సోము వీర్రాజు వ్యాఖ్యలు: చంద్రబాబుతో బిజెపి నెయ్యం, వైఎస్ జగన్ కు చెక్

By Pratap Reddy Kasula  |  First Published Aug 6, 2022, 11:49 AM IST

టీడీపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ ను తీవ్రంగా తప్పు పట్టారు. దీన్ని బట్టి బిజెపి టీడిపీకి దగ్గరవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు బిజెపి సిద్ధమవుతోందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అందుకు తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబుతో తిరిగి స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలని చూస్తోందా అనే మరో ప్రశ్న ముందకు వస్తోంది. బిజెపి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలు చూస్తుంటే ఆ రెండు ప్రశ్నలకు కూడా అవుననే సమాధానమే వస్తోంది. చంద్రబాబును ప్రశంసిస్తూ వైఎస్ జగన్ ను విమర్శిస్తూ సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును దార్శనికుడిగా కూడా ఆయన అభివర్ణించారు. ఇదే సమయంలో ఆజాదీ అమ్రుత్ మహోత్సవ సమావేశానికి చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. 

చంద్రబాబు దార్శనికుడు కాబట్టే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.8,500 కోట్ల నిధులు ఇవ్వడానికి సిద్ధపడిందని సోము వీర్రాజు అన్నారు. జగన్ దార్శకుడు కాదు కాబట్టే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే జగన్ నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. మూడు రాజధానులంటూ జగన్ మూడు రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. భూములను ఆక్రమించుకునే ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని కూడా విమర్శించారు. చివరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వ తీరుపై ఇంకా ఆయన పలు విమర్శలు చేశారు. 

Latest Videos

undefined

పోలవరంపై కూడా బిజెపి నాయకులు జగన్ ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టును కట్టలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కేంద్రమే నిర్మిస్తుందని కూడా సోము వీర్రాజు అన్నారు.  అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు వెనుకేసుకోవడానికే వైసిపి నేతలు చూస్తున్నారని ఆయన అన్నారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలను గమనిస్తే బిజెపి టిడిపికి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మోడీపై, బిజెపి కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కూడా జత కట్టారు. కాంగ్రెస్ నేతలతోనూ ఇతర ప్రతిపక్షాల నేతలతోనూ వేదికలు పంచుకున్నారు. అయితే, ఏపిలోని రాజకీయ అవసరాల కోసం తిరిగి చంద్రబాబును చేరదీస్తున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు కూడా బిజెపితో జత కట్టడానికే ఇష్టపడుతున్నారు.

పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన, బిజెపి పొత్తులో ఉన్నాయి. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ను ఓడించడానికి తమ బలం సరిపోదని కూటమి అభిప్రాయపడుతుండవచ్చు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. జగన్ ను ఓడించడానికి ప్రతిపక్షాల ఓట్లు చీలికుండా చూడాలని ఆయన అభిప్రాయపడున్నారు. ఇటీవలి వరకు బిజెపి టిడిపికి దూరంగా ఉంటూ వస్తోంది. వైసిపి, టిడిపి రెంటికీ సమదూరం పాటించాలని బిజెపి అభిప్రాయపడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం తన వైఖరిని ఆ పార్టీ మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

జగన్ మాత్రం బిజెపితో సఖ్యతతో మెలగాలని చూస్తున్నారు. కేంద్రంలో మోడి ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. దాంతో ఇప్పటికిప్పుడు జగన్ తో బిజెపి జాతీయ నాయకత్వం కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా లేదని అనుకోవచ్చు. అయితే ఎన్నికల నాటికి పరిస్థితులు మారవచ్చు. జగన్ నాయకత్వంలోని వైసిపి వ్యతిరేకంగా బిజెపి, జనసేన, టీడిపి కూటమి కట్టి ఎన్నికల బరిలోకి దిగడానికి వీలుంటుందని భావించవచ్చు.

click me!