
అబిడ్స్ లోని రెడ్డి హస్టల్ ని చూసే ఉంటారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గల ఈ హాస్టల్ లో దాదాపు 1000 మంది పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టల్ ని నిర్మించి దాదాపు 100 సంవత్సరాలు కావస్తోంది. మరి దీనిని ఎవరు స్థాపించారు. ఏ ఉద్దేశంతో స్థాపించారో మీకు తెలుసా.. రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమౌతున్న సందర్భంగా దాని గురించి కొన్ని విశేషాలు...
గ్రామీణ ప్రాంత పేద రెడ్డి విద్యార్థులకు నగరంలో వసతి కల్పించి, విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ప్రారంభమైంది రెడ్డి హాస్టల్. 1917లో సామాజిక సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఈ హాస్టల్ ని హైదరాబాద్ నగరంలో స్థాపించారు. ప్రస్తుతం ఈ రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమౌతోంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, జస్టిస్ జీవన్ రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు ఇక్కడ వసతి పొందారు.
ఈ రెడ్డి హాస్టల్ ని రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అని కూడా పిలుస్తారు. నిజాం పాలకుల కాలంలో కొత్వాల్ గా పని చేసిన తొలి హిందువు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి. ఆయన మహబూబ్ నగర్ జిల్లా వాసి.
గ్రామీణ ప్రాంతాల్లోని తమ సామాజిక వర్గాలకు చెందిన బాలబాలికలు నగరంలో చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ హాస్టల్ ని స్థాపించారు. తన సొంత నిధులతో దీనిని ఏర్పాటు చేశారు. ఆ తరువాత ప్రత్యేకంగా బాలికల కోసం ఓ హాస్టల్, బాలుర కోసం ఓ హాస్టల్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా బాలికల పాఠశాల కూడా ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం అది కళాశాలగా రూపాంతరం చెందింది.
ఈ హాస్టల్ లో వసతి పొంది.. విద్యాభ్యాసం చేసిన పలువురు విద్యార్థులు రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో రాణించారు. ఈ హాస్టల్ సాంస్కృతిక కళా కేంద్రంగా కూడా వెలసిల్లింది. పలు సాంస్కృతిక సంస్థలు ఇక్కడే ఊపిరి పోసుకున్నాయనడంలో కూడా సందేహం లేదు.
కేవలం రెడ్డి కులస్థులకే ఈ హాస్టల్ వసతి కల్పించడం విశేషం. వంద సంవత్సరాలు పూర్తి కావస్తున్నందున.. వేడుకలు జరిపేందుకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మరో నూతన హాస్టల్ ని కూడా నిర్మించనుంది.