పవన్ పై వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు: మిగతా అంతా...

By telugu teamFirst Published Nov 12, 2019, 10:52 AM IST
Highlights

పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు సమంజసమనేది ప్రశ్నించాల్సిన విషయం. అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం గురించి జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని లేదా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలతోనే ఉన్నట్లు అర్థమవుతోంది. జగన్ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కూడా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి.

స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే తన నిర్ణయాన్ని గట్టిగా చెబుతూ వైఎస్ జగన్ ఆ ముగ్గురిపై వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురికి జగన్ వేస్తున్న ప్రశ్నలు సమంజసమా, కాదా అనేది ఆలోచించాల్సి ఉంటుంది. అయితే, పవన్ కల్యాణ్ మీద వైఎస్ జగన్ వ్యక్తిగత స్థాయిలోకి వెళ్లి విమర్శలు చేసినట్లు కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ ముగ్గురు భార్యలకు నలుగురో ఐదుగురో పిల్లలు, వారు ఏ స్కూల్లో చదువుతున్నారని ఆయన అడిగారు. 

Also Read: 'పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు ఏ స్కూళ్లో చదువుతున్నారు'

పవన్ కల్యాణ్ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారని అడిగింతే వరకు ఫరవాలేదు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఎత్తి పొడవడం సమంజసమేనా అనేది ఆలోచించాలి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్ పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అందువల్ల ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం సరి కాదనే మాట వినిపిస్తోంది.

ఇకపోతే, తెలుగు భాష పరిరక్షణ గురించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నవారు తమ పిల్లలను ఏ పాఠశాలల్లో చదివిస్తున్నారు, ఏ మీడియంలో చదివిస్తున్నారని అడగాల్సిన అవసరం మాత్రం ఉంది. చంద్రబాబు, వెంకయ్య నాయడు, పవన్ కల్యాణ్ లకు మాత్రమే ఆ ప్రశ్న పరిమితం కారాదు. చాలా మంది ప్రైవేట్ స్కూళ్లలోని ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలను చదివిస్తున్నారు. పేదవారు, ముఖ్యంగా గ్రామీణ పేదలు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. 

ఈ సందర్భంలో పవన్ కల్యాణ్ కు సంబంధించి ఓ మాట చెప్పడం తప్పేమీ కాకపోవచ్చు. తెలుగు భాషా పరిరక్షణ గురించి పవన్ కల్యాణ్ ఆంగ్ల భాషలో ట్వీట్లు చేశారు. అంటే, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ, తెలుగు భాషను కాపాడాలని మాట్లాడుతూ ఆంగ్ల భాషలో ట్వీట్లు చేయడాన్ని బట్టి మనలోని వైరుధ్యమేమిటో అర్థం కావడం లేదా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తే తప్పేమీ కాకపోవచ్చు.

Also Read: బడుల్లో ఇంగ్లీష్ మీడియం: వైఎస్ జగన్ నిర్ణయంలోని ఆంతర్యం ఇదే

తెలుగు భాషా పరిరక్షణ వేరు, పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వేరనే విషయాన్ని చాలా మంది అంగీకరించడానికి సిద్ధంగా లేరు. పేద, గ్రామీణ, దళిత లేదా బహుజన వర్గాలకు మాత్రమే తెలుగు మీడియంను పరిమితం చేస్తే తెలుగు భాష పరిరక్షణ జరిగి తీరుతుందా అనేది ఆలోచించాల్సిన విషయం. అదే సమయంలో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ మిగతావాళ్లకు ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. 

తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలుగు మీడియంలోనే చదివిస్తామని ముందుకు వచ్చినవాళ్లు వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే అర్థం ఉంటుంది. జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మిగతావారికి ఏ విధమైన న్యాయబద్ధత ఉంటుందనేది అనివార్యంగా అడగాల్సిన ప్రశ్నే.

click me!