సుప్రీం సీజే ఎన్వీ రమణ ఆఫర్: జగన్ రిప్లై కోసం కేసీఆర్ వెయిట్

By telugu teamFirst Published Aug 4, 2021, 8:27 AM IST
Highlights

కృష్ణా నదీ జలాల వివాదం కేసును చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ సీఎం కేసీఆర్ వేచి చూసే ధోరణని అవలంబించాలని నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కరానికి మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నానని సుప్రంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇచ్చిన ఆఫర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వేచి చూసే ధోరణిని అవలంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిస్పందన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై ఎన్వీ రమణ స్పందిస్తూ... రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని, ఒకవేళ అలా పరిష్కరించాలనుకుంటే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని, లేదంటే కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటానని, కేసు విచారణను మరో బెంచీకి బదిలీ చేస్తానని చెప్పారు. 

ఎన్వీ రమణ సూచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధపడితే, దానిపై చర్చించి చర్చలకు అంగీకరించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదనపై కేసీఆర్ మంగళవారంనాడు సీఎంవో అధికారులతోనూ, నీటి పారుదల శాఖ అధికారులతోనూ చర్చించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిస్పందించిన తర్వాత చర్చలకు కొన్ని షరతులు పెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో వేసిన కేసును తాము జూన్ లో ఉపసంహరించుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేస్తూ జులైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేయడం ద్వారా సమస్యను సంక్లిష్టం చేసిందని అన్నట్లు తెలుస్తోంది. 

కృష్ణా నదీ జలాల వివాదాన్ని సామరస్యవూర్వకంగా పరిష్కరించుకోవడానికి తాము వేసిన పిటిషన్ 2015 నుంచి అడ్డు పడుతూ వస్తోందని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ వచ్చాయని, దాంతో సమస్యను పరిష్కరించుకోవడానికి సానుకూలంగా ప్రతిస్పందిస్తూ ఆ కేసును ఉపసంహరించుకున్నామని కేసీఆర్ అన్నారు. 

ఈ స్థితిలో సమస్యను జఠిలం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని, అందువల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రతిపాదనపై ముందుగా స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని కేసీఆర్ అన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు అప్పటి పరిణామాలను బట్టి స్పందించవచ్చునని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

click me!