వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా?.. జగన్‌‌కు ఎదురుకానున్న సవాళ్లు ఇవే..!

By Sumanth KanukulaFirst Published Jul 8, 2022, 9:12 AM IST
Highlights

వైఎస్సార్‌ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ రాజీనామా చేయబోతున్నరానే  వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కటుంబంలో చోటుచేసుకున్న విబేధాలే కారణమనే ప్రచారం సాగుతుంది. వైసీపీ ప్లీనరీ వేదికగా ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించాడు. ఈ పార్టీకి తన తల్లి వైఎస్ విజయలక్ష్మి గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. అయితే జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ కోసం పనిచేసినప్పటికీ.. ఆమెకు పార్టీలో ప్రత్యేకంగా ఎలాంటి పదవి లేదు. వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలో విజయమ్మ, షర్మిల పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల సమయంలో కూడా వైసీపీకి తెగ ప్రచారం చేశారు. అయితే 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

ఆ తర్వాత వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో వైఎస్సార్ కుటుంబంలో విబేధాలు ఉన్నాయని ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ వాయిస్ వినిపిస్తున్న సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే జగన్ ఆలోచన. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశే ముఖ్యమని.. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణలో మరో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది. వారి మధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావు’’ అని సజ్జల చెప్పుకొచ్చారు. 

Latest Videos

అయితే ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనే ప్రచారం మరింత విస్తృతంగా సాగింది. అది నిజమేననట్టుగా జగన్, షర్మిల వ్యవహార శైలి కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ.. షర్మిలతోనే కలిసి ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్‌టీపీ ఆవిర్భావం రోజున కూతురిని ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు. వైఎస్సార్ సన్నిహితులకు ఆహ్వానం పంపి ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. 

ఇలా కూతురితోనే కలిసి సాగుతున్న విజయమ్మ.. కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన దాఖలు లేవు. అయితే నేటి నుంచి రెండు  రోజుల పాటు జరగనున్న వైసీపీ ప్లీనరీకి విజయమ్మ హాజరవుతారా? లేదా? అనేది కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ప్లీనరీకి వస్తారనే పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే విజయమ్మ పార్టీ ప్లీనరీకి హాజరవుతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 

అయితే విజయమ్మను గౌరవ అధ్యక్ష నుంచి తప్పించకుండా.. ఆమె పార్టీ బాధ్యతలకు రాజీనామా చేసేలా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు వైసీపీ ముఖ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెకు సమాచారం ఇచ్చారని.. పార్టీకి ఇబ్బంది రాకుండా దీనిపై విజయమ్మ చేతనే ప్రకటన చేయించే అవకాశం ఉంది.  వయోభారం, కూతురి పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నందున.. ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నారనే ప్రచారం వైసీపీ తెరమీదకు తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఆమె వైసీపీ గౌరవ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నంత మాత్రాన వైఎస్ జగన్‌కు వచ్చే నష్టం ఏం లేదని.. ఆమె ఆ పదవిలో ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాల్లో జగన్ నిర్ణయమే ఫైనల్ అని రాజకీయ వర్గాల్లో ఉన్న మాటే. ఆమె గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న అది టెక్నికల్ అంశంగానే చూడాల్సి ఉంటుంది. 

రాజకీయంగా జగన్‌కు ఎదురుకానున్న సవాళ్లు..
విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా తప్పుకోవడం పార్టీ పరంగా ఎలాంటి నష్టం చేకూర్చకపోయినప్పటికీ.. రాజకీయంగా మాత్రం జగన్‌పై విపరీతమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. జగన్ విలువలు, విశ్వసనీయత అంటూ పదే పదే చెప్పుకొస్తారు.. అలాంటిది కుటుంబంలో విబేధాలు, తల్లి, చెల్లిని దూరం చేసుకున్నాడనే విమర్శలను ఎలా తిప్పికొడతారో వేచిచూడాల్సి ఉంటుంది. 

అలాగే తల్లిని, చెల్లిని గౌరవించలేని జగన్.. రాష్ట్రంలోని ప్రజల బాగోగుల గురించి ఏం ఆలోచిస్తారనే విమర్శలు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ పెట్టినప్పటీ నుంచి తన ప్రసంగాలలో అక్కాచెల్లమ్మల గురించి గొప్పగా ప్రసంగిస్తుంటారు. ఇటీవల అమ్మఒడి పథకంతో.. పిల్లలకు మామయ్యగా చెప్పుకుంటున్నారు. అలాంటింది జగన్.. తన తల్లి, చెల్లిని పక్కకు పెట్టిన విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే జగన్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదు. 

ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు.. ఆయన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచారని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అమాయకులను చేసి టీడీపీని లాక్కున్నారని వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక ఆవిర్భావం తర్వాత.. అందులో చంద్రబాబు వెన్నుపోటు అంటూ విస్తృతంగా కథనాలు ప్రచురిస్తూ వచ్చారు. వైసీపీ ఏర్పాటు తర్వాత ఆ ధోరణి మరింతగా పెరిగింది. అయితే ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని టీడీపీ నేతలు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. 

ఇన్ని రోజులు చంద్రబాబుది వెన్నుపోటు అని విమర్శలు చేసిన వైఎస్ జగన్, వైసీపీ నేతలు.. మరి చెల్లిని, తల్లిని దూరంగా పెట్టడంపై ఏం సమాధానం చెబుతారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ చేస్తున్నది ‘‘ఏ పోటు..’’ అని ఎద్దేవా చేస్తున్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను జగన్ కాపాడుతున్నారని చెబుతున్న టీడీపీ నేతలు.. తల్లినే దూరం పెట్టిన జగన్‌కు ఇదో లెక్క అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రకమైన విమర్శలకు జగన్ గానీ, వైసీపీ నాయకులు గానీ ఏ విధమైన సమాధానం చెబుతారో చూడాలి.  

click me!