రేవంత్ రెడ్డి వ్యూహం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుండు మీద కారం

By Pratap Reddy Kasula  |  First Published Aug 5, 2022, 1:29 PM IST

రేవంత్ రెడ్డి చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుండు మీద కారం చల్లినట్లయింది. వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాక పుట్టించినట్లు తెలుస్తోంది.


హైదరాబాద్: తెలంగాణ పిసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన పనికి భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పుండు మీద కారం చల్లినట్లయింది. తాను చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వర్తించవని, తాను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని అవమానించారని, అందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీనికి వివరణ ఇచ్చినట్లు కనిపిస్తూనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఎసరు పెట్టారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కావడాన్ని ఇష్టపడడం లేదు. తమ అయిష్టతను వారు వివిధ రకాలుగా వ్యక్తపరుస్తూ వచ్చారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా పార్టీ నుంచి పంపించడానికి చెరుకు సుధాకర్ ను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమంయలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయంతో ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావించారని, అందుకే చెరుకు సుధాకర్ ను వెంటనే చేర్చుకున్నారని కూడా అంటున్నారు.

Latest Videos

undefined

కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనను ఓడించడానికి ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి, బిజెపి నేత అమిత్ షాను త్వరలో కలుస్తున్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచీ తనను వ్యతిరేకిస్తుండడంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు భావించవచ్చు. పార్టీలో కొంత మంది సీనియర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఆయనను పిసిసి అధ్యక్షుడిగా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో రేవంత్ రెడ్డి వారితో సయోధ్యకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా వారు నిర్ణయం తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి పావులు కదిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడిన వెంటనే రేవంత్ రెడ్డి వెంకట్ రెడ్డికి కూడా ఎసరు పెట్టారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన తర్వాత పరిణామాలను బట్టి పార్టీ మారే విషయంపై తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పిన కోమటిరెడ్డికి అంత దాకా ఆగేందుకు కూడా రేవంత్ రెడ్డి సమయం ఇవ్వలేదు. చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారేందుకు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారని అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీని వీడడం వల్ల కాంగ్రెస్ కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నష్టం జరుతుందనేది నిర్వివాదాంశం. ఆ లోటును రేవంత్ రెడ్డి ఎలా పూడుస్తారనేది ఓ ప్రశ్న. అదే సమయంలో ఈ మాత్రం బలం లేని బిజెపి వారి ప్రవేశంతో బలం పుంజుకుంటుంది. దీన్ని ఆయన ఎలా కట్టడి చేస్తారనేది మరో ప్రశ్న.

click me!