ఏపీలో కరోనా విజృంభణ: కారణాలు ఇవేనా.....

By Sree S  |  First Published Apr 26, 2020, 4:46 PM IST

దేశంలో నిన్నటివరకు కరోనా కేసుల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ రికార్డును బద్దలుకొట్టింది. 1000 కేసుల రికార్డు స్థాయిని ధాటి తెలంగాణను వెనక్కు నెట్టింది. 


కరోనా వైరస్ మహమ్మరి పంజా నుండి తప్పించుకునేందుకు భారతదేశం లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఎంత లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కూడా కరోనా వైరస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 

దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే ఉంది. దేశంలో నిన్నటివరకు కరోనా కేసుల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ రికార్డును బద్దలుకొట్టింది. 1000 కేసుల రికార్డు స్థాయిని ధాటి తెలంగాణను వెనక్కు నెట్టింది. 

Latest Videos

undefined

ఈ వైరస్ తన పంజాను మొదలు పెట్టినప్పటి నుండే తెలంగాణాలో కేసుల విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కేసులు తెలంగాణ అంత తీవ్రస్థాయిలో నమోదు అవలేదు. కానీ రాను రాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోటీ పడుతూ తెలంగాణను వెనక్కి నెట్టేసింది. 

కేసుల సంఖ్య ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా కేసుల పెరుగుదలను కూడా దాదాపుగా అదుపులోకి తెచ్చినట్టుగా కనబడుతుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణాలో 15, 27, 13, 7 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్ లో గనుక చూసుకుంటే.... అక్కడ వరుసగా నాలుగు రోజుల నుంచి 50 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. 

అయితే ఇక్కడొక వాదన ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కొరియన్ టెస్టు కిట్లు వచ్చిన దగ్గరి నుండి టెస్టులు విపరీతంగా చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తెలంగాణ కన్నా 4.5 రెట్లు అధిక టెస్టులను నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్.

ఇలా అధిక టెస్టులను నిర్వహించడం వల్ల సహజంగానే ఎక్కువ కేసులు బయటపడే ఆస్కారం ఉంది అది నిజం కూడా. (టెస్టులు అసలు నిర్వహించకుండా మాదగ్గర అసలు కరోనా వైరస్ లేనే లేదు అని చెప్పిన దేశాధ్యక్షుడి ఉదంతం కూడా లేకపోలేదు.)

అయితే ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న టెస్టుల్లో కొన్ని యాంటీబాడీ టెస్టులు కూడా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ యాంటీబాడీ టెస్టులు కరోనా ను గుర్తించడంలో అంత సమర్థవంతంగా పనిచేయలేవు. 

ఈ ఆరోపణలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వీటిని కొట్టి పారేయకపోవడంతో ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. మరోపక్క తెలంగాణ విషయానికి వస్తే.... వారు ఇలా రాపిడ్ టెస్టులను కాకుండా కేవలం పీసీఆర్ టెస్టులను మాత్రమే చేస్తున్నారు. 

ఇలా పీసీఆర్ టెస్టులు మాత్రమే చేస్తూ... ల్యాబుల మీద బర్డెన్ పడకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి గనుక చూసుకుంటే... తెలంగాణాలో సాధ్యమైనంత మందిని క్వారంటైన్ లలో ఉంచి వారిని బయటకు రాకుండా చూస్తూ ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. 

తెలంగాణాలో లాక్ డౌన్ ను కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. గ్రామం నుంచి మొదలు నగరాల వరకు చాలా కట్టుదిట్టంగా ప్రజలందరినీ ఇండ్లలోంచి బయటకు రానీయకుండా, కేవలం అధికారులు మాత్రమే ఫీల్డ్ మీద కనబడుతూ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. 

ఒక్కసారి సూర్యాపేటలో కేసులు పెరిగాయి అని అనుకోగానే పట్టణాన్ని మొత్తం ఆధీనంలోకి తీసుకొని పరిస్థితిని వారం రోజుల్లో అదుపులోకి తీసుకురాగలిగారు. గత రెండు రోజులుగా సూర్యాపేటలో జీరో కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ లో కరోనా కట్టడిని అయితే... ఏకంగా బిల్వారాతో పోలుస్తున్నారు. కరీంనగర్ ను తెలంగాణ బిల్వారా అంటున్నారు. 

అదే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే... ఇంకా కర్నూల్, గుంటూరు జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు కరోనా ఫ్రీ గా ఉన్న శ్రీకాకుళంలోకి కూడా కరోనా ప్రవేశించింది. 

ఈ కరోనా కేసులు ఇలా రోజు రోజుకి పెరుగుతూ ఉన్న అక్కడ రాజకీయ నాయకులూ మాత్రం ఇంకా రాజకీయాలనే చేస్తున్నారు తప్ప అందరూ పార్టీలకతీతంగా ఒక్కటై ఈ కరోనాపై మాత్రం పోరాడడం లేదు. 

ఇక అధికార పక్షం నాయకులు ట్రాక్టర్ ర్యాలీల నుంచి మొదలు పూలు చెల్లించుకోవడం వరకు రకరకాల పద్ధతుల్లో ప్రజలందరినీ ఈ కరోనా వైరస్ విజృంబిస్తున్నవేళ ఒక్కచోటికి చేరుస్తున్నారు. 

అంతే కాకుండా, కరోనా వైరస్ అవగాహన సదస్సులంటూ ఊర్లలో సమావేశాలు, సదస్సులు పెట్టి ప్రజలను టెంట్లు వేసి మరి అక్కడ గుమికూడేలా చేస్తున్నారు.మామూలుగా మందులు తీసుకురావడానికి బైటికి వెళ్లిన ఒక యువకుడు పోలీసులు లాక్ డౌన్ ఉల్లంఘించాడని చావబాదారు. 

ఇలా సామాన్యులు లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తుంటే ప్రాణాలు తీస్తారు, ప్రజా ప్రతినిధులకు మాత్రం ఆ రూల్స్ ఏవి వర్తించవన్నట్టు ప్రవర్తిస్తూ ప్రజల ప్రాణాలను రిస్కులో పెడుతున్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదంతం నుంచి మొదలు హై కోర్టు తీర్పు ను బైపాస్ చేయడానికి కొత్త రంగుల రాజకీయం ముందుకు తేవడం వరకు వారి మేధస్సునంతా  వాటిపైన్నే కేంద్రీకరిస్తునారు. 

ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించేందుకు ఎలా ఏర్పాట్లు చేద్దామా అని ఆలోచిస్తున్నారన్న వార్తలు మీడియాలో కనబడుతున్నాయి తప్ప, ఈ కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారో మాత్రం బయటకు కనబడడం లేదు. తెలంగాణ చేసినట్టుగా ప్రత్యేక ధికారులు నియామకం, ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం కనబడడం లేదు. 

click me!