హరీష్ రావు చిచ్చు: రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెసు సీనియర్ల సమరం

By Pratap Reddy Kasula  |  First Published Mar 20, 2022, 5:35 PM IST

తెలంగాణ కాంగ్రెసులో మంత్రి హరీష్ రావు చిచ్చు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వి హనుమంతరావు హరీష్ రావును కలిసిన తర్వాతనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు భేటీ అయ్యారని అంటున్నారు.


తెలంగాణ కాంగ్రెసు పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెసు సీనియర్ నేతలు ఒక్కటవుతున్నారు. తెలంగాణ పీసీసీ పదవి నుంచి ఆయనను తప్పించాలనే డిమాండు కూడా పెరుగుతోంది. తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెసులోని విభేదాలకు ఆజ్యం పోసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు (విహెచ్) హరీష్ రావును కలిసిన తర్వాతనే సీనియర్ కాంగ్రెసు నేతలు సమావేశం ఏర్పాటు చేశారనే మాట వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెసులో రగిలిన చిచ్చుకు హరీష్ రావు కారణమనే మాట రేవంత్ రెడ్డి వర్గం నుంచి వినిపిస్తోంది. 

తమ పార్టీ నాయకులతో టీఆర్ఎస్ నాయకులకు ఏ పని ఉందని ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావును విహెచ్ కలవడం వెనక మతలబు ఏమిటని, అసలు ఆ భేటీ ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఉంటే ప్రశ్నించాలి గానీ ప్రత్యర్థివద్ద మోకరల్లిడం సరి కాదని అంటున్నారు. పిసీసీ కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత కాంగ్రెసుపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, దాంతో టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని, సర్వేలు కాంగ్రెసుకు అనుకూలంగా వస్తున్నాయని, దీంతో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెసులో చిచ్చుపెడుతున్నారని రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుడు అన్నారు. హరీష్ రావు కాంగ్రెసులోని రేవంత్ రెడ్డి వ్యతిరేకులను రెచ్చగొడుతున్నారనే మాట వినిపిస్తోంది. 

Latest Videos

undefined

అయితే, విహెచ్ హరీష్ రావును కలవడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గీయులు సమర్థించుకుంటున్నారు. తన కూతురు సమస్యపై విహెచ్ హరీష్ రావును కలిశారని, అందులో తప్పేముందని సంగారెడ్డి కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గతంలో జగ్గారెడ్డి విషయంలో కూడా విహెచ్ మీద వచ్చినటువంటి విమర్శే వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. 

రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు నాయకులు ఆదివారంనాడు హైదరాబాదులోని అశోకా హోటల్ లో సమావేశమయ్యారు. సమావేశం వద్దకు వచ్చిన కాంగ్రెసు నాయకులు మనవతా రాయ్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ వచ్చారు. అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జగ్గారెడ్డి వారికి సూచించారు. దాంతో వారు ముగ్గురు కూడా వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారనే కారణంతోనే వారిని వెళ్లిపోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. 

అధిష్టానానికి తాము విధేయులమని చెబుతున్న సీనియర్లు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెబుతాననని, తనను సస్పెండ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని జగ్గారెడ్డి అన్నారు. అంతేకాదు, తీవ్రమైన హెచ్చరిక కూడా చేశారు. తనను సస్పెండ్ చేస్తే రోజుకొకరి బండారం బయటపెడుతానని ఆయన హెచ్చరించారు. 

తాను పార్టీకి రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించిన జగ్గారెడ్డి ఆ నిర్ణయం నుంచి వైదొలిగి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ కూడగడుతున్నారనే ప్రచారాం సాగుతోంది. ఈ వర్గంలోకి తాజాగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కూడా రావడం గమనార్హం.

click me!