దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు హ్యాట్స్ ఆప్ చెప్పారు. తెలంగాణ పోలీసులను అభినందించారు కూడా. జగన్ చర్య ఏ విధమైన సంకేతాలను ఇస్తుందనేది ప్రశ్న.
తెలంగాణ వెటర్నరీ డాక్టర్ దిశ రేప్, హత్య కేసు అత్యంత తీవ్రమైంది. సమాజాన్ని తీవ్రమైన అభద్రతా భావానికి, భయాందోళనలకు గురి చేసేది. ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెలను ఠారెత్తించేది. అంత దారుణమైన నేరం జరిగినప్పుడు అప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే స్పందన తీవ్రంగా ఉంటుంది. ఆవేశానిది, ఉద్వేగానిది పైచేయి అవుతుంది. నిందితులను కాల్చి పారేయాలని, పోలీసులకు చేత కాకపోతే తామే కాల్చి పారేస్తామని వంటి వ్యాఖ్యలు రావడం సహజం. దాన్ని తప్పుగా కూడా భావించలేం. సంఘటన అంత తీవ్రమైంది కాబట్టి అటువంటి తీవ్రమైన స్పందనను అర్థం చేసుకోవచ్చు.
దిశ కేసు నిందితులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఎన్ కౌంటర్ అనే పదానికి అర్థం తెలియంది కాదు. కానీ, దిశ కేసు నిందితుల సంఘటన తర్వాత ఎన్ కౌంటర్ అనే పదానికి కాల్చి పారేయడమనే అర్థం ధ్వనిస్తోంది. ఈ ధ్వని అత్యంత ప్రమాదకరమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ పోలీసులను అభినందించారు. జగన్ మాటల్లో కూడా పైన చెప్పిన ధ్వనే వ్యక్తమైంది.
undefined
వైఎస్ జగన్ మాటలను బట్టి చూస్తే ఆయనలో ముఖ్యమంత్రిపై ఆడపిల్లల తండ్రిది పైచేయి అయినట్లుగా అనిపిస్తోంది. సాధారణ ఆడపిల్లల తండ్రుల స్పందన అదే రీతిలో ఉంటుంది. ముఖ్యమంత్రిగా నిండు సభలో మాట్లాడే సమయంలో ఆయన సంయమనం కోల్పోకూడదు. ముందు వెనకల ఆలోచించాల్సి ఉంటుంది. ఎన్ కౌంటర్ పదానికి ధ్వనిస్తున్న అర్థాన్ని బట్టి అలా చెప్పాల్సి వస్తోంది.
Also Read: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్, ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ ప్రమాదకర అస్త్రాలు
మహిళల భద్రతకు కఠినమైన చట్టం తెస్తానని వైఎస్ జగన్ చెప్పారు. అది ఆహ్వానించదగిందే. గమనించాల్సింది ఏమిటంటే, దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత కూడా దేశంలో అటువంటి సంఘటనలు ఆగిపోలేదు. ఉన్నావో అత్యాచార బాధితురాలిపై జరిగిన దాడిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతెందుకు, తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్ లో గానీ ఆ తర్వాత అత్యాచారాలు ఆగిపోయాయా, అంటే లేదనే సమాధానమే వస్తుంది.
దిశ సంఘటనలో అందించిన తక్షణ న్యాయం వల్ల భయాందోళనలు చెలరేగి నేరాలు చేయడానికి వెనకాడుతారనే అభిప్రాయం సరైంది కాదనేది తేలిపోయింది.
మరో విషయం ఏమిటంటే, ప్రైవేట్ హింసను, ప్రభుత్వ హింసను ఒకే గాటన కట్టేయడాన్ని దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత చూస్తాం. హింసకు ప్రతిహింస అనే విధానాన్ని స్వయంగా రాజ్యమే ముందుకు తీసుకురావడాన్ని చూస్తాం. తక్షణ న్యాయం పేరుతో ప్రతీకార స్థాయికి ప్రతిహింసను తీసుకుని వెళ్లడం గమనించవచ్చు.
Also Read: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
హింసను అరికట్టాల్సింది ప్రభుత్వం. ఆ బాధ్యత నుంచి ప్రభుత్వ యంత్రాంగం పక్కకు జరిగి హింసకు ప్రతిహింస విధానాన్ని అమలు చేస్తే సంభవించే ప్రమాదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వంలోని అత్యంత ముఖ్యమైన పోలీసు యంత్రాంగం శాంతి భద్రతలను పరిరక్షించాలి, పౌరులకు భద్రత కల్పించాలి. తమ పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. కానీ, ఇక్కడ జరిగిందేమిటి?
ఒక ఆడపిల్లకు రక్షణ కల్పించలేదు. పైగా, ఆమెపైనే నిందలు వేసే వ్యాఖ్యలు కూడా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ నుంచి వచ్చాయి. సోదరికి కాకుండా దిశ 100కు ఫోన్ చేసి ఉంటే నేరం జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. ఆపత్సమయాల్లో చేయాల్సిన పనుల గురించి ప్రజలకు పోలీసులు లేదా ప్రభుత్వ యంత్రాంగాలు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
ఆ విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ జగన్ ప్రకటన మాత్రం అత్యంత ప్రమాదకరమైన సంకేతాలను అందిస్తోంది. పోలీసు యంత్రాంగానికి ఆ విధమైన స్వేచ్ఛను ప్రభుత్వాలు ఇస్తే సంభవించే ప్రమాదాలు ఎలా ఉంటాయనేది ఊహకు కూడా అందని విషయం.
- రాజేశ్వర్ రెడ్డి
(ఈ వ్యాసంలోని అభిప్రాయాలతో ఏషియానెట్ న్యూ తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. ఆ అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి)