హెచ్‌1బీ వీసా ఇక కష్టమే!: ఫీజు పెంపునకు ట్రంప్ సర్కారు ప్రపోజల్

By rajashekhar garrepally  |  First Published May 8, 2019, 9:32 AM IST

అమెరికాకు ఉద్యోగులను పంపే భారత ఐటీ దిగ్గజాలపై మరింత ఆర్థిక భారం పడనున్నది. అగ్రరాజ్యంలో ఉద్యోగం కోసం అవసరమైన హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. 


వాషింగ్టన్‌: అమెరికాకు ఉద్యోగులను పంపే భారత ఐటీ దిగ్గజాలపై మరింత ఆర్థిక భారం పడనున్నది. అగ్రరాజ్యంలో ఉద్యోగం కోసం అవసరమైన హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. 

అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్‌ ప్రొగ్రామ్‌కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్‌ అకోస్టా తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు చేశారు. 

Latest Videos

undefined

వీసా దరఖాస్తు రుసుమును ఎంత పెంచాలనుకుంటున్నారు.. ఏయే కేటగిరిలోని దరఖాస్తుదారులకు ఈ పెంపు వర్తిస్తుందన్న పూర్తి వివరాలను అకోస్టా బహిర్గతం చేయలేదు. గత అనుభవాల దృష్ట్యా, హెచ్1బీ వీసాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసే భారత ఐటీ కంపెనీలపైనే ఈ భారం ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. 

హెచ్‌-1బీ దరఖాస్తు రుసుమును పెంచితే గనుక ఆ ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీలపైనే పడనుంది. హెచ్‌-1బీ వీసాపై అమెరికా వెళ్లేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఇప్పుడు దరఖాస్తు ఫీజు పెంచితే.. ఐటీ కంపెనీలపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది. హెచ్‌-1బీ వీసాలపై ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం పలు కఠిన నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. 

ఈ వీసాల వల్ల అమెరికాలో పనిచేసే విదేశీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, దీనివల్ల అమెరికన్లు నష్టపోతున్నారనే సాకుతో వీసా నిబంధనలను కఠినం చేశారు. కొత్త నిబంధనల కారణంగా గతేడాది దాదాపు ప్రతి నలుగురు దరఖాస్తుదారుల్లో ఒకరి దరఖాస్తును ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరస్కరించారు.

తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో 6.50లక్షల మంది వరకు విదేశీయులు హెచ్‌-1బీ వీసాలపై ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో అధికశాతం భారత్‌, చైనాల నుంచి వెళ్లినవారే. 

సాంకేతికంగా నిపుణులైన విదేశీ ఉద్యోగులను పనిలో పెట్టుకొనేందుకు అమెరికన్ కంపెనీలకు అనుమతినిచ్చేదే హెచ్1బీ వీసా. ఈ వీసా ద్వారా అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు ప్రతి ఏటా వేల సంఖ్యలో భారత్, చైనా నుంచి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. 

హెచ్1బీ వీసాపై ఏటా లక్ష మందికి పైగా విదేశీ ఉద్యోగులు అమెరికాకు వస్తున్నారు. దీంతో విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా వారి వేతనాల తగ్గింపునకు కూడా కారణమవుతున్నారన్న నెపంతో ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా నిబంధనలను నానాటికీ కఠినతరం చేస్తున్నది. 

ట్రంప్ సర్కార్ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనల కారణంగా గత ఏడాది సగటున ప్రతి నాలుగు హెచ్ 1 బీ వీసా దరఖాస్తులలో ఒకదానిని అమెరికన్ అధికారులు తిరస్కరించారు. 
 

click me!