బలవంతపు రాజీనామాలపై ఎదురుతిరిగిన ఉద్యోగులు

First Published Jan 5, 2018, 12:42 PM IST
Highlights
  • పోలీసులను ఆశ్రయించిన ఉద్యోగులు
  • కంపెనీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీ వెరిజాన్ మాజీ ఉద్యోగులు కంపెనీకి వ్యతిరేకంగా గళం విప్పారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది డిసెంబర్ నెలలో వెరిజాన్ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వారిచేత బలవంతంగా బౌన్సర్లతో బెదిరించి మరీ రాజీనామాలు చేయించింది. కాగా.. ఈ విషయంపై బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. 

‘‘కంపెనీ యాజమాన్యం గత ఏడాది డిసెంబర్ నెలలో మీటింగ్‌ రూమ్‌కు ఒక్కొక్కరిని పిలిపించి ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు సంతకాలు చేయాలని ప్రింటెడ్‌ పేపర్లు మా ముందు ఉంచింది. అప్పటికే ఆ గదిలో హెచ్ ఆర్ తోపాటు బౌన్సర్లు కూడా ఉన్నారు. రాజీనామా చేయడానికి కొంత సమయం కావాలని  అడిగినా.. మేనేజ్ మెంట్ ఒప్పుకోలేదు. రాజీనామా పత్రాలపై సంతకం పెట్టడం తప్ప మరో మార్గం లేదని తేల్చి  చెప్పారు.  తమలో కొందరు సీట్లలోంచి లేచి బయటకు రాబోగా బౌన్సర్లు కదలనీయకుండా అదిమిపెట్టారు. మమ్మల్ని మానసికంగా, భౌతికంగా హింసించి రాజీనామా పత్రాలపై సంతకాలు తీసుకున్నారు’’ అని బాధిత ఉద్యోగులు పోలీసులకు వివరించారు. 

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సీసీటీవీ ఫుటేజీలో లభ్యమౌతాయని, వాటిని సేకరించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. తమ ఫిర్యాదును పరిశీలించి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా.. ఉద్యోగులకు నాలుగు నెలల జీతం ఇచ్చి.. రాజీనామా చేయించామని కంపెనీ చెబుతుండగా.. అది అవాస్తవమని బాధిత ఉద్యోగులు చెప్పడం గమానార్హం.

click me!