పన్నీర్ సెల్వం తమిళనాడు మాంఝీ అవుతాడా?

Published : Feb 14, 2017, 10:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
పన్నీర్ సెల్వం తమిళనాడు మాంఝీ అవుతాడా?

సారాంశం

ఎవరీ మాంఝీ, ఏమా కథ, మాంఝీకి  పన్నీర్ కి పోలికేమిటి?

పన్నీర్ సెల్వం  తమిళనాడు జితన్ రామ్ మాంఝీ అవుతాడా? 

 

మాంఝీ ఎవరో తెలుసుకదా. ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి.

 

2014 లోక్ సభ ఎన్నికలలో జెడి (యు)కు పరాజయం పాలవడంతో అంతవరకు ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ గద్దె దిగి మాంఝీ ని ముఖ్యమంత్రిని చేశాడు. అయితే, మాంఝీ మెల్లిగా బిజెపితో చేతులు కలిపి, పార్టీలో చీలిక తెచ్చి సీటు పదిలపర్చుకోవాలనుకున్నాడు. ఒక ప్రయత్నం చేశాడు. దీనితో జెడియు అయనను పార్టీ నుంచి బహిష్కరించింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

 

అయితే, బిజెపి మద్ధతు, గవర్నర్ అండతో  ఆయన ససేమిరా అన్నాడు. చివరకు బలనిరూపణచేసుకోవలసి వచ్చింది. ఆ ముహూర్తం వచ్చింది. ఎమ్మెల్యేలంతా తనవైపు వస్తారని, మోదీ నాయకత్వంలోని బిజెపి తెస్తుందని మాంఝీ అత్యాశించాడు.  2015, ఫిబ్రవరి 15న బలనిరూపణ. ఎంత బిజెపి మద్దతు ఉన్నా పరీక్ష ఎదుర్కొనేందుకు ధైర్యం చాల లేదు. చివరకు బలనిరూపణకు రెండు గంటల ముందు కాలుకాలిన పిల్లిలా రాజ్ భవన్ వైపు పరుగుతీయాల్సి వచ్చింది, రాజీనామా చేసేందుకు.

 

 కొద్ది రోజుల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నితిశ్, లాలూ కూటమి  బీహార్ లో జెపి, మాంఝీలకు అడ్రసు లేకుండా చేసింది. ఇపుడు తమిళనాడులో కూడా   బీహార్ నాటకం నడుస్తున్నదేమో అనిపిస్తుంది.

 

బిజెపి చిరకాల వాంఛ దక్షిణాదిలో కాషాయ జండా పాతాలి అనేది. ఉత్తరాది పార్టీ , హిందీ పార్టీ అనే అపవాదు పోవాలంటే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో బలమయిన శక్తిగా ఎదగాలి. ఈ కోరిక ఇద్దరు మహానాయకులు తీర్చలేక పోయారు. అద్వానీ రథయాత్రంకు జనం నీరాజనాలు పట్టినా, ఓట్లు మాత్రం ఇచ్చేది లేదని చెప్పారు. అలాగే బిజెపిలో  ఎవరెస్టంత నాయకుడిగా పేరున్న అటల్ బిహరీ వాజ్ పేయి  ప్రధానిగా రెండు దఫాలు ఉన్నా దాని ప్రభావం కర్నాటక దాటి రాలేదు.

 

ఇపుడు, నరేంద్రమోదీ రథ సారధిగా ఉన్నా బిజెపి జండా దక్షిణాదిన ఎగరలేకపోతున్నది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు బిజెపిని ఎపుడూ రెండుమూడు సీట్లకంటే ఎక్కువ స్థానాలను మించి ఎదగనీయడు.  అవి కూడ ఆయనే దానం చేస్తాడు. తమిళనాడులో... హిందీకి , తమిళానికి పొత్తే కుదరడం లేదు. కుదిరినా అదిపార్లమెంటుకే పరిమితం అవుతూఉంది. ఇక కేరళ కూడా అంత ఈజీ గా లొంగేటట్లు లేదు.

 

ఇలాంటపు జయలలిత చనిపోవడం బిజెపికి బాగా అనుకూలించింది. వెంటనే పన్నీరును పట్టేశారు. ఎపుడూ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా విసుగెత్తిన పన్నీర్ బిజెపికి తనని ముఖ్యమంత్రి గా నిలబెట్టే శక్తి ఉందని గ్రహించి ఢిల్లీ  వెళ్లి ప్రధాని మోదీ శరణు జొచ్చారు. దాని పర్యవసానాలు చెన్నైలో ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. అక్కడ వెంక్కయ్య నాయుడొకవైపు, గవర్నర్ విద్యాసాగర్రావు మరొక వైపు, ఇంకొకవైపు బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తమిళనాడులో పరిస్థితులను చక్కబరిచే పనిలో నిండా మునిగిఉన్నారు. ఇదే బాగలేదని బిజెపి ఎంపి డా.సుబ్రమణ్య స్వామియే రాజ్ భవన్ మీద మండిపడ్డారు.

 

ఇపుడు శశికళ జైలు కెళ్లడం తో రాస్తా బిజెపికి మరింత అనుకూలమయింది.బిజెపి క్యాండిడేట్ కు పెద్ద అడ్డంకి తొలగిపోయింది. పోయెస్ గార్డెన్ లోని వేదసదనం ఇక ఎంత మాత్రం శత్రు శిబిరం కాదు.  81,ఫోయెస్ గార్డెన్ గురించి  బయపడనవసరం లేదు. దానిని ఇక మ్యూజియంగా మార్చేందుకు చర్యలు తీసుకోవచ్చు.

 

తమిళనాడు వ్యవహారాలలో బిజెపి తలదూర్చుతూ ఉందనే అనుమానం రాకుండా బిజెపి పన్నీర్ సెల్వం ముందు నిలబెట్టంది. రంగంలో బిజెపి నాయకుల హడావిడి లేకుండా జాగ్రత్త పడింది.అంతా ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారు.

 

అయితే, శశికళ జైలు కెళ్లాక ఏమవుతుందో చూడాలి.  గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలంతా  పన్నీర్ దగ్గిరకు పరిగెత్తు కుంటు వస్తారా. ఇందులో బిజెపి, కేంద్రం పాత్ర ఎలా ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలలో ఆదాయపు పన్ను కేసులున్న వారు, ఇతర కేసులున్నవారు ఉన్నారా, ఉంటే వారి తీరు ఎలాఉంటుంది... వేచి చూడాలి.

 

లేక, తమిళనాడు బిజెపి నాటకాలాడిస్తున్నదని తమిళ సెంటుమెంటు వస్తుందా? లేక గవర్నర్ విద్యాసాగర్ రావు వారం లేదా పదిరోజులు గడువిచ్చినా పన్నీర్ కు పట్టమని పదిమంది ఎమ్మెల్యేలు దొరకని పరిస్థితి కొనసాగుతుందా...

 

లేక, పన్నీర్ సెల్వం బీహారీ జితన్ రాం మాంఝీలాగా బలయిపోతాడా. ఇక్కడ, సమీపంలో ఎన్నికల లేకపోవచ్చు. అయితేనేం, బిజెపికి, పన్నీర్  తప్పకుండా పరీక్షా సమయమే.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !