Huzurabad bypoll: దళిత బంధు చైర్మన్ గా మోత్కుపల్లి , కేబినెట్ లో మార్పులు?

By telugu team  |  First Published Aug 12, 2021, 8:47 AM IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ బహుముఖ వ్యూహాలను రచించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మోత్కుపల్లిని దళిత బంధు చైర్మన్ గా చేయడంతో పాటు మంత్రివర్గంలో మార్పులు చేయాలని చూస్తున్నారు.


హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పావులు కదుపుతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించి, హుజూరాబాద్ లో గులాబీ జెండాను ఎగురేయాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన బహుముఖ వ్యూహాలు రచించి, అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఆయన దళిత బంధు పథకానికి చట్టబద్దత కల్పించి, దానికి మోత్కుపల్లి నర్సింహులును చైర్మన్ ఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మోత్కుపల్లి నర్సింహులు బిజెపికి రాజీనామా చేసినప్పటికీ ఇంకా టీఆర్ఎస్ లో చేరలేదు. ఆయన కేసీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ స్థితిలో మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో చేరడం లాంఛనమేనని భావిస్తున్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేలోగా మంత్రివర్గంలో కూడా మార్పులు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. 

Latest Videos

undefined

ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత కేసీఆర్ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 16కు తగ్గింది. మంత్రివర్గంలో ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్కరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో మంత్రివర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం పెంచాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. 

ఎస్సీ సామాజికవర్గానికి చెందిన శాసనసభ్యులు 19 మంది ఉన్నారు. వారిలో 18 మంది టీఆర్ఎస్ కు చెందినవారే. వారిలో ఎనిమిది మాలలు, తొమ్మిది మంది మాదిగలు. దీంతో మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని సీఎం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. 

click me!