అంచనాలకు విరుద్ధంగా, నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రాధాన్యత గణనీయంగా తగ్గింది. విజయాలకు కాకుండా, వివాదాలకు నేషనల్ క్రికెట్ అకాడమీ కేంద్ర బిందువుగా మారింది. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ పురోగతిపై ఆకాశన్నంటిన అంచనాలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి.
నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ). భారత క్రికెట్‌కు సంబంధించి కేంద్ర బిందువు. 2019 ప్రపంచకప్‌కు ముందు వరకూ జాతీయ క్రికెట్ అకాడమీ ప్రాధ్యానతపై ఎవరికీ కూడా అనుమానాలు లేవు.
అత్యుత్తమ స్పెషలిస్ట్స్ తో కూడిన బృందం ఎన్‌సీఏలో సేవలు అందించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు అందుకున్న తరువాత భారత క్రికెట్ రూపు రేఖలు మారుతాయి అంతా భావించారు.
undefined
భారత అండర్-19, భారత్-ఏ జట్ల చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయిన తరువాత దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ భారత క్రికెట్ సర్కిల్‌లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుందని అనుకున్నారు.
కానీ... అంచనాలకు విరుద్ధంగా, నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రాధాన్యత గణనీయంగా తగ్గింది. విజయాలకు కాకుండా, వివాదాలకు నేషనల్ క్రికెట్ అకాడమీ కేంద్ర బిందువుగా మారింది. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ పురోగతిపై ఆకాశన్నంటిన అంచనాలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి.
నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఇటీవలే ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎన్‌సీఏ డైరెక్టర్, మాజీ సహచర ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమయ్యాడు.
Also read; దాదా క వాదా: బుమ్రా కోసం గంగూలీ జోక్యం...
ఎన్‌సీఏ పురోగతిపై భవిష్యత్ ప్రణాళికలపై గురించి దాదా, ద్రవిడ్ ఆ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఎన్‌సీఏ అభివృద్ది పనులు, పురోగతి చర్యలు ఊపందుకున్నాయి. మరో పదిహేను రోజుల్లో జాతీయ క్రికెట్ అకాడమీ మెడికల్, ట్రైనింగ్, ఫిట్‌నెస్ విభాగాల్లో నిపుణులను తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
అంతర్జాతీయ క్లినిక్ సేవలు ఇక భారత్ లోనే...
రాహుల్ ద్రవిడ్ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత క్రికెట్ అకాడమీలో నిపుణుల కొరత మొదలైంది. అన్ని విభాగాల్లో స్పెషలిస్టులు లేకుండానే ఎన్‌సీఏ కొనసాగుతోంది. దీంతో భారత స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు గాయం నుంచి కోలుకునేందుకు నేషనల్ క్రికెట్ అకాడమిని ఆశ్రయించలేదు.
అందుకు బదలుగా, వ్యక్తిగత శిక్షకుల వద్ద రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నారు ఈ క్రికెటర్లు. ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్ తీవ్రంగా స్పందించారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రాకు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించడానికి సైతం నిరాకరించాడు.
మరి క్రీడాకారులు ఇలా తలపొగరుగా ప్రవర్తిస్తున్నారు అంటే...అలా అనడానికి వీల్లేదు. క్రికెట్ అకాడమీ నిపుణుల నైపుణ్యాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. ఉదాహరణకు భువనేశ్వర్ కుమార్ విషయం గనుక తీసుకుంటే... గాయం నుంచి కోలుకుని జాతీయ జట్టు తరఫున మూడు టీ20లు మాత్రమే ఆడిన భువనేశ్వర్ కుమార్ స్పోర్ట్స్ హెర్నియా (గజ్జల్లో గాయం)తో బాధపడ్డాడు.
ఎన్‌సీఏ వైద్య పరీక్షల్లో ఎక్కడా కూడా స్పోర్ట్స్ హెర్నియాను గుర్తించలేదు. భువనేశ్వర్ కుమార్ విషయంలో ఎన్‌సీఏ ప్రామాణికత ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఎన్ సిఎ లోని లోటుపాట్లను సమగ్రంగా రూపుమాపాలని ఇరు దిగ్గజ క్రికెటర్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు.
Also read; 'దాదా'గిరి : ద్రావిడ్ పై పెత్తనం, భవిష్యత్తు చిక్కులివే...
ఈ విషయాలను పరిగణించిన రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు జాతీయ క్రికెట్ అకాడమీలోనే అత్యుత్తమ అధునాత సదుపాయాలు, నిపుణులతో కూడిన క్లీనిక్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ క్లీనిక్‌తో బీసీసీఐ చర్చలు జరుపుతోందని సమాచారం.
