కిషన్ రెడ్డితో భేటీ ఎఫెక్ట్: గద్దర్ కు కేసీఆర్ గాలం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

By telugu teamFirst Published Aug 29, 2021, 8:44 AM IST
Highlights

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గద్దర్ మద్దతు కోసం తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డితో గద్దర్ భేటీతో కేసీఆర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. ఇటీవల గద్దర్ కిషన్ రెడ్డితో సమావేశమై తనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారు. గద్దర్ ప్రభావం తమపై ప్రతికూలంగా పడే ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించినట్లు చెబుతున్నారు. 

ఆ నేపథ్యంలో గద్దర్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ భేటీ అయ్యారు. శనివారంనాడు ఆల్వాల్  భవానీనగర్ లో వారిద్దరు గద్దర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు చెబుతున్నారు. అయితే, గద్దర్ మద్దతు కోరేందుకు వారు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్దర్ ను కేసీఆర్ పట్టించుకోలేదు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గద్దర్ కిషన్ రెడ్డితో భేటీ కావడం నష్టం చేకూరుస్తుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన మద్దతు కోసం కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ లను దూతలుగా పంపినట్లు ప్రచారం సాగుతోంది. 

దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, అది పేద దళితులకు ఎంతో మేలు చేస్తుందని వారు గద్దర్ తో చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని వారు గద్దర్ ను కోరినట్లు సమాచారం. 

గంటకు పైగా గద్దర్ తో వారిద్దరు మాట్లాడారని సమాచారం. గద్దర్ మాత్రం వారికి ఏ విధమైన హామీ కూడా ఇవ్వలేదని, తటస్థంగా ఉండేందుకు సిద్ధపడ్డారని అంటున్నారు. 

అవినీతి ఆరోపణలపై కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 

ఈటల రాజేందర్ మీద ప్రజల్లో సానుభూతి ఉందనే అంచనాకు వచ్చిన కేసీఆర్ వివిధ రూపాల్లో మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారనే అభిప్రాయం కూడా ఉంది. అంతేకాకుండా వివిధ వర్గాల మద్తతుతో పాటు వ్యక్తుల మద్దతును కూడా కూడగట్టుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తటస్థంగా ఉన్న మేధావులను, కళాకారులను కూడా కలుసుకుంటున్నారు. 

click me!