
ఏడుకొండల వాడికి తెలంగాణా నుంచి ఒక అరుదైన కాన్క లభించింది,అది కూడా ఒక చేనేత కార్మికుడి నుంచి. సిరిసిల్ల కు చెందిన నల్ల విజయ్ అంతరించిపోతున్న తన కళ ఎంతగొప్పదో ఏడుకొండలవాడి ముందు ప్రదర్శించారు. అగ్గిపెట్టేలో ఇమిడే పట్టుచీరను స్వయంగా నేసి శ్రీవారికి సమర్పించారు.
నల్ల వారి కుటుంబం నుంచి స్వామి వారికి ఇలాంటి మొక్కుబడి అందడం ఇది రెండో సారి . గతంలో 1987లో విజయ్ తండ్రి నల్లాపరంధాములు కూడా అగ్గిపెట్టేలో పట్టే ఉల్లి పొరంత పల్చటి పట్టుచీరెనుస్వయంగానేసి స్వామి వారికి బహూకరించారు. పరంధాములు మగ్గం ఎన్నో కళాఖండాలను సృష్టించిన ఈ కళ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చే‘నేత’.
తండ్రి స్ఫూర్తితోనే విజయ్ కూడ ఎన్నో కళాఖండాలను మగ్గం మీద సృష్టిస్తున్నారు. 2012లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను తానే తయారుచేసి స్వామివారికి కానుకగా ఇస్తానని ఆయన మొక్కుకున్నారు. ఈ మేరకు ఆయన 60 గ్రాముల బరువు, నాలుగున్నర మీటర్ల పొడవున్న పట్టుచీరె నేశారు.
శుక్రవారం నాడు ఆయన తిరుమల దర్శించి స్వామివారికి ఈ పట్టుచీరెను సమర్పించారు. తిరుమల ఆలయ అధికారులు అభినందించి, విజయ్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ చీరకు 15 వేలు ఖర్చయిందని, నేసేందుకు నెలరోజులు పట్టిందని విజయ్ చెప్పారు. ఈ పట్టుచీర ధర మార్కెట్‌లో రూ. 30 వేలు పలుకుతుందని చెప్పారు. గతంలో ఆయన ఉంగరంలో, దబ్బనంలో ఇమిడే చీరలను కూడా తయారుచేసి ప్రపంచాన్ని విస్మయపరిచారు.