రిషబ్ పంత్ కు ఇంకా పరీక్షా కాలమే.. నెగ్గుకొస్తాడా...

By telugu team  |  First Published Dec 17, 2019, 1:41 PM IST

రిషబ్‌ పంత్‌ ప్రతి విషయంలోనూ వార్తాంశం అయ్యాడు. సెలక్షన్‌ కమిటీ విస్మరించగానే.. ఎందుకు యువ ఆటగాడిపై వివక్ష అంటూ ఓ చర్చ. తుది జట్టులో చోటు దక్కకపోతే.. ప్రతిభావంతుడిని పెవిలియన్‌లో పెట్టుకుని ఏం చేస్తారు అనే చర్చ. బరిలోకి దింపితే ఇంత నిర్లక్ష్యంగా ఆడుతున్న ఇతడికి ఎందుకిన్ని అవకాశాలు అనే చర్చ ఏది ఏమైనా నిత్యం వార్తల్లోని వ్యక్తిగా మాత్రం రిషబ్ పంత్ నిలుస్తున్నాడు. 


  ఇటీవల కాలంలో భారత క్రికెట్‌లో చర్చనీయాంశం అయిన ఆటగాళ్లు ఇద్దరు. ఇద్దరు కూడా వికెట్ కీపేర్లే కావడం గమనార్హం. ఒకరు రాబోయే కాలంలో కాబోయే మాజీ కాగా...ఇంకొకరు ఆ కాబోయే మాజీకి రాబోయే వారసుడు. 

 

Latest Videos

undefined

వరల్డ్‌కప్‌ తర్వాత వీడ్కోలు తీసుకుంటాడా లేదా అని ఎం.ఎస్‌ ధోనిపై ఇప్పటికీ చర్చ నడుస్తోంది. ధోని వారసుడిగా సీనియర్‌ జట్టులో సత్తా చాటగలడా లేదా అనే చర్చ రిషబ్‌ పంత్‌ను నిత్యం వార్తల్లో నిలుపుతోంది. 

 

కొంతకాలం రిషబ్‌ పంత్‌ ప్రతి విషయంలోనూ వార్తాంశం అయ్యాడు. సెలక్షన్‌ కమిటీ విస్మరించగానే.. ఎందుకు యువ ఆటగాడిపై వివక్ష అంటూ ఓ చర్చ. తుది జట్టులో చోటు దక్కకపోతే.. ప్రతిభావంతుడిని పెవిలియన్‌లో పెట్టుకుని ఏం చేస్తారు అనే చర్చ. బరిలోకి దింపితే ఇంత నిర్లక్ష్యంగా ఆడుతున్న ఇతడికి ఎందుకిన్ని అవకాశాలు అనే చర్చ ఏది ఏమైనా నిత్యం వార్తల్లోని వ్యక్తిగా మాత్రం రిషబ్ పంత్ నిలుస్తున్నాడు. 

 

టెస్టుల్లో విదేశీ గడ్డపై (ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా) రెండు సెంచరీలతో అరుదైన ఘనత సాధించిన రిషబ్‌ పంత్‌ ఎట్టకేలకు వన్డేల్లోనూ ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. చెపాక్‌లో వెస్టిండీస్‌పై రిషబ్‌ పంత్‌ ప్రదర్శన అతడిపై ఒత్తిడికి తాత్కాలికంగా చెక్‌ పెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

Also read; IND vs WI : రేపే వైజాగ్ వన్డే... గెలిచేదెవరంటే!

'నిత్యం రిషబ్‌ పంత్‌ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అందుకు కారణం పంత్‌ అసాధారణ ప్రతిభతో కూడిన క్రికెటర్‌. రిషబ్‌ పంత్‌ సామర్థ్యంపై జట్టు మేనేజ్‌మెంట్‌కు పూర్తి విశ్వాసం ఉంది. ఏ జట్టుకైనా ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా నిలువగల సత్తా పంత్‌ సొంతం. ఒక్కసారి పంత్‌ పరుగుల ప్రవాహం మొదలెడితే.. మైదానంలో మెగా ఆటగాడు కాగలడు'....వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. 

