తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై, స్థానికంగా వారు ఎదుర్కుంటున్న వ్యతిరేకతను అంచనా వేయడానికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సర్వేలు చేయిస్తున్నారు. సర్వే ఫలితాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించే అవకాశం ఉంది.
వచ్చే శాసనసభ ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు అప్పుడే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై, వారి మీద స్థానికంగా ఉన్న ప్రజాభిప్రాయంపై సర్వేలు చేయించినట్లు చెబుతున్నారు. తెలగాణ శాసనసభ ఎన్నికలకు మరో 27 నెలల గడువు ఉంది. 2023 డిసెంబర్ లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులు గెలిచే అవకాశం ఉందా, లేదా అనే విషయంపై అంచనా కోసం కేసీఆర్ సర్వేలు చేయించి అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నారు. స్థానికంగా వారిపై ఏ మేరకు వ్యతిరేకత ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
undefined
ప్రస్తుతం టీఆర్ఎస్ కు 103 మంది శాసనసభ్యులున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 88 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెసు నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు పార్టీలో చేరారు. దీంతో శాసనసభలో టీఆర్ఎస్ బలం 103కు పెరిగింది.
టీఆర్ఎస్ శాసనసభ్యుల్లో 68 మంది రెండుసార్లు, అంతకన్నా ఎక్కువ సార్లు విజయాలు సాధిచారు. వరుసగా విజయాలు సాధిస్తున్న ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అభిప్రాయంతో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రధానంగా కేసీఆర్ నాయకత్వంపై, ఆయన ఇమేజ్ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్తుంది. కానీ స్థానికంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే అది నష్టం చేకూర్చే ప్రమాదం లేకపోలేదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ 2018 శాసనసభ ఎన్నికల్లో ఐదుగురికి మినహా మిగతా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఇచ్చిన ఐదు స్థానాల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే, గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబబ తగిలింది. సర్వే ఫలితాలను పక్కపెడుతూ మెజారిటీ సిట్టింగ్ కార్పోరేటర్లకు ఈ ఎన్నికల్లో సీట్లు ఇచ్చారు.
జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పోరేటర్లు 99 మంది ఉంటే, వారిలో 78 మందికి తిగిరి పోటీ చేసే అవకాశం కల్పించారు. వారిలో 44 మంది మాత్రమే విజయం సాధించారు. దాంతో టీఆర్ఎస్ బలం బల్దియాలో 99 నుంచి 55కు తగ్గింది.
అంతే కాకుండా, దుబ్బాక సిట్టింగ్ సీటును కూడా టీఆర్ఎస్ కోల్పోయింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాతకు టీఆర్ఎస్ టికెట్ లభించింది. అయితే, ఆమె బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. రామలింగారెడ్డి కుటుంబంపై ప్రజల్తో వ్యతిరేకత ఉందని సర్వేలో తేలినప్పటికీ సుజాతకు టీఆర్ఎస్ నాయకత్వం టికెట్ ఇచ్చింది.
గత అనుభవాల దృష్ట్యా కేసీఆర్ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను పలు సంస్థలతో ఆయన సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ లభిస్తుందా, లేదా అనే టెన్షన్ వారిని పట్టుకుంది.