పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు: బిజెపితో కటీఫ్, చంద్రబాబుతో పొత్తు?

By Pratap Reddy KasulaFirst Published Mar 15, 2023, 12:07 PM IST
Highlights

అవసరమైతే బిజెపితో తెగదెంపులు చేసుకుని చంద్రబాబు నాయకత్వంలోని టిడిపితో పొత్తు పెట్టుకోవాలని జనసేన చీఫ్ ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. బిజెపి టిడిపితో కలిసి రాకపోతే అదే జరుగుతుందనే సంకేతాలను ఆయన ఇస్తున్నారు.

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాష్ట్ర బిజెపి నాయకత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెట్టే రాజకీయాలకు ఆయన తెర తీసినట్లు కనిపిస్తున్నారు. తనతో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యత చంద్రబాబుకు ఉన్నదని ఆయన భావిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ చంద్రబాబు తనకు అనుకూలంగా వ్యవహరించేలా ఒత్తిడి పెడుతున్నట్లు అర్థమవుతోంది. అయితే, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది.

అవసరమైతే బిజెపితో తెగదెంపులు చేసుకుని, టిడిపితో కలిసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన కదలికలను బట్టి కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకత్వంపై మంగళవారం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను చెప్పినట్లు బిజెపి నడుచుకుని ఉంటే ఓట్ల చీలిక గురించి మాట్లాడిన అవసరం ఉండేది కాదని ఆయన అన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం పట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తూనే రాష్ట్ర నాయకత్వాన్ని దుమ్మెత్తిపోశారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ (వైసిపి) వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని తాను చెప్పడానికి కారణాలున్నాయని, బిజెపితో పొత్తు పెట్టుకుని తాము అనుకున్న ప్రణాళికను అమలు చేసి ఉంటే టిడిపి లేకుండానే తాము ఎదిగి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. బిజెపి, జనసేన, టిడిపి కలిసి పోటీ చేయాలనేది ఆయన అభిమతమని అర్థం చేసుకోవడానికి ఆ వ్యాఖ్యలు వీలు కల్పిస్తున్నాయి. కలిసి కార్యక్రమాలు చేయడానికి బిజెపి రాష్ట్ర నాయకులు ముందుకు రావడం లేదని ఆయన తప్పు పట్టారు. తన ఎజెండాకు బిజెపి నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర నాయకత్వం కలిసి రావడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. 

టిడిపిపై తనకు ప్రత్యేకమైన ప్రేమ, చంద్రబాబుపై ఆరాధన లేదంటూనే ఆయన చంద్రబాబు సమర్థుడనే గౌరవం ఉందని అన్నారు. అలాగే, తెలంగాణ బిజెపి నాయకత్వంపై కూడా ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాము గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో పోటీ చేస్తామంటే నువ్వు ఆంధ్రవాడివి, ఇక్కడెట్లా పోటీ చేస్తావని తెలంగాణ బిజెపి నాయకులు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రవాళ్ల ఓట్లు కావాలి గానీ పోటీ చేయవద్దని అంటే ఎలా అని ఆయన అన్నారు. తాను బిజెపికి అండగా నిలబడ్డానని, వారే ముందుకు తీసుకుని వెళ్లడం లేదని తప్పుపట్టారు.టిడిపితో పొత్తుకు బిజెపి సిద్ధపడాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది.  

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ వైఎస్ జగన్ ను ఓడించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అది టిడిపితో కలిస్తే తప్ప సాధ్యం కాదని కూడా ఆయన అనుకుంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఆయన నిరంతరం కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కాపులు తనకు అండగా నిలువలేదని కూడా అంటున్నారు. అయితే, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, వారు ముందుకు వస్తే వారి వెనక యాదవులు, గౌడ్లు, శెట్టిబలిజలు, ఎస్సీలు మిగతా కులాలవాళ్లు కూడా నడుస్తారని ఆయన అంటున్నారు. కాపు సామాజిక వర్గాన్ని వైసిపికి దూరం చేయగలిగితే కూడా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించవచ్చునని భావిస్తున్నారు.
 

click me!