ఆన్ లైన్ ఆటకోసం అమ్మా, చెల్లిని చంపేశాడు

First Published Dec 9, 2017, 1:03 PM IST
Highlights
  • ఆన్ లైన్ ఆటలతో ఉన్మాదులుగా మారుతున్న చిన్నారులు
  • ఈ ఉన్మాదంలో తల్లి, చెల్లిని చంపిన బాలుడు
  • డిల్లీలోని నోయిడా ప్రాంతంలో ఉదంతం

ఆటస్థలాల్లో ఆడుకోవాల్సిన చిన్నారులు ఆన్ లైన్ గేమ్ లకు బానిసలై ప్రాణాలను బలిగొంటున్నారు. బ్లూ వేల్ వంటి గేమ్ కు బానిసలై ఆత్మహత్య చేసుకున్న చిన్నారుల ఉదంతాలు మనం చూశాం. తాజాగా ఓ గేమ్ కారణంగా తన తల్లి, చెల్లిని చంపిన ఉదంతం డిల్లీలో బయటపడింది.
 
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ పదహారేళ్ల బాలుడు హై స్కూల్ గ్యాంగ్ స్టర్ అనే గేమ్ కు బానిసయ్యాడు. ఈ ఆటకోసం స్కూల్ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ అస్తమానం ఈ గేమ్ ఆడుతుండేవాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు ఈ గేమ్ ఆడకుండా సెల్ ఫోన్ లు తీసేసుకున్నారు. బాగా అలవాటుపడిన ఆట ఒక్కసారి ఆడకపోయేసరికి అతడిలోని ఉన్మాది మేలుకున్నాడు. రోజు రోజుకు ఈ ఉన్మాదం పెరిగి ఆ గేమ్ ఆడటానికి ఎంతటికైనా తెగించడానికి సిద్దమయ్యాడు.

తండ్రి వ్యాపార పనులపై సూరత్ వెళ్లగా ఈ బాలుడు ఇదే అదునుగా భావించాడు. తన తల్లిని సెల్ ఫోన్ ఇవ్వమని అడగ్గా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు పక్కనే ఉన్న బ్యాట్ తో తల్లి(42) తలపై బాదాడు. అంతటితో ఆగకుండా తన చెల్లి(9) పై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత అతడు తన సెల్ ఫోన్ తో పాటు ఇంట్లోని రూ.2 లక్షలు తీసుకుని పరారయ్యాడు.

అయితే సూరత్ నుంచి తండ్రి ఇంటికి ఫోన్ చేయగా ఎవరూ ఫోన్ లిప్ట్ చేయలేదు. దీంతో అతడు పక్కింటివారికి ఫోన్ చేయగా వారు వచ్చి ఈ ఇంట్లో చూడగా అతడి భార్య, కూతురు రక్తపుమడుగులో విగతజీవులై పడివున్నారు. ఈ విషయాన్ని వారు అతడికి తెలియజేయడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడు వారణాసిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో పట్టుకుని విచారించారు. దీంతో తన తల్లిని, చెల్లిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు.   
 

click me!