కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించడం లేదు.
కరోనా కట్టడి సందర్భంలో మన జీవన చక్రం నిరాటంకంగా సాగిపోతోందీ అంటే అందుకు కనిపించని విద్యుత్తే సహకారి. కానీ, చప్పట్లు కొట్టి అభినందించే విషయంలో ఆ సిబ్బంది జాడ లేకపోవడం విచిత్రమే.
undefined
-కందుకూర్ రమేష్ బాబు
ఇటీవల ఒక ఆర్టిస్టు చక్కటి బొమ్మ వేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న మూడు సిబ్బందులను మూడు సింహాలుగా వేశారు. వైద్య సిబ్బంది, పోలీసు వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులను భారతీయ జాతీయ చిహ్నమైన మూడు సింహాల మాదిరిగా చిత్రించారాయన. నేటి అత్యయిక పరిస్థితుల్లో వ్యవస్థను కాపాడుతున్న వీరులుగా వారిని ఆ రాజముద్రతో అపూర్వంగా కొనియాడటం విశేషం. ఐతే, ఆ మూడు అత్యవసర సర్వీసుల మాదిరే కనిపించని మరో సింహం, విద్యుత్ వ్యవస్థ అని చెప్పక తప్పదు. వారికి ఈ సందర్భంగా తగిన గుర్తింపు, అభినందన లభించవలసే ఉన్నది.
నిజానికి విద్యుత్ సిబ్బంది తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ ఇంటికే దిగ్భంధనమైన యావత్ సమాజానికి దీపంలా నిలబడ్డారు. వారిని ‘కనిపించని నాలుగో సింహం’గా అభివర్ణిస్తూ నాలుగు మాటలు రాసి అభినందించడం కనీస మర్యాద, ధర్మం.
నిజంగా ఇది ఒక గడ్డు కాలం. కనిపించని వైరస్ తో నిస్సహాయంగా పోరాడుతున్నం. పూర్తిగా ఇంటిపట్టునే ఉండటమే మేలైన నివారణా చర్యగా భావిస్తున్నాం. ఇటువంటి సమయంలో మన జీవన చక్రం నిరాటంకంగా సాగిపోతోందీ అంటే అందుకు కనిపించని విద్యుత్తే సహకారి. కానీ, చప్పట్లు కొట్టి అభినందించే విషయంలో వైరల్ ఐన వీడియాల్లో ఆ సిబ్బంది జాడ లేకపోవడం విచిత్రమే.
ప్రతిదానికీ హైప్ ఉంటుంది. మొత్తం వైద్య సిబ్బంది అంతా కరోనా వైరస్ చికిత్సలో విషయంలో నిమగ్నమై లేరు. కానీ, ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరికీ జేజేలు తెలపడం ఎందుకూ అంటే సమయం, సందర్భం కనుక. ఆ మేరకు ఇది విద్యుత్ సిబ్బందిని జ్ఞాపక పెట్టుకోదగిన సందర్భం కూడా.
కాకపోతే, నేటి విపత్కర సమయంలో విద్యుత్ సిబ్బంది ప్రాణాలను తెగించి పని చేయడం లేదన్న ఒక్క కారణంగా వారు పైన పేర్కొన్న మూడు సిబ్బందుల మాదిరి అభినందనలు అందుకోలేక పోతున్నారు. కానీ ఆపరేషనల్ సిబ్బంది సాధారణంగానే నిత్య విపత్తుల మధ్య పనిచేస్తారని గ్రహించాలి. కరంటు తీగలు ఎప్పుడు వారి ప్రాణాలను హరిస్తాయో చెప్పలేం. దానికి తోడు నిర్ణీత వేళలు అంటూ వారికి ఉండవు. ఎండనకా వాననకా ఎప్పుడు బ్రేక్ డౌన్ అయితే అప్పుడు తక్షణం భార్యా పిల్లలను కాదని పని మీదకు వెళ్ళవలసే ఉంది. వెళుతున్నారు కూడా. సమస్య రాగానే వెంటనే పరిష్కరిస్తున్నారు కూడా.
అంతేకాదు, నిన్న మొన్నటి దాకా పంట చేతికి వచ్చే సమయంలో వారు కరోనా వైరస్ అని ఆగిపోకుండా రైతులకు విద్యుత్ సరఫరా విషయంలో ఎంతో సహకరించారు. చాలా మంది రైతులు ఆన్ లైన్ బిల్లులు చెల్లించలేని స్థితిలో వారిచేత స్వయంగా బిల్లులు కట్టించుకొని, కరంటు సరఫరా ఆగకుండా చూశారు. అంతేకాదు, కరోనా కట్టడి నేపథ్యంలో గ్రామపు పోలిమెరల్లో అడ్డుగా వేసిన కంచెలను దాటి వేరే మార్గంలో వెళ్ళే క్రమంలో గుంతలో పడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక లైన్ మెన్ మరణించారు. ఇలాంటి దుర్ఘటనలు కూడా ఇక్కడ ప్రస్తావించుకోక తప్పదు. ఇలాంటి త్యాగాల లెక్క ఇప్పుడు చెప్పుకోదగిందే.
