నోకియా ‘బనానా’ ఫోన్...భలే ఉంది

First Published Mar 2, 2018, 11:56 AM IST
Highlights
  • నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్

ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. భారత మార్కెట్లోకి మరో నోకియా ఫోన్ ని ప్రవేశపెట్టింది. నోకియా 4జీ ఫీచర్ ఫోన్ ఇది. నోకియాకు చెందిన 3310 ఫీచర్ ఫోన్‌కు ఇప్పటికే 4జీ వేరియెంట్ లభిస్తుండగా,  తాజాగా 'నోకియా 8110 4జీ' పేరిట మరో కొత్త 4జీ ఫీచర్ ఫోన్ విడుదలైంది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో యూజర్లకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి.  ఇది నోకియా బనానా ఫోన్. అచ్చం బనానా( అరటిపండు) రంగులో.. దాని పోలినట్టే ఉంటుంది. ఇప్పటివరకు విడుదలైన ఏ కంపెనీ ఫోన్ ఇంత డిఫరెంట్ లుక్ లో లేదు. కేవలం లుక్ మాత్రమే కాదు.. ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.



నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌లో 2.4 ఇంచుల కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కీబోర్డుపై స్లైడర్‌ రూపంలో ఓ కవర్‌ను అమర్చారు. దీన్ని కిందకు స్లైడ్ చేస్తే చాలు ఫోన్ కాల్ ఆటోమేటిక్‌గా లిఫ్ట్ అవుతుంది. స్లైడ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు కాల్ మాట్లాడాక దాన్ని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్‌గా కాల్ ఎండ్ అవుతుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన స్నాప్‌డ్రాగన్ 205 మొబైల్ ప్లాట్‌ఫాం చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 1.1 గిగాహెడ్జ్ సామర్థ్యం ఉన్న డ్యుయల్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఔట్‌లుక్, జీమెయిల్ యాప్స్, స్నేక్ గేమ్ యాప్‌లను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. 

కేవలం బనానా ఎల్లో రంగులోనే కాదు.. నలుపు రంగులో కూడా లభిస్తుంది. దీని ధర రూ.6,340గా ప్రకటించారు. మే నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.20ఏళ్ల క్రితం నోకియా నుంచి వచ్చిన క్లాసిక్ ఫోన్ కి కొత్త హంగులు అద్ది ఈ ఫోన్ ని మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చారు. తొలుత ఈ నోకియా 8110 స్లైడర్  ఫోన్ ని 1996లో విడుదల చేశారు. తర్వాత నోకియా3310 4జీ ఫీచర్ వేరియంట్ ని తీసుకురాగా.. ఇప్పుడు నోకియా బనానా ఫోన్ ని తీసుకువచ్చారు. 1999లో విడుదలైన హాలీవుడ్ సినిమా మ్యాట్సిక్స్ లోనూ నటుడు కియానూ రీవీస్.. ఇదే రకం ఫోన్ ని వాడటం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

click me!