
అమ్మ జోలపాటలో రాగమెంత ఉన్నది,
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది...
కోయిలే తాళం, పైరగాలే మేళం..
మమతే రాగం, శ్రమజీవనమే భావం....
ఆహూ ఊహు రోకటి పాటలో లేదా మధుర సంగీతం....
జనబాహుళ్యానికి చేరని సంగీతమెందుకు
అని ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడిని ప్రశ్నిస్తుంది ఒక అమ్మాయి.
బ్రతుకున లేని శృతి కలదా...ఎద సడిలోనా లయలేదా?కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా?వెన్నెల దీపం కొందరిదా?అడవిని సైతం వెలుగు కదా!....అంటూ కట్టెలుకొట్టుకునే శ్రమజీవుల గొడ్డలి,రంపం తాళం మధ్య ఆలపిస్తాడు ఒక విద్వాంసుడి కొడుకు.
ఈ రెండూ బాలచందర్ దర్శకత్వంలోని సింధుభైరవి,రుద్రవీణ సినిమాల్లోని పాడలేను పల్లవైనా భాష రానిదానను,తరలిరాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం పాటలని గ్రహించే ఉంటారు.
నిజంగా జనబాహుళ్యంలోకి శాస్త్రీయ సంగీతాన్ని తీసుకుపోతున్న విద్వాంసులున్నారా?
గతేడాది ఆసియా ఖండపు నోబెల్‌గా వినుతికెక్కిన రామన్ మెగసెసె అవార్డును పారిశుధ్య కార్మిక హక్కుల పోరాట యోధుడు బెజవాడ విల్సన్ తో పాటూ emergent leadership కేటగిరీలో కళారూపాల్లో సామాజిక అంతరాలను ఛేదిస్తున్నాడని పురస్కారం అందుకున్న మరో భారతీయుడు శాస్త్రీయ సంగీత విద్వాంసుడు T.M.కృష్ణ. చెన్నై లోని సంప్రదాయ కుటుంబలో పుట్టిన కృష్ణ తండ్రి వ్యాపారవేత్త.తల్లిగారు ఎన్నో విద్యాలయాలను స్థాపించింది.2006 లో విద్యావనం పేర గిరిజన పిల్లల పాఠశాల ప్రారంభించింది.కృష్ణ చిన్నతనం నుంచి శాస్త్రీయ సంగీతం అభ్యసించాడు.
కళారంగం లో,మరీ ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో కుల,మత వివక్షను నిరసించడమే కాకుండా శాస్త్రీయ సంగీత కచ్చేరీలను కృష్ణ బహిష్కరించాడు.పట్టణాల్లోని మురికివాడలు,గ్రామీణ ప్రాంతాలవారిని తన శ్రోతలుగా చేసుకున్నాడు.ఎందరో గొప్పవాళ్లు జన్మించినా ఓట్ల సమయంలో తప్ప సామాన్యుల స్వరం ఎప్పుడో మూగబోయిన అప్రజాస్వామిక తమిళనాడు నుంచి వచ్చాను అని చెప్పుకుంటాడు. కళారంగం జుగుప్సాకరంగా తయారై ఎన్నో అంతరాలను సృష్టించింది అంటాడు.కళాకారులు పైమెట్టులో ఉన్నట్లు భావించి శ్రోతలను కిందకు చూస్తూ ఏదో పంచుకున్నాం అనుకుంటారు.కానీ ఆ పంచుకుంటున్నదెవరితో?నాలాంటి వారితోనే..సంగీతం అంటే ఇలాగే ఉండాలి అనుకునేవారితోనే..మాలాటి జనంతోనే..ఒక రకంగా సంకరం కాకూడదని బంధువుల మధ్య పెళ్లి లాంటి తతంగం ఇది అంటారు.ఈ శ్రోతల్లో తిరిగి కుల,మత,వర్ణ,లింగ బేధాలు అంటాడు.
ప్రదర్శనకు టికెట్ పెట్టినా,ఉచితంగా ప్రదర్శించినా స్థానికంగా నైనా,అమెరికాలోనైనా వచ్చేది మాత్రం ఆ కొందరు జనాలే..ఒకవేళ కొత్తవారు వచ్చినా పాత శ్రోతల్లా ప్రవర్తించాల్సిందే,లేకపోతే రానివ్వరు.ఇది ఏ కళారూపానికైనా వర్తిస్తుంది.మళ్లీ ఈ వివిధ కళారూపాల్లో ఎక్కువతక్కువలనే విబేధాలు.ఇట్లాంటి బేధభావాలతో పాటూ ఫలాన కళ ఫలానా వారిదనే బేధభావం పోవాలంటాడు..అసలు కళకు హద్దులు లేనప్పుడు జాతీయత,ఒకరి సంస్కృతి అనడాన్నీ నిరసిస్తాడు.
చెన్నైలో వివిధ ప్రాంతాల్లో నవంబర్,డిసెంబర్ మాసాల్లోని 3,4 వారాల్లో సుమారు వందలాది కచ్చేరిలు జరుగుతాయి..కానీ శ్రోతలు వారే..
ఇలాంటి నెలలో నా ప్రయాణం ఒక జాలరుల గ్రామం లో 10,15 మంది శ్రోతల మధ్య మొదలు పెట్టాను అంటాడు...ఇప్పుడు ఒకే వేదిక మీద శాస్త్రీయ,జానపద సంగీతాలు,నాట్యాలు జరుగుతున్నాయి...ఇసుకలో ఆసీనులైన వేలాది ప్రేక్షకులు కుల,మత,లింగ బేధాలు పాటించకుండా,పక్కనోడి ఊసులేకుండా ఆడిపాడుతున్నారు అంటాడు కృష్ణ.
ఈ సంక్రాంతికి విడుదలైన వీరి "పోరంబోకు" అని రాగమాలిక లో చేసిన పాట (ఒక పాటలో ఒకే రాగం కాకుండా వివిధ రాగాలను వాడితే రాగమాలిక అంటారు..ఇందులో ఆనందభైరవి,బేగడ,హమీర్ కళ్యాణి,దేవగాంధారి,సలగ భైరవి,సింధుభైరవి రాగాలను వాడారు)లక్షలాది జనాన్ని ఆకట్టుకుంది.
బీకాం లో ఫిజిక్స్ ఏమో కానీ వాగులు,వంకలు,నదుల్లో పారాల్సిన నీళ్లు జనావాసాలు,నగరాల్లో ఎందుకు పారుతున్నాయి?
ఒకప్పుడు సామూహిక వినియోగం...నీటికుంటలు,పశువుల గ్రాసం కోసం వదిలిన భూములను పోరంబోకు అనేవారు...కానీ ఆ అర్ధం మారిపోయి ఒక తిట్టుగా మారింది...
పోరంబోకు స్థలాలు పోగొట్టుకుని నువ్వు,నేను..మనందరం ఎలా పోరంబోకులమయ్యామన్నది ఈ పాటలో చక్కగా వర్ణిం చాడు...
ఆలస్యమెందుకు అందరం చూసి ఆనందిద్దాం..కాదు కాదు....ఆలోచిద్దాం.
"poramboke" means "poram (g[wk;)" is outside; "poke (nghf;F)" is revenue record. Thus the word "poramboke lands" means the lands which is not assessed to revenue records and it is outside the revenue accounts. (see more at https://indiankanoon.org/docfragment/100308/?formInput=poramboke%20means)