లండన్‌లోని ఫోర్టిస్ క్లీనిక్ బెంగళూర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మెడికల్ ప్యానల్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. చాలా మంది భారత క్రికెటర్లు రిహాబిలిటేషన్ సమయంలో, శస్త్రచికిత్సల సమయంలో ఇదే ఫోర్టిస్ క్లినిక్ వైద్య నిపుణుల సలహాలు తీసుకున్నారు. దీంతో ఆ హాస్పిటల్‌కు చెందిన నిపుణులతో బెంగళూర్‌లోనే మెడికల్ ప్యానల్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని దాదా, ద్రవిడ్ లు నిర్ణయించారు.
ఈ క్లినిక్ ఏర్పాటుతోపాటు, నేషనల్ క్రికెట్ అకాడమీలో చాలా కాలం నుంచి కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫాస్ట్ బౌలింగ్ కార్యక్రమం రూపకల్పన సహా జాతీయ జట్టులో బౌలింగ్ బృందంతో సమన్వయం చేసుకోవాల్సిన కీలక స్థానమైన ఫాస్ట్ బౌలింగ్ చీఫ్ పోస్టు ఖాళీగా ఉంది. అందులో ఎవరూ లేరు.
దీనిని త్వరలోనే సమర్థవంతమైన మాజీ పేసర్‌తో భర్తీ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మాజీ ఫిట్‌నెస్ ట్రైనర్ శంకర్ బసు కోహ్లిసేనపై చాలా కీలక ప్రభావం చూపించాడు. శంకర్ బసు లేకపోవడంతో... టీమ్ ఇండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ సహా న్యూట్రిషన్‌లోనూ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది.
జాతీయ క్రికెట్ అకాడమీలో కీలకమైన న్యూట్రిషనిస్ట్ (పౌష్టికాహార నిపుణుడు) సైతం లేకపోవటం గమనార్హం. రాహుల్ ద్రవిడ్ త్వరలోనే న్యూట్రిషనిస్టు పోస్టును భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.
వీటితో పాటు జాతీయ క్రికెట్ అకాడమికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేసేందుకు సోషల్ మీడియా మేనేజర్‌ను నియమించుకోనుంది జాతీయ క్రికెట్ అకాడమీ.
గాయాల పాలైన ఆటగాళ్లు, రీహాబిలిటేషన్, ఎన్‌సీఏ ఇతర అంశాలపై సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇకమీదట నుంచి ఇవ్వనున్నారు. ఎన్‌సీఏ లోపల ఏం జరుగుతుందనే విషయంపై ఊహాగానాలకు తావివ్వకుండా, వాస్తవిక పరిస్థితులను బహిర్గత పరిచేందుకు ఈ సోషల్ మీడియా మేనేజర్ నియామకాన్ని చేపట్టనున్నారు.
ఇక సమూల ప్రక్షాళనే...
అన్ని విభాగాల్లోనూ నిపుణులను నియమించుకోనున్న జాతీయ క్రికెట్ అకాడమీ, అకాడమీలో వినూత్న కార్యక్రమాలకు రూప కల్పన చేయాలని యోచిస్తోంది. రానున్న ఏడాదిన్నర లోపే నేషనల్ క్రికెట్ అకాడమీ నూతన భవనాన్ని నిర్మిస్తామని గంగూలీ పేర్కొన్నాడు.
Also read: ఎవరైనా సరే అక్కడికి వెళ్లాల్సిందే.. బౌలర్లకు దాదా స్ట్రిక్ట్ ఆదేశాలు
బెంగళూరు శివారుల్లో బీసీసీఐ 40 ఎకరాల విలువైన స్థలం కొనుగోలు చేసింది. అక్కడ అకాడమీ, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, 5 స్టార్ హోటల్, కాన్ఫరెన్స్ హాల్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ మెడిసిన్‌కు సంబంధించి ప్రత్యేక విభాగం వంటి వాటిని ఎన్‌సీఏ నూతన భవనంలో అందుబాటులోకి తేనున్నారు.
ఈ అకాడెమీలో లెవల్ 2, లెవల్ 3 కోచింగ్ కోర్సులను ఎన్‌సీఏ ప్రవేశ పెట్టడానికి యోచిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఎన్‌సీఏకు ఫీజు చెల్లిస్తే... రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులకు ఇక్కడ కోచింగ్ ఇవ్వబడుతుంది.
2019 సంవత్సరాంతంలో ప్రతికూల అంశాలపై వార్తల్లో నిలిచిన నేషనల్ క్రికెట్ అకాడమీ 2020లో పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. భారత్ క్రికెట్‌కు సంబంధించి ఏ విషయమైనా ఎన్‌సీఏ ద్వారానే జరగాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశాడు.
2020లో నేషనల్ క్రికెట్ అకాడమీ నూతన రూపు సంతరించుకుని, మళ్లీ పునర్వైభవాన్ని సాధించి, భారత క్రికెట్‌కు కేంద్ర బిందువుగా నిలుస్తుందేమో చూడాలి.