
ఉత్తర్ ప్రదేశ్ లోని భోగనిపూర్ తహసీల్‌కు చెందిన డిచ్‌కి గ్రామానికి చెందిన రాజేష్ కటియార్ తన కుమార్తె కీర్తికి సికంద్రా తహసీల్‌లోని కొర్వా గ్రామానికి చెందిన డాక్టర్ రాహుల్ కటియార్‌తో వివాహం నిశ్చయించారు. వరుడి తండ్రి రమేష్ కటియార్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 7న ముగిన్సాపూర్‌లోని తమ ఇంట్లో ఘనంగా నిశ్చితార్థ వేడుక జరిగిందని, ఈ సందర్భంగా వధువు తరపు వారు 9 లక్షల రూపాయల నగదు, బంగారు గొలుసును కానుకగా ఇచ్చారని తెలిపారు. రాత్రి అంతా వేడుకలు జరిగాక, ఉదయం పెళ్లి(ఫేరే) సమయం వచ్చేసరికి, వధువుకు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యంగా ఉందనీ, ఈ పెళ్లిని ఆపేస్తున్నామని చెప్పారు. మొదట వరుడి తరపు వారు దీన్ని తాత్కాలిక వాయిదాగా భావించారు, కానీ కొంత సమయం తర్వాత వధువు తరపు వారు వధువు ఇక పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంతో వరుడు, అతని కుటుంబం తీవ్ర షాక్‌కు గురయ్యారు. వారు ఎంత నచ్చజెప్పినా వధువు తన నిర్ణయం మార్చుకోలేదు. చివరికి, వరుడి తరపు వారు పెళ్లి పూర్తి కాకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది, ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గొడవ మొదలైంది.
అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 8న నీరజా గార్డెన్ రాజ్‌పూర్‌లో బారాత్ ఘనంగా జరిగింది. పెళ్లి కొడుక్కి ఘన స్వాగతం లభించింది. రాత్రి 12 గంటలకు జైమాల కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 17 లక్షల రూపాయల విలువైన నగలు, ఇతర కానుకలు ఇచ్చారు. ఆ తర్వాత తాళి కట్టే పెళ్లికి కాస్త సమయం మిగిలి ఉంది. ఈలోపే వధువు కనిపించకుండాపోయింది. తీవ్రంగా ఆలస్యం కావడంతో వధువు తరపు వారు ముందు కొంత సమయం కావాలనీ, తర్వాత ఈ పెళ్లి జరగదని చెప్పారు. వధువు తన బావతో కోర్టులో పెళ్లి చేసుకున్నట్లు నింపాదిగా చెప్పారు. ఇది విన్న వారంతా షాక్ అయ్యారు.