బ్యాటింగ్‌ కోచ్‌గా తొలి మీడియా సమావేశంలోనే రిషబ్‌ పంత్‌పై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విక్రమ్‌.. తాజాగా పంత్‌పై తన వైఖరిని మార్చుకున్నాడు. చెన్నై చెపాక్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ రిషబ్‌ పంత్‌తో కలిసి విక్రమ్‌ రాథోడ్ ప్రత్యేక సాధనకు కూడా వచ్చాడు. 

టీ20 సిరీస్‌ సమయంలోనూ రిషబ్‌ పంత్‌ను నెట్స్‌లో దగ్గరుండి పర్యవేక్షించాడు. షాట్ల ఎంపిక, ఊరించే బంతులపై నిగ్రహం వంటి అంశాలను పంత్‌కు దగ్గరుండి సలహాలు, సూచనలు చేయటం కనిపించింది. అభిమానులు, క్రికెట్‌ పండితులు, విమర్శకులు అందరూ తన ప్రదర్శనపై కన్నేసి ఉంచిన వేళ దిగ్గజ ధోని ఐపీఎల్‌ సొంత మైదానంలో రిషబ్‌ పంత్‌ చెలరేగాడు. 71 పరుగుల ఇన్నింగ్స్‌తో వన్డేల్లో ఎట్టకేలకు తొలి అర్థ సెంచరీ నమోదు చేశాడు.

కలిసొచ్చిన ఎడమచేతివాటం... 

రిషబ్‌పంత్‌ వన్డే అరం గ్రేటం ఆలస్యంగానే జరిగింది!. 2018లో వెస్టిండీస్‌తో సిరీస్‌ లోనే పంత్‌ వన్డేల్లో అడుగుపెట్టాడు. గౌహతి వన్డేలో పంత్‌ కెరీర్‌ ప్రారంభమైనా.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కలేదు. వెస్టిండీస్‌తో తర్వాతి మ్యాచ్‌లో విశాఖ పట్నంలో పంత్‌ తొలిసారి వన్డేల్లో బ్యాట్‌ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 13 బంతులు ఆడిన పంత్‌ రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. 

విండీస్‌తోనే పుణేలో జరిగిన మూడో మ్యాచ్‌లో 18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసాడు. తర్వాత జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో వరుసగా 36, 16 పరుగులు చేశాడు. అవకాశం దక్కిన మ్యాచుల్లో రాణించలేదు. 

Also read: ధోనీ.. ధోనీ.. అంటూ ప్రేక్షకుల హేళన: ప్రతిస్పందించిన రిషబ్ పంత్

దీంతో ప్రపంచకప్‌ జట్టులో దినేశ్‌ కార్తీక్‌కు పంత్‌ తన స్థానాన్ని కోల్పోయాడు. శిఖర్‌ ధావన్‌కు గాయంతో అందుబాటులో లేకపోవడంతో ఎడం చేతి టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అవసరమని జట్టు మేనేజ్‌మెంట్‌ భావించింది. 

సీనియర్‌ ఆటగాడి గాయం రిషబ్‌ పంత్‌కు తొలి ప్రపంచకప్‌ అవకాశాన్ని అందించింది. ప్రపంచకప్‌లోనూ పంత్‌ పెవిలియన్‌కు పరిమితం అయిన మ్యాచుల్లో అందరి కండ్లూ అతడిపైనే! 

ఇంగ్లాండ్‌పై 32, బంగ్లాదేశ్‌పై 48, శ్రీలంకపై 4 పరుగులు చేసిన పంత్‌ సెమీఫైనల్లో గొప్పగా కనిపించాడు. బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడుతున్న పిచ్‌పై స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించాడు. అనుభవ లేమి, ఇంకో ఎండ్‌లో అనుభవం అంతగా లేని, మార్గ నిర్దేశం చేసే అనుభవం లేని మరో యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్య ఉండడంతో, రిషబ్‌ పంత్‌ దూకుడుగా ఆడేలా పరిస్థితులు ప్రభావితం చేసాయి. 

