కేసీఆర్ 1996 ఫార్ములా: ఫెడరల్ ఫ్రంట్ ప్లాన్ ఇదే...

By telugu teamFirst Published May 7, 2019, 11:34 AM IST
Highlights

కేసీఆర్ సోమవారం సాయంత్రం కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ తో భేటీ అయి తన ఆలోచనలను పంచుకున్నారు. 1996 ఫార్ములా గురించి ఆయన మాట్లాడారు. దక్షిణాది నేతను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచన ఆయన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు పక్కా ప్లాన్ తో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలకు బాటలు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. బిజెపియేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో నెలకొల్పాలనే పట్టుదలతో ఆయన ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు గాను ఆయన ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలకు సమాయత్తమయ్యారు. 

కేసీఆర్ సోమవారం సాయంత్రం కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ తో భేటీ అయి తన ఆలోచనలను పంచుకున్నారు. 1996 ఫార్ములా గురించి ఆయన మాట్లాడారు. దక్షిణాది నేతను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచన ఆయన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగానే కేసీఆర్ సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన డిఎంకే నేత స్టాలిన్ తో భేటీ కానున్నారు. దక్షిణాది నుంచి ప్రధాని అయితే బాగుటుందని కేసీఆర్ విజయన్ తో చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ నాయకుడి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదని అంటున్నారు. 

వాయనాడ్ లో రాహుల్ గాంధీ వామపక్ష అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేయడాన్ని కేసీఆర్ విజయన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దాన్ని బట్టి కాంగ్రెసు వైఖరిని అర్థం చేసుకోవచ్చునని ఆయన చెప్పినట్లు సమాచారం. కేంద్రంలో బిజెపికి గానీ కాంగ్రెసుకు గానీ మెజారిటీకి అవసరమైన సీట్లు రాబోవని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. మెజారిటీకి దగ్గరలో కూడా ఆ పార్టీలు ఉండవని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

మే 23వ తేదీ తర్వాత తాను తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతానని విజయన్ కేసీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ కరుణానిధిని, స్టాలిన్ ను కలిసి తన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను పంచుకున్నారు. అయితే, కరుణానిధి మరణం తర్వాత పరిస్థితి మారింది. స్టాలిన్ కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడ్డారు. దీంతో ఈ నెల 13వ తేదీన తన ప్రణాళిక గురించి స్టాలిన్ తో మాట్లాడాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

click me!