బద్వేలు శాసనసభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీతో గెలిచారు. 90 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి ప్రత్యర్థులను చిత్తు చేశారు. పోటీకి దిగకపోవడం ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మంచి పనిచేశారని అర్థమవుతోంది.
అమరావతి: బద్వెల్ శాసనసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థులను పోటీకి దించకపోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరువు దక్కించుకున్నారు. Pawan Kalyan నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించి బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు తేలిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
దాసరి సుధకు 90 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. పొత్తులో భాగంగా బిజెపి బద్వేలు సీటును జనసేనకు కేటాయించింది. అయితే, సంప్రదాయానికి కట్టుబడుతూ తాము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో Badvel bypoll వచ్చింది. ఆయన సతీమణి దాసరి సుధను వైసీపీ పోటీకి దించింది. దాంతో జనసేన అభ్యర్థిని పోటీకి దించకూడదని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత తమ పార్టీ అభ్యర్థిని కూడా పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
undefined
దాంతో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించారు. కాంగ్రెసు పార్టీ కూడా కమలమ్మను తమ పార్టీ అభ్యర్థిగా పోటీకి దించింది. ఈ స్థితిలో వైసీపీ అభ్యర్థి Dasari Sudhaను ఈ రెండు పార్టీలు కూడా ఏ మాత్రం ఎదుర్కోలేకపోయాయి. జనసేన, టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగి ఉంటే దాసరి సుధ మెజారిటీ తగ్గి ఉండేది కావచ్చు గానీ ఓడించే పరిస్థితి మాత్రం లేదని అర్థమవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని గౌరవించి సోము వీర్రాజు తమ అభ్యర్థిని పోటీకి దించకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెసు పార్టీ పోటీకి దిగి సాధించింది కూడా ఏమీ లేదు.
వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90,211 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ లో వచ్చిన ఓట్లతో కలిపితే మెజారిటీ 90,228 అవుతుంది. BJP డిపాజిట్ కోల్పోయింది. బిజెపికి కేవలం 21638 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెసు గురించి చెప్పనక్కర్లేదు. కేవలం 6,223 ఓట్ల మాత్రమే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. ఆ పార్టీ బలం గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కానీ బిజెపి విషయం వచ్చేసరికి అందుకు భిన్నమైంది. వైఎఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలని ప్రయత్నిస్తోంది. అయితే, బిజెపి అందుకు తగిన విధంగా ముందుకు సాగడంలేదనేది తాజా ఫలితం తెలియజేస్తోంది.
పైగా, బిజెపి పొత్తు ధర్మాన్ని కూడా పాటించలేదనే విమర్శలను ఎదుర్కుంటోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని బిజెపి అధ్యక్షుడు Somu Veerraju గౌరవించకపోవడం తప్పిదమే అవుతుంది. జనసేనకు సీటును కేటాయించినప్పుడు బిజెపిని పోటీకి దించకుండా ఉంటే గౌరవంగా ఉండేది. పోటీ చేయడం వల్ల బిజెపి అదనంగా సాధించింది ఏమీ లేదు. నిజానికి, బిజెపి రాష్ట్ర నాయకత్వం తీరుపై పవన్ కల్యాణ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. గతంలో తిరుపతి లోకసభ ఉప ఎన్నిక విషయంలో సోము వీర్రాజు అనుసరించిన వైఖరిపై కూడా పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: Badvel Bypoll Result 2021: బద్వేల్ లో వైసిపి ఘన విజయం... ఎమ్మెల్యేగా మారిన డాక్టర్ సుధ
పవన్ కల్యాణ్ కు దగ్గర కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ చంద్రబాబు బద్వేలులో తమ పార్టీ అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేశారనే మాట వినిపిస్తోంది. బిజెపి తీరు సరిగా లేకపోతే పవన్ కల్యాణ్ చంద్రబాబుకు దగ్గరయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.