ఫలితంగా స్పిన్నర్‌పై భారీ షాట్‌కు వెళ్లిన రిషబ్‌ పంత్‌ క్యాచౌట్‌ అయ్యాడు. రిషబ్‌ పంత్‌ సహనంతో కూడిన ఇన్నింగ్స్‌ ఆడి ఉంటే మాంచెస్టర్‌ సెమీఫైనల్స్‌ ఫలితం కచ్చితంగా భిన్నంగా ఉండేదని జట్టు మేనేజ్‌మెంట్‌ ఇప్పటికీ బలంగా నమ్ముతోంది. 

ఆ తర్వాత జరిగిన విండీస్ పర్యటనలోనూ రిషబ్‌ పంత్‌ మెరువలేదు. 20, 0 పరుగులతో నిరాశ పరిచాడు. దీంతో ఒక్కసారిగా రిషబ్‌ పంత్‌పై ఒత్తిడి పెరిగింది. జట్టు మేనేజ్‌మెంట్‌లో తొలిసారి రోహిత్‌ శర్మ నుంచి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పంత్‌కు గొప్ప మద్దతు లభించింది. రోహిత్‌ బాటలోనే విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రి, విక్రమ్‌ రాథోడ్ లు పంత్‌కు బాసటగా నిలిచి అతడిలో ధైర్యం నూరిపోశారు.

ఇన్ని విమర్శలు, కొండంత ఒత్తిడి నడుమ రిషబ్‌ పంత్‌ వెస్టిండీస్‌ సిరీస్‌ను మొదలెట్టాడు. చెన్నై చెపాక్‌ వన్డేలో రిషబ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు వచ్చే సరికి మరోసారి ప్రతికూల పరిస్థితులు. పంత్ ఆటా తీరుకు భిన్నంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు.  

టాప్‌ ఆర్డర్‌ మంచి పునాది వేసి, ఇక దంచుడే అని పిలుపు అందిస్తే వెళ్లటం సిక్సర్ల వర్షం కురిపించటంలో పంత్‌ది అందెవేసిన చేయి. కానీ ఆరంభంలోనే రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి పెవిలియన్‌కు చేరుకున్నారు. 

Also read: రిషబ్ పంత్ మారడు: అదే షాట్, అదే ఔట్

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీల్ సహచరుడు శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించాల్సిన బాధ్యత పంత్‌పై పడింది. శ్రేయస్ అయ్యర్‌కు ఇటువంటి ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటైన పని. కానీ పంత్‌ కు మాత్రం ఇది పూర్తిగా కొత్త పరిస్థితి. 

విపత్కర పరిస్థితుల్లో ఆరంభంలోనే దూకుడుగా ఆడకుండా పంత్‌ తనను తాను నిగ్రహించుకున్నాడు. 69 బంతుల్లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 71 పరుగులు సాధించాడు. 102.89 స్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌ భారత్‌ను గట్టెక్కించినట్టే కనిపించాడు. 

బౌలర్ల అండ కూడా తోడైతే చెపాక్‌లో రిషబ్‌ పంత్‌ ఇన్నింగ్స్‌కు ఓ కళ వచ్చేది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌ కీపర్‌గా అంచనాలు అందుకోవటంలో విఫలమైన రిషబ్‌ పంత్‌ చెన్నైలో చెలరేగాడు. చెపాక్‌ ఇన్నింగ్స్‌ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో బుధవారం విశాఖలోనూ పంత్‌ విశ్వరూపం కొనసాగిస్తాడని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.

ఇక పంత్ ఒక మారిన క్రికెటర్ గా పూర్తిగా రూపాంతరం చెందబోతున్నాడని ప్రపంచానికి వినిపించేలా మ్యాచ్ ముగిసిన తరువాత అతగాడు మాట్లాడాడు. సహజసిద్ధమైన ఆట అనే అంశంపై స్పందించాడు.  

అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ ఆడుతున్నప్పటి నుంచి తానో విషయం తెలుసుకున్నానని, అసలు సహజ శైలి ఆట అంటూ ఒకటి లేదనే విషయం అర్థమైందని పంత్ అన్నాడు. అంతా పరిస్థితులకు తగినట్టు ఆడటమే, జట్టు అవసరాల మేరకు బ్యాటింగ్‌ చేయటమే అనే విషయం తాను తెలుసుకున్నానని అన్నాడు పంత్.  

click me!