తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తున్నారు. డజన్ కు పైగా ఉన్న సీనియర్ నేతలను పక్కన పెడుతూ యువతకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉదంతం అందుకు తాజా ఉదాహరణ.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఇటీవలి కాలంలో తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. పలువురు సీనియర్లను పక్కన పెడుతూ యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను దించాలని నిర్ణయించడం అందుకు తాజా ఉదాహరణ. 38 ఏళ్ల గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీకి దించడం ద్వారా ఈ ధోరణి కొనసాగుతుందని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నుంచి ఆయన దాన్ని ఓ వ్యూహంగా అమలు చేస్తున్నారు. గతంలో కూడా ఆయన వ్యూహాన్ని అనుసరించారు. ఆందోల్ నుంచి క్రాంతి కిరణ్ ను, హుజూరాబాద్ నుంచి శానంపూడి సైదిరెడ్డిని పోటీకి దించారు. బాల్క సుమన్ కూడా అదే కోవలోకి వస్తారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో 37 ఏళ్ల నోముల భగత్ ను పోటీకి దించి రాజకీయాల్లో కాకలు తీరిన కాంగ్రెసు నేత జానా రెడ్డిని మట్టి కరిపించారు.
undefined
కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ లో చేరిన 36 ఏళ్ల పాడి కౌశిక్ రెడ్డిని శాసన మండలికి ఎంపిక చేశారు. పార్టీలో చేరిన పది రోజుల్లోనే ఆయనను గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ చేయించారు. ఇందుకు శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా పక్కన పెట్టారు.
కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధసూదనాచారి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్ నేతలను కేసీఆర్ పక్కన పెట్టారు. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా పనిచేసినవారిని కూడా ఆయన విస్మరించారు. గతంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుని యువతకు స్థానం కల్పిస్తున్నారని అంటున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాతను పోటీకి దించారు. 51 ఏళ్ల సుజాత విషయంలో సానుభూతి కూడా పనిచేయలేదు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. టికెట్ అశించిన 32 ఏళ్ల ఎస్ సతీష్ రెడ్డిని కాదని సుజాతను ఆయన పోటీకి దించారు.
నాగార్జున సాగర్ టికెట్ ను కోటిరెడ్డి, కె. గురువయ్య, పి. శ్రనివాస్ యాదవ్ వంటి స్థానిక నాయకులు ఆశించారు. అయితే కేసీఆర్ నోముల భగత్ ను ఎంపిక చేసి ఫలితం సాధించారు. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి కౌశిక్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థిగా ఈటల రాజేందర్ మీద పోటీ చేసి 60 వేలకు పైగా ఓట్లు సాధించారు. కుల సమీకరణల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే, ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆయనను సంతృప్తి పరిచారు.