చంద్రబాబుదే పైచేయి: కేసీఆర్ ఫ్రంట్ కు దొరకని దారి

By telugu teamFirst Published May 8, 2019, 11:02 AM IST
Highlights

తమ కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని డిఎంకె నేత స్టాలిన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను కలవడానికి స్టాలిన్ ఇష్టపడడం లేదని అంటున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సులభంగా కనిపించడం లేదు. కాంగ్రెసేతర, బిజెపియేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే, బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు చాలా వరకు కాంగ్రెసును వ్యతిరేకించడానికి సిద్ధంగా లేవు. 

తమ కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని డిఎంకె నేత స్టాలిన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను కలవడానికి స్టాలిన్ ఇష్టపడడం లేదని అంటున్నారు. కేసీఆర్ ఈ నెల 13వ తేదీన స్టాలిన్ ను కలుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ భేటీ జరగడం లేదు. స్ఠాలిన్ కేసీఆర్ కు మొహం చాటేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి నడిచేందుకు ఆ ప్రాంతీయ పార్టీలు సముఖంగా ఉన్నట్లు తాజా పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. దక్షిణాది రాష్టాల్లో ప్రాంతీయ పార్టీలు 150 దాకా లోకసభ స్థానాలు గెలుస్తాయని, ఈ స్థితిలో దక్షిణాది నేత ప్రధాని కావడానికి తగిన వ్యూహాన్ని అనుసరిద్దామని కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో చెప్పినట్లు సమాచారం. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైసిపికి, టీఆర్ఎస్ కు కలిపి దాదాపు 40 సీట్లు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. బిజూ జనతాదళ్, డిఎంకె, జెడిఎస్, కేరళలోని డెమొక్రటిక్ ఫ్రంట్ కలిసి వస్తే ఫెడరల్ ఫ్రంట్ బలంగా తయారవుతుందని ఆయన భావిస్తున్నారు. తద్వారా భవిష్యత్తు ప్రధానిని మనమే నిర్ణయించవచ్చునని ఆయన చెబుతున్నారు. 

డిఎంకె, కర్ణాటకలోని జెడిఎస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించాయి. ఈ స్థితిలో డిఎంకె నేత స్టాలిన్ కేసిఆర్ ను కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ, బిఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఇప్పటి వరకు కేసీఆర్ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించిన దాఖలాలు లేవు. ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు లేకపోతే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను జాతీయ స్థాయిలో తాను అనుకున్న స్థాయిలో నిలబెట్టలేరనే మాట వినిపిస్తోంది. 

click me!