్తుత మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేశారు. 

Latest Videos

undefined

డిగ్రీ తర్వాత లా చేసి న్యాయవాదిగా తన కెరీర్ ను ప్రారంభించారు. న్యాయవాదిగా ఆయన పలు కీలకమైన కేసులను వాదించి ప్రఖ్యాతి వహించారు. సత్యం రామలింగరాజు కేసును కూడా ఆయన వాదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. టిఆర్ఎస్ వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. దీంతో భరత్ ను కేసిఆర్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 

కేసీఆఱ్ ఆయనను 2022లో తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా నియమించారు. కవితకు ఈడి నోటీసులు జారీ చేసినప్పటి నుంచి సోమా భరత్ చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత తనకు న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి భరత్ నే నమ్ముకున్నట్లు చెబుతారు. 

భరత్ కుమార్ తనకున్న పలుకుబడితోనూ న్యాయశాస్త్రంపై తనకున్న పట్టుతోనూ కవితకు అండదండలు అందిస్తూ వస్తున్నారు. కవిత తరఫున ఈడికి పత్రాలు సమర్పించిన తర్వాత భరత్ ఈడీపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

click me!