రాజధాని రైతులపై వ్యాఖ్యలు: చంద్రబాబు ఫ్రస్ట్రేషన్

By telugu teamFirst Published Jan 2, 2020, 1:10 PM IST
Highlights

రాజధాని రైతులకు సంఘీభావం తెలుపడానికి అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు ప్రజలను తప్పు పడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిని ముంచాలనే ప్రయత్నం చేసినప్పుడు మీరు పట్టించుకోలేదంటూ తప్పు పట్టారు.

రాజధాని రైతుకు మద్దతుగా అమరావతిలో ప్రాంతంలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆయన రాజధాని రైతులను తప్పు పడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

"నా ప్రజావేదిక ను కూల్చితే, మీరు రాలేదు. అయినా నేను మీ దగ్గరకి వచ్చాను. జగన్ కి వోట్లు వేసి తప్పు చేసింది మీరు.. ఇప్పుడు నన్ను పోరాడమంటున్నారు. ఆ రోజు హైటెక్ సిటీ కట్టాను.. అక్కడా నాకు వోటు వేయలేదు.ఈరోజు అమరావతి కట్టాను..ఇక్కడా నాకు వోటు వేయలేదు" అని చంద్రబాబు రాజధాని రైతులపైనే కాకుండా తెలంగాణ ప్రజలపై కూడా వ్యాఖ్యలు చేశారు. 

తన ఇల్లు ముంచే ప్రయత్నం చేస్తే అది తన సొంత గొడవ అనుకున్నారని, ఇప్పుడు రాజధాని విషయం వచ్చేసరికి మీలో ఆందోళెన మొదలైందని, వద్దన్నా వినకుండా వైసీపీకి ఓట్లేసి గెలిపించి మీ నెత్తిన కుంపటి పెట్టుకున్నారని కూడా ఆయన అన్నారు. 

చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన నిస్పృహకు గురైనట్లు కనిపిస్తున్నారు. నవ్వుతూనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలు ఆయనలోని నిరాశానిస్పృహలను తెలియజేస్తున్నాయి.  "కరెంటు తీగను పట్ట కోవద్దు అంటే విన్లేదు. ఇప్పుడు చూడండి ఏమైందో.." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

తన ప్రభుత్వ విధానాలు నచ్చకనే ప్రజలు టీడీపీని ఓడించారనే విషయాన్ని చంద్రబాబు అంగీకరించాల్సి ఉంటుంది. తిరిగి వారి మద్దతు పొందడానికి అవసరమైన వ్యూహంతో, ఎత్తుగడలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే, అందుకు విరుద్ధంగా ఆయన ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను, అటు తెలంగాణ ప్రజలను ఆయన తప్పు పట్టారు. వారిపై నిందులు వేశారు.

తెలంగాణ ప్రజలు టీడీపీ విధానాలతో, చంద్రబాబు వ్యూహాలతో ఎంతగా విసిగిపోయారో చెప్పనవసరం లేదు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఐదేళ్ల చంద్రబాబు పాలనను తిరస్కరించారు. విధానాలు, చర్యలు నచ్చకనే ఆ పనిచేశారు. గత పాలనలో తాము చేసిన తప్పిదాలు ఏమిటనేది విశ్లేషణ చేసుకుని అందుకు అనుగుణంగా ప్రజల మద్దతును చూరగొనడానికి ప్రయత్నించాలి. 

అదే సమయంలో తమకు వైఎస్ జగన్ మేలు చేస్తారని ప్రజలు వైసీపీని గెలిపించారు. జగన్ ప్రభుత్వం కూడా తప్పులు చేస్తూ పోతే వచ్చే ఎన్నికల్లో ఆయనకు కూడా చంద్రబాబుకు చెప్పిన గుణపాఠమే చెబుతారు. వచ్చే ఐదేళ్లలోగా ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి అనువైన వ్యూహాలతో, కార్యక్రమాలతో చంద్రబాబు ముందుకు వెళ్లాలే తప్ప ప్రజలను నిందించడం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా, తీవ్ర నిస్పృహకు గురై వ్యాఖ్యలు చేసే నేతను ప్రజలు అంత త్వరగా విశ్వసించరు.

click me!