కరంటు వల్లే సజావుగా జీవనం
మనకు తెలుసు. ప్రతిదీ కరంటుతోనే నడుస్తోంది. ఫోన్ చార్జ్ కావాలన్న కరంటు కావాలి. ప్యాన్ లేదా ఏసీ నడవాలన్నా కరంటు కావాలి. సామాజిక దూరం పాటించే క్రమంలో వాడకట్టులో ఉన్నవారి నుంచి దేశవిదేశాల్లో ఉన్న వారిదాకా మన కమ్యూనికేషన్ అంతా కూడా కరంటు సౌకర్యం తోనే కదా. ఇంటర్నెట్ తోనే కదా మొత్తం ప్రపంచం అనుసంధానించబడి ఉన్నది. అటువంటి సౌకర్యానికి కనిపించని ఆత్మ విద్యుత్ సిబ్బందే.
ఇంటి నుంచే పని చేసుకుంటున్నాం అంటే కరంటే. కాలక్షేపానికీ కరంటే. ఉన్న చోటు నుంచి కదలకుండానే గంటలకు గంటలు టీవీ పెట్టుకొని వినోదం పొందుతున్నాం అంటే దాని వల్లే. బయటకు తరచూ పోకూడదు కనుక, వారానికి సరిపడే కూరగాయలను ఫ్రిడ్జ్ లో భద్రపర్చుకుంటున్నాం అంటే కరంటే. బయటకు వెళ్లి వస్తే దుస్తులన్నీ ఉతకాలంటే కరంటు తో నడిచే వాషింగ్ మిషనే నాయె! ఒక్క మాటలో చెప్పాలంటే, కరోనా విపత్తు సమయంలో కరంటు మన జీవనానికి ప్రధాన ఇంధనం. కరంటు సమస్యగా లేకపోవడం వల్లే మనం ఈ నిర్భంధ కాలాన్ని ఎటువంటి అభద్రతకులోను కాకుండా గడిపేస్తున్నాం. పెద్దగా డిప్రెషన్ కు గురికాకుండా కరోనా విపత్తు కాలాన్ని శక్తిమేరకు ఎదుర్కొంటున్నాం. కానీ ఆ విద్యుత్తు సరఫరాకు కారణమైన సిబ్బందిని మరచిపోయాం.
కనిపించని సింహం – కేసీఆర్
నిజానికి కరోనా కట్టడితో ఇంటి పట్టునే ఉంటున్న సమస్త తెలంగాణ ప్రజానీకం ప్రస్తుతం నేడు ఇద్దరికీ ప్రత్యేక వందనాలు చెప్పుకోవాలి. ఒకటి, సకల జీవన వ్యాపారాలూ కరంటు కారణంగా యధావిధిగా సాగిపోతున్న సందర్భంలో అందుకు కారణమైన విద్యుత్ సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్పుకోవాలి. అలాగే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవగానే ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోక, ఎంతో ముందుచూపుతో 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంలో మనసారా అభివాదాలు తెల్పుకోవాలి.
ముఖ్యమంత్రి సాహోసేపేతంగా లక్షలాది కిలోమీటర్ల కొత్త లైన్లు వేయించడం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకోవడం, 24 గంటల విద్యుత్ ఇవ్వదానికి ముందుకు రావడం, వీటన్నిటి మూలాన నేడు మనం కరంటు కొత లేకుండా హాయిగా విద్యుత్ సౌకర్యాన్ని పొందగలుగుతున్నాం.
స్వరాష్ట్రం తెచ్చుకుని బతికిపోయాం
అన్నిటికీ మించి, అదృష్టవశాత్తూ మనం ఒకనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం పెద్ద రిలీఫ్. అదే పరిస్థితి గనుక నేడు కొనసాగి ఉంటే మనకు కరోనాతో పాటు మలేరియా కూడా వచ్చి ఉండేదని నల్లగొండకు చెందిన లైన్ ఇన్స్ పెక్టర్ కరంట్ రావు అనడంలో అతిశయోక్తి లేదు.
