పిల్లల భవిష్యత్ కోసం దేశం కానీ దేశం వెళ్లిన ఓ మహిళ అక్కడ మోసగాళ్ల చేతికి చిక్కి చివరకు స్వదేశానికి జీవచ్చవంలా వచ్చింది
పిల్లల భవిష్యత్ కోసం దేశం కానీ దేశం వెళ్లిన ఓ మహిళ అక్కడ మోసగాళ్ల చేతికి చిక్కి చివరకు స్వదేశానికి జీవచ్చవంలా వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం అనుమసముద్రం గ్రామానికి చెందిన షేక్ హాబీ బున్నీషా 2009లో పెద్దలను కాదని షేక్ నవాబ్‌ను వివాహం చేసుకుంది.
వారికి ఇద్దరు కుమారులు, భర్త తాగుడుకు బానిసై ప్రతిరోజు వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె పిల్లలతో కలిసి విడిగా వచ్చేసింది. ఇళ్లలో పాచిపనులు చేస్తూ దర్గా వద్ద నివసించేది.
undefined
ఈ క్రమంలో ఓ ఇంట్లో పని చేస్తుండగా.. వసీమా అనే మహిళ... ఆమె పరిస్ధితిని గమనించింది. గల్ఫ్ వెళ్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందని మాయ మాటలు చెప్పించింది. ఆమె మాటలు నమ్మిన బున్నీషా... తన పిల్లలను వసీమా బావ పనిచేస్తున్న మదరసాలో వదిలి ఆరు నెలల క్రితం మస్కట్ వెళ్లింది.
కొద్దిరోజుల పాటు తన భార్య, పిల్లల కోసం గాలించిన నవాబ్ ఆ తరువాత తన పనుల్లో పడిపోయాడు. ఈ క్రమంలో ఒక రోజు దర్గా వద్ద బున్నీషా జీవచ్చవమయి కనిపించింది. పలకరిస్తే ఏడవటమే కానీ తిరిగి సమాధానమివ్వలేని స్ధితికి చేరింది.
అంతేకాకుండా వంటిపై బ్లేడుతో కోసిన, సిగరెట్‌తో కాల్చిన గాయాలను నవాబ్ గమనించాడు. ఆమె సంచిలో మస్కట్‌కు వెళ్లిన విమాన టికెట్, మెడికల్ చెకప్ రిపోర్టులు ఉన్నాయి. దీంతో బున్నీషాను గల్ఫ్‌కు పంపించిన వసీమాపై నవాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన భార్యను మస్కట్‌లోని వ్యభిచార గృహానికి అమ్మేశారని.. అక్కడ ఆమె నరకయాతన అనుభవించిందని, శారీరకంగా.. మానసికంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.