తెలంగాణాలో దుమ్మురేపుతున్న ఆంధ్రా అమ్మాయి

First Published Aug 26, 2017, 4:42 PM IST
Highlights

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి చాలా మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఉండే  దర్పాన్ని, తలబిరుసును బంగాళా ఖాతంలో పడేశారు. దేన్నయినా కొత్త కోణంలో నుంచి చూడటం అలవర్చుకున్నారు.ఐఎఎస్, కలెక్టర్ ను కొత్త నిర్వచనం ఇస్తూ తెలంగాణాలో సంచలనం సృష్టిసున్నారు. ఇంతకీ ఆమ్రపాలి ఎవరో తెలుసా, ఆంధ్రా అమ్మాయి.

మరోసారి వార్తల్లో నిలిచారు.తెలంగాణా వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఆమె పనితీరుకు ముగ్ధులైన కొందరు యువకులు.. ఏకంగా ప్రతిమను తయారుచేసిన వార్త వైరల్‌ అయింది. నవరాత్రుల సందర్భంగా ఖాజీపేటలోని బాపూజీనగర్‌లో ఏర్పాటుచేసిన మండపంలో కలెక్టర్‌ అమ్రపాలి ఒళ్లో వినాయకుడు కూర్చున్న ప్రతిమను ఉంచారు(పక్క ఫోటో). శుక్రవారం విగ్రహానికి పూజలు చేశారు. మండపంలో ఉన్న ఆమ్రపాలి విగ్రహం ఫోటోలను ‘హమారా వరంగల్’ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలకొద్దీ లైక్‌లు, వందలకొద్దీ షేర్లు వచ్చాయి. ట్రైసిటీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మండపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకమండపంలో ఒక కలెక్టర్‌ ప్రతిమకు చోటు కల్పించడం తెలుగురాష్ట్రాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

తెలంగాణాలో దుమ్మురేపుతున్న అమ్రపాలి ఎవరో తెలుసా,  ఆంధ్రా అమ్మాయి.

శ్రీమతి కాట ఆమ్రపాలి తెలంగాణ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ఆమె "యువ డైనమిక్ ఆఫీసర్"గా పేరుగాంచింది. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళ IAS అధికారిణి.


జీవిత విశేషాలు

ఆమ్రపాలి 04 నవంబరు 1982న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కాట వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ఒక విశ్రాంత ప్రొఫెసర్. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పనిచేశారు. ఆమె పాటశాల విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్ లో జరిగింది. తర్వాత ఆమె చెన్నైలోని "ఐఐటి మద్రాస్" నుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైంది. "IIM” బెంగుళూరు నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రురాలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఒకరు ఆమె. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో పరిపాలనా శిక్షణను పూర్తి చేసిన తరువాత ఆమె తన పరిశీలనలో శిక్షణ పొందింది. ఆ తర్వాత ఆమె ముందుగా వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా పనిచేసి, ఆ తరువాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్‌లో పనిచేశారు. 2015 జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2016లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పిస్తూ వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.

(రచయిత జయంతి చంద్రశేఖరరావు విశాఖకుచెందిన చరిత్ర పరిశోధకుడు. రచయిత)

click me!