కేఎల్ రాహుల్ ఛాలెంజ్: ముప్పు పంత్ కా ధావన్ కా?

By telugu teamFirst Published Jan 18, 2020, 3:24 PM IST
Highlights

రాహుల్ నిన్న చేసిన వీర విహారం మామూలుగా లేదు. ఇంకొంచం ముందు గనుక రాహుల్ బ్యాటింగ్ కి దిగి ఉంటే సెంచరీ కొట్టేవాడనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. రాహుల్ వచ్చి రావడంతోనే ఫోర్ కొట్టి తాను ఒక ఇంటెంట్ తో వచ్చినట్టు చెప్పకనే చెప్పాడు. 

నిన్న ఆస్ట్రేలియాతో మ్యాచులో భారత జట్టు ఒక సమిష్టి, సమగ్ర విజయాన్ని నమోదు చేసింది. అన్ని విభాగాల్లోనూ భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నిన్నటి మ్యాచులో టాస్ ఓడినప్పటికీ భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోరే సాధించిందని చెప్పవచ్చు. 

భారత బ్యాటింగ్ లో ధావన్, రోహిత్ లు బలమైన పునాది వేశారు. ఆతరువాత కోహ్లీ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ గేర్లు మార్చే తరుణంలో ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఔటయ్యాడు. కోహ్లీ ఔటయిన వెంటనే...మనీష్ పాండే కూడా 2 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. 

అప్పటి వరకు భారీ స్కోర్ దిశగా సాగుతున్న జట్టులో నిశ్శబ్దం అలుముకుంది. శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండేలు అవుటయ్యిన తరువాత జట్టు 300 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం అందరిలోనూ వచ్చింది. కానీ అక్కడే రాహుల్ రూపంలో భారతదేశానికి ఒక అద్భుతమైన ఫినిషర్ దొరికినట్లయింది. 

రాహుల్ నిన్న చేసిన వీర విహారం మామూలుగా లేదు. ఇంకొంచం ముందు గనుక రాహుల్ బ్యాటింగ్ కి దిగి ఉంటే సెంచరీ కొట్టేవాడనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. రాహుల్ వచ్చి రావడంతోనే ఫోర్ కొట్టి తాను ఒక ఇంటెంట్ తో వచ్చినట్టు చెప్పకనే చెప్పాడు. 

Also read: ఒక వైపే చూడు: కెఎల్ రాహుల్ దూకుడు వ్యూహం ఇదే...

ఇక అది మొదలు అవతలి ఎండ్ లో వికెట్లు  పడుతున్నప్పటికీ రాహుల్ మాత్రం ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఆటలో పూర్తిగా నిమగ్నమయిపోయి భారత్ స్కోర్ బోర్డును పరుగులుపెట్టించాడు. గ్రౌండు నలుదిక్కులా షాట్లు కొడుతూ అభిమానులను ఉర్రూతలూగించారు. 

అసలు సాధారణంగా కెఎల్ రాహుల్ అంటే... టీం లోకి వచ్చిన కొత్తలో టెస్టు బ్యాట్స్ మెన్ మాత్రమే. ఆతర్వాత నెమ్మదిగా వన్డేల్లో కూడా ఓపెనర్ గా కనిపించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఐపీఎల్ పుణ్యమాని అతనిలోని భయంకరమైన టి 20 ఫార్మటు ఆటగాడు బయటకొచ్చాడు. 

ఇలా అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్న రాహుల్ ఇప్పుడు ఏకంగా ఏ స్థానంలోనయినా ఆడే పొజిషన్ కు చేరుకున్నాడు. రాహుల్ ఓపెనర్ గా, ఇటు నెంబర్ 4 బ్యాట్స్ మెన్ గా, తాజా మ్యాచులో ఫినిషర్ అవతారం కూడా ఎత్తాడు. 

Also read: టీమిండియా: రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ ముప్పు

ఇలా ఏ స్థానంలోనయినా బ్యాటింగ్ చేయగలగడం ఒక కళ. ఫస్ట్ మ్యాచులో గనుక తీసుకుంటే... కోహ్లీ తన రెగ్యులర్ స్థానమైన 3వ స్థానంలో రాలేదు కాబట్టే భారత్ మంచును కోల్పోవాలిసి వచ్చిందని అందరూ అన్నారు. 

ఇలా ఏ స్థానంలోనయినా ఆడగలిగే ఆటగాడు గనుక ఉంటే....టీం కు ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. కావాల్సి వచ్చినప్పుడు బాధ్యతగా, చివర్లో బీభత్స ఇన్నింగ్స్ లను కూడా ఆడగలగడం ప్లేయర్ విశిష్టతను తెలియజేస్తుంది. 

ఇక ఇలా ఏ స్థానంలోనయినా ఒదిగిపోయి ఆడగలగడం ప్లేయర్ గా రాహుల్ కి జట్టులో స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. దానితోపాటు రాహుల్ వికెట్ కీపర్ కూడా అవడం వల్ల భారత్ కి ఇంకో ఎక్స్ట్రా ప్లేయర్ ని కూడా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ దక్కుతుంది. 

ఇప్పుడు రిషబ్ పంత్ కి జట్టు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం అతడి మెరుపు బ్యాటింగ్. రాహుల్ గనుక ఈ విధమైన ఫామ్ ని కొనసాగిస్తే రాహుల్ నే టీం కొనసాగించే ఆస్కారం ఉంది. 

దానికి తోడు రాహుల్ పంత్ కన్నా నమ్మదగ్గ, కన్సిస్టెంట్ బ్యాట్స్ మెన్. ఎప్పుడు ఎలా ఆడాలో చక్కగా తెలిసినవాడు. బంతులను అంచనా వేయడంలో అతడు పంత్ కన్నా చాలా తెలివిగా వ్యవహరిస్తాడు కూడా. 

Also read: శిఖర్ ధావన్ కి కెఎల్ రాహుల్ ఎసరు...

ఇక కీపింగ్ నైపుణ్యాల విషయానికి వస్తే... రాహుల్ పంత్ కన్నా బెటర్ వికెట్ కీపర్ అని చెప్పక తప్పదు. రాహుల్ ధోని స్థాయిలో కీపింగ్ చేయలేకున్నప్పటికీ అతడి నైపుణ్యత మాత్రం పంత్ కన్నా మెరుగ్గా ఉంటుందనడంలో సందేహం లేదు.  బహుశా బ్యాటింగ్ సక్సెస్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ కాబోలు, రాహుల్ మాత్రం కీపింగ్ లో రాణిస్తున్నాడు. 

ఒకవేళ శిఖర్ ధావన్ గనుక ఫామ్ కోల్పోయినా వేరే ఎవరు లేని కారణంగా చాలాసార్లు అతగాడిని కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రాహుల్ గనుక ఉంటే, ఇతడే కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఆ స్థానంలో మరో మెరుగైన ఆల్ రౌండ్ర్ని ఎంపిక చేసుకునే అవకాశం టీం ఇండియాకు దక్కుతుంది. 

ఇలా ఇప్పుడు రాహుల్ కొనసాగిస్తున్న ఆటతీరుతో, భవిష్యత్తులో రాహుల్ ఏ స్థానంలో ఆడతాడో ఇప్పుడే చెప్పలేకున్నప్పటికీ... టీం ఇండియాలో మాత్రం అతగాడి స్థానం మరింత పదిలం చేసుకునే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. 

click me!