హుజూరాబాద్ శాసనసభ సీటు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి మంత్రి హరీష్ రావుకు సమస్యను తెచ్చిపెడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రబుల్ షూటర్ ట్రబల్ లో పడుతారని వ్యాఖ్యానిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు చిక్కుల్లో పడ్డారనే మాట వినిపిస్తోంది. ట్రబుల్ షూటర్ కే ట్రబుల్ ప్రారంభమవుతుందనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఆయనను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించే బాధ్యతను కేసీఆర్ ఆయన భుజాల మీద మోపారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్న నేతగా Harish rao గుర్తింపు పొందారు.
తన పాత మిత్రుడు, తాజా ప్రత్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కానీ, ఫలితం ఆయనకు ప్రతికూలంగా వచ్చింది. నిజానికి, హుజూరాబాద్ నియోజకవర్గంలో Eatela rajender ప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కన్నా హరీష్ రావే అనిపించేలా ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
undefined
టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా హాజరు కాకుండా హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం పనిచేశారు. ఆయనతో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ కూడా ఉప ఎన్నిక ప్రచారంలో నిండా మునిగిపోయి ఈటల రాజేందర్ ను ఓడించాలని ప్రయత్నించారు. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో మకాం వేశారు. అయినా ఫలితం సాధించలేకపోయారు.
Also Read: సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది: హుజూరాబాద్ ఫలితంపై రేవంత్ రెడ్డి
అత్యధిక రౌండ్లలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యత సాధించడం హరీష్ రావుకు ఏ మాత్రం మింగుడుపడని వ్యవహారంగా మారింది. గతంలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కేసీఆర్ హరీష్ రావుకే అప్పగించారు. అక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పరాజయం పాలయ్యారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించి శాసనసభలోకి అడుగు పెట్టారు. హరీష్ రావుకు HUzurabad bypoll result రెండో చేదు అనుభవం. ఈ ఓటమితో కేసీఆర్ వద్ద హరీష్ రావు ప్రాబల్యం తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఇక్కడ దిగ్గజం కుందూరు జానారెడ్డి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేశారు. జానారెడ్డిని ఓడించడం ద్వారా కేటీఆర్ తన ప్రాబల్యం చాటుకున్నారనే మాట వినిపించింది. ఈటల రాజేందర్ ను ఓడించడం అంత కష్టం కాదనే పద్ధతిలో ఓ సందర్భంలో కేటీఆర్ మాట్లాడారు ఈటల రాజేందర్ జానారెడ్డికన్నా గొప్పవాడా అని ఆయన ప్రశ్నించారు.
అయితే, ఈటల రాజేందర్ బిజెపి అండదండలతో తన కోటను పదిలం చేసుకున్నారు హుజురాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించడం ద్వారా తన ప్రాబల్యాన్ని, సత్తాను చాటుకున్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలను కలుస్తూ వచ్చారు. ఆయన ఈ ఎన్నికను ఓ సవాల్ గా తీసుకున్నారు. నిజానికి, ఈటల రాజేందర్ తన ప్రత్యర్థిగా ముఖ్యమంత్రి KCRనే చూపించారు. తనపై ఆరోపణలు చేసి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన ఫలితాన్ని కేసీఆర్ కు చూపించాలనే పట్టుదలతో ఆయన పనిచేశారు.
హరీష్ రావుపై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద తిరుగుబాటుకు హరీష్ రావు ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. బహుశా, ఈ విషయాన్ని కేసీఆర్ తేలికగా తీసుకుంటారని అనుకోవడానికి లేదు. హరీష్ రావుపై కూడా ఆయన తీవ్రమైన అసంతృప్తి మాత్రమే కాకుండా ఆగ్రహం కూడా ఉందని చెబుతారు. ఈ స్థితిలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం హరీష్ రావుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.