“కరంటు కోతల కారణంగా తరచూ భయటకు వెళ్ళవలసి వచ్చేది. అది కరోనా వ్యాప్తికి దారి తీసేది. అలాగే రాత్రుళ్ళు కరంటు కొత విధించే పరిస్థితి తప్పేది కాదు. కనుక దోమలతో మలేరియా వచ్చే అవకాశమూ ఉండేది” అన్నారు. “ముఖ్యమంత్రి దూర దృష్టి వల్ల నేడు నిచ్చింతగా బతుకుతున్నాం. కరోనా కాలాన్ని ఇంటి పట్టున సునాయాసంగా వెల్లదీస్తున్నాం” అంటూ, కేసిఆర్ గారికి అయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రభాకర్ రావు గారికి కృషి ప్రత్యేకం
ట్రాన్స్కో అండ్ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర రావు గారిని కూడా విద్యుత్ సిబ్బంది కొనియాడుతున్నారు. ఈ వయస్సులో కూడా అయన కార్యాలయానికి వచ్చి ఉత్తేజ పర్చడంతో సిబ్బంది చురుగ్గా పనిచేస్తున్నారని విధ్యుత్ సౌధలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సుమ అన్నారు. “మాకు ఆయన గొప్ప స్ఫూర్తి. అత్యవసర సిబ్బందిలో మేం కూడా ఒకరం అన్న భావన కల్గించారు. మాకు ప్రజల నుంచి అభినందనలు దక్కకపోయినా ఇటువంటి క్లిష్ట కాలంలో మా బాధ్యత మేం నిర్వహిస్తున్నాం అన్న తృప్తి ఉంది” అన్నారావిడ.
“ప్రభాకర్ రావు గారి ప్రణాళికలు, ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, ఈ రెండూ జమిలిగా మన రాష్ట్ర విధ్యుత్ వ్యవస్థను బలోపేతం చేశాయి. అపూర్వంగా నిలిపాయి” అని భువనగిరికి చెందిన రెవెన్యూ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ బి.శ్రీనివాస రావు అభిప్రాయ పడ్డారు.
“ముఖ్యమంత్రి గారు ఎంతో లోతుగా పలు సంస్కరణలు అమలు చేశారు. నూతన వ్యవస్థను నిర్మించారు. ధర్మల్, హైడల్, సోలార్ ఎనర్జీలు. ఈ మూడూ ఇప్పుడు మన జీవశక్తికి ప్రాణం పోస్తున్న ఇంధనాలు. కరోనా సమయంలో ఇంటిపట్టునే మనం జీవితాలు సాఫీగా సాగుతున్నాయి అంటే ముఖ్యమంత్రి సమర్థంగా ఈ మూడు రంగాలను బలోపేతం చేసినందువల్లే” అని అభినందించారు.
విద్యుత్ ఉద్యోగుల కృతజ్ఞత
మెదక్ జిల్లా రామాయం పెట్ కు చెందిన ఆర్టిసన్ వడ్ల తిరుపతి మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యంగా నాలుగో తరగతి సిబ్బందికి జీతాల్లో కొత విధించడాన్ని పునస్సమీక్షించి నందుకు కింది స్థాయి ఉద్యోగుల తరపున ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
“రైతుల పంట చేతికి వచ్చే కీలక సమయంలో మేం అప్రమత్తంగా వ్యవహరించాం. కరోనాకు బయపడకుండా విద్యుత్ సరఫరా నిరాటంకంగా అందేలా చూశాం. మొదట్లో పోలీసుల జులుంను కూడా ఎదుర్కొంటూ మేం విధులను నిర్వహించాం. రైతులు ఆన్ లైన్ బిల్లులు కట్టకపోయినా కరంటు నిలిపివేయలేదు. స్వయంగా వెళ్లి ఆ బిల్లులు కట్టించుకున్నాం. వారికి ఎంతో సహకరిస్తున్నాం. ఇంత చేసిన మాకు మొదటి నెలలో జీతాల్లో కొత్త విధించారు. అదృష్టవశాత్తూ ఆపరేషనల్ అండ్ మెంటనేన్సీ సిబ్బంది జీతాల కోతను మినహాయించి మాకు కాస్త ఉపశమనం కలిగించారు. ఎంతైనా ముందు చూపు కొనియాడతగ్గది” అన్నారు.
నిజమే. కరోనా సమయంలో కేసీఆర్ దార్శానికత తెలియవస్తోంది. విధ్యుత్ విషయంలో అయన స్వరాష్ట్రాని వేలుగుల్లోకి తీసుకెళ్లడం చాలా మేలైంది. లేకపోతే ఈ కరోనా కట్టడిలో ఇంటిపట్టున బ్రతుకు క్షణమొక యుగంలా గడిచేది అనడంలో అతిశయోక్తి లేదు.
చివరగా, తెలంగాణ సమాజంగా- కనిపించని నాలుగో సింహానికి అభినందనలు. విద్యుత్ సిబ్బంది అజేయ శక్తికి, పవర్ ని పునర్నిర్వచించి, స్వరాష్ట్రాన్ని వెలుగు జిలుగుల్లో నింపిన ముఖ్యమంత్రికీ, ఇద్దరికీ కరోనా సందర్భంలో ప్రత్యేక అభినందనలు.
( వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్ట్)